Begin typing your search above and press return to search.

నాన్న ట్రంప్ యుద్ధాలు చేస్తే.. కొడుకులేమో ఆయుధ వ్యాపారం.. భలేగుందీ పో మీ స్ట్రాటజీ

తండ్రి నిర్ణయించే యుద్ధాలు... కొడుకులు కాచుకునే లాభాలు! అమెరికా అధ్యక్ష పదవిని, ట్రంప్ తనయుల ఆయుధ వ్యాపారాన్ని ఇప్పుడు జోడెద్దుల్లా సాగుతున్నాయి.

By:  A.N.Kumar   |   10 March 2026 8:32 PM IST
నాన్న ట్రంప్ యుద్ధాలు చేస్తే.. కొడుకులేమో ఆయుధ వ్యాపారం.. భలేగుందీ పో మీ స్ట్రాటజీ
X

తండ్రి నిర్ణయించే యుద్ధాలు... కొడుకులు కాచుకునే లాభాలు! అమెరికా అధ్యక్ష పదవిని, ట్రంప్ తనయుల ఆయుధ వ్యాపారాన్ని ఇప్పుడు జోడెద్దుల్లా సాగుతున్నాయి. యుద్ధం అమెరికాకు వ్యూహాత్మక అవసరం అయితే, ట్రంప్ కుటుంబానికి అది లాభదాయకమైన వ్యాపారంగా మారింది. అమెరికా ఒకవైపు యుద్ధ తంత్రాలను రచిస్తుంటే... మరోవైపు ట్రంప్ కుటుంబం అదే యుద్ధం నుంచి లాభాలను పొందుతుందా? అధ్యక్షుడి కుమారులు రక్షణ రంగ సంస్థల్లో భారీ పెట్టుబడులు పెట్టడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో నైతికతకు, వ్యాపార ప్రయోజనాలకు మధ్య జరుగుతున్న యుద్ధంగా మారింది. యుద్ధ వాతావరణాన్ని సొమ్ము చేసుకునే దిశగా డొనాల్డ్ ట్రంప్ తనయులు అడుగులు వేస్తున్నారన్న ఆరోపణలు ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో 'కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్' అనే కొత్త వివాదానికి తెరతీశాయి.

అమెరికా రాజకీయాల్లో డొనాల్డ్ ట్రంప్ కుటుంబం నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు తెరపైకి వచ్చిన అంశం కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా అత్యున్నత నైతిక ప్రమాణాల చుట్టూ తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఒకవైపు ఇరాన్‌తో ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా అస్థిర పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధ తంత్రాలను రచిస్తుంటే.. మరోవైపు ఆయన కుమారులు ఎరిక్ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్లు ఆయుధ వ్యాపారంలో కీలక పెట్టుబడులు పెట్టడం అమెరికా రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది.

‘పవరస్’ పెట్టుబడులు.. రేగుతున్న విమర్శలు

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డ్రోన్ టెక్నాలజీకి విపరీతమైన డిమాండ్ ఉంది. మిలిటరీ అవసరాల కోసం అటానమస్ డ్రోన్లను తయారు చేసే ‘పవరస్’ అనే సంస్థలో ట్రంప్ తనయులు భారీగా పెట్టుబడులు పెట్టడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. సాధారణంగా యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు రక్షణ రంగ పరికరాల తయారీ కంపెనీల షేర్లు, డిమాండ్ అమాంతం పెరుగుతాయి. ఈ తరుణంలో అధ్యక్షుడి కుమారులు నేరుగా మిలిటరీ టెక్నాలజీ సంస్థలో పెట్టుబడి పెట్టడం, ఆ వ్యాపార ప్రయోజనాలను రాజకీయ నిర్ణయాలతో ముడిపెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

‘కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్’ - ప్రజాస్వామ్యానికి సవాల్?

రాజకీయ విశ్లేషకులు దీనిని స్పష్టమైన ‘కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్’ గా అభివర్ణిస్తున్నారు. అమెరికా తీసుకునే యుద్ధ తంత్ర నిర్ణయాలు ఆయుధాల మార్కెట్‌ను శాసిస్తాయి. ఉదాహరణకు, ఒక ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగితే, ఆయుధాల అమ్మకాలు పెరుగుతాయి. అటువంటప్పుడు, నిర్ణయాధికారం ఉన్న స్థానంలో ఉన్న వ్యక్తి కుటుంబం, అదే యుద్ధ సామగ్రిని తయారు చేసే పరిశ్రమలో భాగస్వాములు కావడం ఏ రకమైన ప్రజాస్వామ్య విలువలోనని విపక్షాలు నిలదీస్తున్నాయి.

“ప్రభుత్వ విధానాల ద్వారా వచ్చే లాభాలు, కుటుంబ వ్యాపార లాభాలతో మిళితమైతే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం” అని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పారదర్శకత లోపించడం వల్ల, అధ్యక్షుడు తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక దేశ ప్రయోజనాల కంటే వ్యక్తిగత వ్యాపార ప్రయోజనాలే ఉన్నాయేమోనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

సమర్థనలో ట్రంప్ మద్దతుదారులు

మరోవైపు ట్రంప్ అనుచరులు ఈ విమర్శలను పూర్తిగా తోసిపుచ్చుతున్నారు. ఎరిక్ మరియు డొనాల్డ్ జూనియర్లు స్వతంత్ర వ్యాపారవేత్తలని, వారు తమ సొంత డబ్బుతో టెక్నాలజీ రంగంలో పెట్టుబడులు పెట్టే హక్కు వారికి ఉందని వాదిస్తున్నారు. దీనిని రాజకీయ కోణంలో చూడటం దురుద్దేశపూర్వకమని, కేవలం సాంకేతిక రంగంలో వృద్ధిని చూసే వారు పెట్టుబడి పెట్టారని వారు పేర్కొంటున్నారు. వ్యాపార నిర్ణయాలను, ప్రభుత్వ పాలనాపరమైన నిర్ణయాలతో ముడిపెట్టడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు.

వేడెక్కుతున్న అమెరికా రాజకీయం

ఏది ఏమైనప్పటికీ యుద్ధం అంటే రక్తపాతం మాత్రమే కాదు, అది ఒక పెద్ద వ్యాపారమని మరోసారి నిరూపితమవుతోంది. ట్రంప్ కుటుంబం ఈ వ్యాపార నిర్ణయాలతో నైతికతను పణంగా పెట్టిందా లేదా అనేది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది. రాబోయే ఎన్నికలు, తదుపరి రాజకీయ పరిణామాలు ఈ వ్యవహారాన్ని ఏ మలుపు తిప్పుతాయోనన్నది ఆసక్తికరంగా మారింది. అమెరికా ప్రజల దృష్టిలో ఈ ‘వార్ బిజినెస్’ ఎలాంటి ముద్ర వేస్తుందో వేచి చూడాలి.