Begin typing your search above and press return to search.

హెచ్-1బీ వీసాలు: ట్రంప్ మారాడు.. భారతీయులకు గుడ్ న్యూస్

అమెరికాలో పనిచేయాలని కలలు కనే అంతర్జాతీయ ఉద్యోగులు, ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు అగ్రరాజ్యం నుంచి ఒక శుభవార్త వినిపిస్తోంది.

By:  A.N.Kumar   |   12 Nov 2025 3:45 PM IST
హెచ్-1బీ వీసాలు: ట్రంప్ మారాడు.. భారతీయులకు గుడ్ న్యూస్
X

అమెరికాలో పనిచేయాలని కలలు కనే అంతర్జాతీయ ఉద్యోగులు, ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు అగ్రరాజ్యం నుంచి ఒక శుభవార్త వినిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా విధానంపై తన వైఖరిని మార్చుకుంటున్నట్లు సంకేతాలు ఇచ్చారు. గతంలో హెచ్-1బీ వీసాలపై కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో ఆందోళన చెందిన నిపుణులకు, ఆయన తాజా వ్యాఖ్యలు ఆశల కిరణాన్ని నింపాయి.

* గతంలో కఠిన నిర్ణయాలు: $100,000 డాలర్ల ఫీజు వివాదం

ట్రంప్ హెచ్-1బీ వీసాలపై తీసుకున్న కఠిన నిర్ణయాలు భారతీయ ఐటీ నిపుణులను ఆందోళనకు గురిచేశాయి. ముఖ్యంగా హెచ్-1బీ వీసాదారులపై $100,000 డాలర్ల (సుమారు రూ. 83 లక్షలు) భారీ ఫీజు విధించాలనే ప్రతిపాదన పెద్ద వివాదానికి దారితీసింది. అమెరికా పౌరుల ఉద్యోగాలను రక్షించడం, వేతనాలు పెంచడం వంటి లక్ష్యాలతో ఆయన ఈ వీసాలపై కఠినంగా వ్యవహరించారు.

* ట్రంప్ తాజా వ్యాఖ్యలు: 'ప్రతిభావంతులు తప్పనిసరి

అయితే ఇటీవల ఒక మీడియా ఇంటర్వ్యూలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఈ ఆందోళనను కొంతవరకు తగ్గించాయి. అమెరికా అభివృద్ధికి ప్రతిభావంతులైన విదేశీ ఉద్యోగుల అవసరం తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. ఒక రిపోర్టర్ ప్రశ్నిస్తూ "అమెరికన్ల వేతనాలు పెంచాలంటే విదేశీయులను ఎందుకు తీసుకుంటున్నారు? హెచ్-1బీ వీసాలు మీకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వబోవట్లేదా?" అని ప్రశ్నించగా ట్రంప్ సమాధానమిచ్చారు. "కొన్ని ప్రతిభలు సహజంగా ఉండవు. వాటిని నేర్చుకోవాలి. నిరుద్యోగుల లైన్లో ఉన్నవారిని తీసుకుని క్షిపణులు తయారు చేయమని చెప్పలేరు. కొన్నిసార్లు విదేశీ నిపుణులు అవసరం అవుతారు."

*జార్జియాలోని హ్యుందాయ్ ప్లాంట్ ఉదాహరణ

ఈ సందర్భంగా ఆయన జార్జియాలోని హ్యుందాయ్ బ్యాటరీ ప్లాంట్ ఉదాహరణను ప్రస్తావించారు. "అక్కడ దక్షిణ కొరియాకు చెందిన ఉద్యోగులను తీసేశారు. కానీ వారు అత్యంత ప్రమాదకరమైన పనులు చేస్తున్నారు. దేశంలో $10 బిలియన్ పెట్టుబడి పెట్టి, నిరుద్యోగులను తీసుకుని క్షిపణులు తయారు చేయమని చెప్పడం సాధ్యం కాదు" అని ఆయన పేర్కొన్నారు. అంటే సాంకేతిక నైపుణ్యం అవసరమైన పరిశ్రమల్లో విదేశీ నిపుణుల పాత్రను ఆయన పరోక్షంగా అంగీకరించారు.

*అంతర్జాతీయ ప్రతిభకు శుభసూచకం

ట్రంప్ ఈ వ్యాఖ్యలతో హెచ్-1బీ వీసా విధానంపై తన వైఖరి సానుకూలంగా మారిందనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. అమెరికా పరిశ్రమల్లో ఉన్న సాంకేతిక నైపుణ్యాల కొరతను పూరించడానికి విదేశీ నిపుణుల అవసరాన్ని ఆయన బహిరంగంగా అంగీకరించారు. రాబోయే రోజుల్లో హెచ్-1బీ వీసా విధానంలో కొంత సరళత ఏర్పడే అవకాశం ఉందని, ఇది అమెరికాలో పనిచేయాలనుకునే అంతర్జాతీయ ప్రతిభావంతులకు ఒక శుభసూచక పరిణామంగా భావిస్తున్నారు.