నోబెల్ కోసం ట్రంప్ పిల్లిమొగ్గలు!
ప్రపంచ ప్రఖ్యాత శాంతి బహుమతి.. నోబెల్. దీనిని సాధించుకునేందుకు అనేక మంది కలలు కంటారు. అయితే.. వారు డిమాండ్ చేసి దీనిని దక్కించుకోరు.
By: Garuda Media | 3 Oct 2025 3:00 PM ISTప్రపంచ ప్రఖ్యాత శాంతి బహుమతి.. నోబెల్. దీనిని సాధించుకునేందుకు అనేక మంది కలలు కంటారు. అయితే.. వారు డిమాండ్ చేసి దీనిని దక్కించుకోరు. సమాజ సేవ, ప్రజలకు విస్తృత ప్రయోజనాలు కలిగిం చే పనులు చేయడం ద్వారా.. నోబెల్ శాంతి బహుమతిని దక్కించుకున్నవారు ఎందరో ఉన్నారు. అయితే .. ఈ పురస్కారం కోసం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిల్లి మొగ్గలు వేస్తున్నారు. దీనిని తనకే ఇవ్వాలని కొన్నాళ్లుగా ఘీంకరిస్తున్న ఆయన.. అనేక వ్యాఖ్యలు చేస్తున్నారు.
ప్రపంచ దేశాల మధ్య సఖ్యత కూర్పు కోసం తాను అలుపెరుగని పనిచేస్తున్నానని ట్రంప్ చెబుతున్నారు. భారత్ - పాకిస్థాన్ సహా.. ప్రపంచ వ్యాప్తంగా ఏడు దేశాల మధ్య నెలకొన్న యుద్ధాలను తాను నివారించాన ని.. ఆయా దేశాల ప్రజలను కడుపులో పెట్టుకుని చూస్తున్నానని ఆయన నొక్కి వక్కాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ శాంతి దూతగా తనను గుర్తించాలని, తనకే నోబెల్ పురస్కారం అందించాలని నిన్న మొన్నటి వరకు వాదించారు. అయితే.. కొన్నాళ్లుగా ఈ శాంతి పురస్కారం.. రచయితలకు దక్కుతోంది.
ఇప్పుడు ఈ విషయాన్ని కూడా ప్రస్తావించిన ట్రంప్.. పుస్తకాలు రాయడం ద్వారా శాంతిని బోధించే వారికి కాదు.. కదనరంగంలోకి దూకి.. ప్రపంచ దేశాల మధ్య స్నేహం చిగురించేలా చేస్తున్న తనకు దక్కాలని చెబుతున్నారు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధంగా ట్రంప్ స్పందిస్తున్నారు. ప్రపంచ దేశాలను కూడా మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే కొన్నాళ్ల కిందట.. భారత దేశ మద్దతును కూడా.. ట్రంప్ ఆకాంక్షించారు. అయితే..ప్రధాని మోడీ ఈ విషయంలో మౌనంగా ఉన్నారు.
ఈ క్రమంలోనే భారత్‌పై సుంకాల కొరడా ఝళిపించారన్న వాదన ఉంది. ఇక, ఇప్పుడు మరో వాదనను ట్రంప్ తెరమీదికి తెచ్చారు. అమెరికా పౌరులంతా కూడా.. తనకు మద్దతుగా నిలవాలని, ఆన్‌లైన్ ఉద్యమా న్ని విస్తృతం చేయాలని పిలుపునిచ్చారు. శాంతి బహుమతి దక్కించుకునేందుకు తనకు అన్ని అర్హతలు ఉన్నాయని ఆయన చెబుతున్నారు. అంతేకాదు.. అసలు తనకు ఇవ్వడం అంటే.. దేశానికి ఇవ్వడమేనని వ్యాఖ్యానిస్తున్నారు. ఒక వేళ ఈ దఫా శాంతి బహుమతి తనకు దక్కకపోతే.. ఇంతకన్నా ఘోర అవమానం .. అమెరికాకు మరొకటి ఉండదని కూడా చెబుతున్నారు. కాగా.. ఈ నెల 10న నోబెల్ పురస్కారంపై ప్రకటన ఉండనుంది. మరి ట్రంప్ ఆశలు ఏమేరకు నెరవేరుతాయో చూడాలి.
