‘టైమ్ వేస్ట్’.. సడన్ గా మారిన డొనాల్డ్ ట్రంప్ వైఖరి!
రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ తో బుడాపెస్ట్ లో జరగాల్సిన సమావేశం వాయిదా పడిన విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
By: Raja Ch | 22 Oct 2025 11:27 AM ISTఆరు నూరైనా, నూరు ఆరైనా.. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ఆపాలని.. ప్రపంచ వ్యాప్తంగా తొమ్మిదో యుద్ధాన్ని ఆపినట్లు ప్రకటించుకోవాలని.. మళ్లీ పట్టైనా తనకు నోబెల్ శాంతి బహుమతి దక్కాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెగ పరితపించిపోతున్న సంగతి తెలిసిందే! అయితే.. ఈ విషయంలో అలకో, ఆగ్రహమో తెలియదు కానీ.. ఇటు ఉక్రెయిన్, అటు రష్యాల విషయంలో ట్రంప్ వైఖరి మారినట్లు కనిపిస్తోంది.
అవును... రష్యా హస్తగతమైన భూభాగాన్ని తిరిగి పొందాలంటే ఉక్రెయిన్ కొంత భూమిని ఇచ్చుకోక తప్పదు అని గతంలో మాట్లాడిన ట్రంప్ మాటల్లో తేడా కనిపించింది. తాజాగా విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. యుద్ధంలో రష్యాను ఓడించడం ఉక్రెయిన్ కు సాధ్యమే అయినా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఉక్రెయిన్ విజయ సామర్థ్యంపై అనుమానం కలుగుతోందని చెప్పారు.
'సమయం వృధా చేయాలనుకోవడం లేదు'!:
రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ తో బుడాపెస్ట్ లో జరగాల్సిన సమావేశం వాయిదా పడిన విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ విషయంపై మాట్లాడిన ఆయన... 'నేను వృధా సమావేశం కోరుకోవడం లేదు.. సమయం వృధా చేయాలనుకోవడం లేదు.. ఏమి జరుగుతుందో చూద్దాం' అని వైట్ హౌస్ వద్ద విలేకరులతో అన్నారు.
వాస్తవానికి కొద్ది రోజుల క్రితం, పుతిన్ తో సమావేశానికి సిద్ధంగా ఉన్నానని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ ప్రతిపాదన యూరోపియన్ మిత్రదేశాలను, కైవ్ ను ఆందోళనకు గురిచేసింది. ఈ సమావేశం మాస్కోకు సమర్థవంతంగా ప్రతిఫలమివ్వగలదేమో అని భయపడుతున్నారు!
ఈ నేపథ్యంలో... 'సమీప భవిష్యత్తులో ట్రంప్ – పుతిన్ శిఖరాగ్ర సమావేశానికి ఎలాంటి ప్రణాళికలు లేవని వైట్ హౌస్ ధృవీకరించింది. ఇదే సమయంలో... ఇటీవలి దౌత్య ప్రయత్నాలు కాల్పుల విరమణ దిశగా పురోగతి సాధించడంలో విఫలమయ్యాయని పేర్కొంది.
'పుతిన్ హమాస్ లాంటివాడు కాదు'!:
తాజా పరిణామాల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... రష్యాపై ట్రంప్ మరింత కఠినంగా వ్యవహరించాలని.. పుతిన్ హమాస్ లాంటివాడు కాదని.. ఇంకా బలమైనవాడని.. అందుకే ఆయనపై ఎక్కువ ఒత్తిడి అవసరమని చెప్పారు. ఇదే సమయంలో.. అమెరికా తమకు దీర్ఘశ్రేణి తోమహాక్ క్షిపణులు అందించాలని విజ్ఞప్తి చేశారు.
పుతిన్ పెట్టిన మెలికే కారణమా?:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ మధ్య గత వారం జరిగిన సుదీర్ఘ ఫోన్ కాల్ సంభాషణలో ఓ కీలక విషయం ప్రస్తావనకు వచ్చినట్లు వైట్ హౌస్ అధికారులను ఉటంకిస్తూ వాషింగ్టన్ పోస్ట్ ఓ ఆసక్తికర కథనం అందించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... దొనెట్స్క్ ప్రాంతాన్ని తమకు అప్పగించి తీరాల్సిందేనని పుతిన్ పట్టుపడుతున్నారని.. అందుకు ఉక్రెయిన్ ఒప్పుకోవడం లేదని తెలిపింది.
ఇప్పటి తమ సేనల ఆధీనంలో ఉన్న జపొరిజియా, ఖేర్సాన్ ప్రాంతాలను ఉక్రెయిన్ కు అప్పజెప్పేందుకు సానుకూలతను వ్యక్తం చేసిన పుతిన్.. దీనికి ప్రతిగా ఉక్రెయిన్.. దొనెట్స్క్ ప్రాంతాన్ని సంపూర్ణంగా తమకు అప్పగించాలని కోరినట్లు ఆ కథనం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ - పుతిన్ భేటీ వాయిదా పడినట్లుందనే ప్రచారమూ జరుగుతుంది.
