Begin typing your search above and press return to search.

ట్రంప్‌ గురిగా వరుస దాడుల యత్నాలు: భద్రతా లోపమా? అంతర్జాతీయ కుట్ర కోణమా?

అమెరికా అధ్యక్షుడు, ప్రస్తుత రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నేత డొనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా వరుస ఘటనలు చోటుచేసుకుంటుండటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది.

By:  A.N.Kumar   |   24 May 2026 7:00 PM IST
ట్రంప్‌ గురిగా వరుస దాడుల యత్నాలు: భద్రతా లోపమా? అంతర్జాతీయ కుట్ర కోణమా?
X

అమెరికా అధ్యక్షుడు, ప్రస్తుత రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నేత డొనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా వరుస ఘటనలు చోటుచేసుకుంటుండటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఒకే ఏడాదిలో మూడుసార్లు ట్రంప్ భద్రతపై ప్రశ్నలు తలెత్తేలా ప్రమాదకర పరిణామాలు ఎదురుకావడం అంతర్జాతీయ రాజకీయ వర్గాలను తీవ్రంగా కలవరపెడుతోంది. ఇవి కేవలం సాధారణ భద్రతా లోపాలేనా..? లేక దీని వెనుక డొనాల్డ్ ట్రంప్‌ను అంతమొందించేందుకు ఏదైనా పెద్ద అంతర్జాతీయ కుట్ర దాగి ఉందా..? అనే అనుమానాలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

ఒకే ఏడాదిలో మూడు ఘోర ఘటనలు

ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రంప్ ఫ్లోరిడాలోని నివాసం సమీపంలో అత్యంత భారీ భద్రతా ఉల్లంఘన చోటుచేసుకుంది. ఆయుధాలతో సంచరిస్తున్న ఓ గుర్తుతెలియని వ్యక్తి ట్రంప్ నివాసంలోకి చొరబడేందుకు ప్రయత్నించాడు. అయితే అమెరికా సీక్రెట్ సర్వీస్ సిబ్బంది అప్రమత్తమై అతడిని అక్కడికక్కడే కాల్చిచంపారు. ఆ సమయంలో ట్రంప్ అక్కడ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. అయినప్పటికీ అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అధ్యక్షుడి నివాసంలోకి సాయుధుడు ఎలా రాగలిగాడనే అంశం అమెరికా భద్రతా వ్యవస్థలపై తీవ్ర విమర్శలకు కారణమైంది.

ఆ ఘటన మరవకముందే.. ఏప్రిల్ 25న నిర్వహించిన ప్రఖ్యాత 'వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్' సందర్భంగా కూడా తీవ్ర అనుమానాస్పద పరిస్థితులు నెలకొన్నాయి. ట్రంప్‌కు ప్రాణ ముప్పు ఉందంటూ ఇంటెలిజెన్స్ నుంచి పక్కా సమాచారం రావడంతో భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి. అప్పటి నుంచి ట్రంప్ భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు ప్రకటించారు. కానీ, నెల తిరగకముందే మరోసారి ఆయనపై దాడి యత్నం వెలుగులోకి రావడం అమెరికా రాజకీయ వర్గాలను తీవ్ర షాక్‌కు గురిచేసింది.

ఇరాన్ బౌంటీ.. అంతర్జాతీయ కుట్ర కోణం?

ట్రంప్‌పై జరుగుతున్న వరుస దాడుల వెనుక విదేశీ శక్తుల హస్తం ఉండొచ్చని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు బలంగా భావిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం.. ఇటీవల ఇరాన్‌కు అనుకూల వర్గాలు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పై 58 మిలియన్ డాలర్ల (భారీ మొత్తం) బౌంటీ (నగదు బహుమతి) ప్రకటించారనే వార్తలు బయటకు రావడం.

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నడుస్తున్న సుదీర్ఘ విభేదాలు, అమెరికా జోక్యం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ బెదిరింపులను అమెరికా నిఘా సంస్థలు అత్యంత సీరియస్‌గా తీసుకుంటున్నాయి. ట్రంప్ గతంలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇరాన్‌పై తీసుకున్న కఠిన నిర్ణయాల వల్లే ఇప్పుడు ఆయనను టార్గెట్ చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

ట్రంప్‌పై దాడి యత్నాలు ఊపందుకోవడం రాజకీయ కుట్ర కోణాన్నీ బలపరుస్తోంది. ఇప్పటికే ట్రంప్‌కు అనుకూల వర్గాలు, రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు ఇది కేవలం యాదృచ్ఛికం కాదని మండిపడుతున్నారు. ఆయనను రాజకీయంగా ఎదుర్కొనలేక, శారీరకంగానే టార్గెట్ చేస్తున్నారని ఆరోపిస్తూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దర్యాప్తు రంగంలోకి ఎఫ్.బీ.ఐ

ప్రస్తుత పరిస్థితుల తీవ్రతను పరిగణనలోకి తీసుకుని అమెరికా సీక్రెట్ సర్వీస్, ఎఫ్‌బీఐ తదితర అగ్రశ్రేణి నిఘా సంస్థలు పూర్తి స్థాయి దర్యాప్తును ప్రారంభించాయి. అంతర్గత భద్రతా వైఫల్యాలతో పాటు విదేశీ శక్తుల ప్రమేయంపై కూడా ఆరా తీస్తున్నాయి. ట్రంప్ భద్రతను ఇకపై మునుపెన్నడూ లేని విధంగా అత్యున్నత స్థాయికి పెంచాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

ఏది ఏమైనప్పటికీ.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా చెప్పుకునే అమెరికాలో ఒక కీలక నేతపై వరుస దాడులు జరగడం కేవలం 'భద్రతా వైఫల్యమా' లేక 'అంతర్జాతీయ కుట్ర' ఫలితమా అన్న ప్రశ్న ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ దర్యాప్తులో ఎలాంటి నిజాలు బయటపడతాయో అని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.