అణ్వాయుధ సిబ్బందికి లేఆఫ్ లు... అమెరికాలో ఏమి జరుగుతుంది?
రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు అటు ప్రపంచదేశాలనే కాకుండా సొంత ప్రజానికాని షాక్ కి గురిచేస్తున్నాయనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.
By: Raja Ch | 18 Oct 2025 10:58 AM ISTరెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు అటు ప్రపంచదేశాలనే కాకుండా సొంత ప్రజానికాని షాక్ కి గురిచేస్తున్నాయనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను ఇంటికి పంపిన ట్రంప్ సర్కార్.. తాజాగా జాతీయ భద్రతపై ఆందోళనలు రేకెత్తించే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
అవును... యునైటెడ్ స్టేట్స్ అణ్వాయుధాల రూపకల్పన, నిర్మాణం, నిర్వహణ, భద్రపరిచే బాధ్యత కలిగిన ఏజెన్సీ.. నేషనల్ న్యూక్లియర్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (ఎన్.ఎన్.ఎస్.ఏ) సిబ్బందిని తొలగించనుందని తెలుస్తోంది. ఫెడరల్ ప్రభుత్వ షట్ డౌన్ కారణంగా ఎన్.ఎన్.ఎస్.ఏ సిబ్బంది త్వరలో భారీ తొలగింపులను ఎదుర్కొంటారని ఇంధన కార్యదర్శి క్రిస్ రైట్ చెప్పారు. ఈ విషయం సంచలనంగా మారింది.
ఈ సందర్భంగా యూఎస్ ప్రభుత్వ షట్ డౌన్ ఎన్.ఎన్.ఎస్.ఏ ఉద్యోగులను తొలగించవలసి రావచ్చని హౌస్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ శుక్రవారం హెచ్చరించారు. ఎన్.ఎన్.ఎస్.ఏ... మా అణు నిల్వలను నిర్వహించే సమూహం, వారు ఉపయోగిస్తున్న క్యారీఓవర్ నిధులు అయిపోబోతున్నాయని తమకు సమాచారం అందిందని.. సుమారు 80 శాతం మందిని తొలగించాల్సి ఉంటుందని రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు మైక్ రోజర్స్ అన్నారు.
ఇదే క్రమంలో... వచ్చే వారం నుండి మన జాతీయ భద్రతకు కీలకమైన పదివేల మంది కార్మికులను మేము తొలగించాల్సి వస్తుందని ఎన్.ఎన్.ఎస్.ఏ కాంట్రాక్టర్ వర్క్ ఫోర్స్ కు చెందిన రైట్ తెలిపారు. ఇక.. ఏజెన్సీ ఫెడరల్ వర్క్ ఫోర్స్ లోని కొన్ని భాగాలకు అక్టోబర్ 17 నుండి సెలవులు ప్రారంభమవుతాయని నోటీసు అందిందని, ముగ్గురు ఏజెన్సీ ఉద్యోగులు తెలిపారని స్థానిక మీడియా నివేధించింది. ఇవి ఆలస్యమైతే అక్టోబర్ 20 నుంచి మొదలవుతాయని తెలిపారు.
ఈ నేపథ్యంలో... అమెరికా జాతీయ భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపైనా రైట్ స్పందించారు. ఇందులో భాగంగా... ఏజెన్సీలో చాలామంది ఉద్యోగులు దేశానికి సంబంధించిన ముఖ్యమైన వ్యూహాత్మక ఆస్తిని నిర్వహిస్తున్నారని.. అందులో భద్రత, అత్యవసర సిబ్బంది విధుల్లోనే ఉంటారని తెలిపారు. తాము ఇప్పటికే ఉన్న ఆయుధాగారాన్ని చెక్కుచెదరకుండా ఉంచబోతున్నామని.. అందువల్ల జాతీయ భద్రతపై ఎలాంటి ఆందోళన వద్దని స్పష్టం చేశారు.
