మోదీ ప్లాన్ రివర్స్.. మీడియా రానివ్వద్దు అంటే.. 45 నిమిషాలు ప్రశ్నల వర్షం కురిపించిన ట్రంప్
అమెరికా పర్యటనలు.. అగ్రరాజ్యాల అధినేతలతో భేటీలు అంటేనే మన భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఉండే క్రేజ్ వేరు.
By: A.N.Kumar | 25 Aug 2026 10:57 PM ISTఅమెరికా పర్యటనలు.. అగ్రరాజ్యాల అధినేతలతో భేటీలు అంటేనే మన భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఉండే క్రేజ్ వేరు. అయితే ఎప్పుడూ పక్కా స్క్రిప్ట్, వ్యూహాత్మక ప్రణాళికలతో వెళ్లే మన బృందానికి.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శైలి మాత్రం ఓ పెద్ద సవాలుగానే నిలిచింది. ఇటీవల అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించిన ఓ పాత భేటీ ముచ్చట ఇప్పుడు విశ్లేషకులకు బాగా వినోదాన్ని అందిస్తోంది.
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసిందంటే... "నాయకులు మాట్లాడతారు.. కెమెరాలు మెరుస్తాయి.. కానీ జర్నలిస్టులు మాత్రం నోరు విప్పకూడదు" అని అమెరికా వర్గాలకు ముందే చెప్పేసింది. మోదీకి మీడియా ప్రశ్నలు ఎదుర్కోవడం అంతగా అలవాటు లేదన్న సంగతి ప్రపంచానికే ఎరుకే కదా.. ఈ నిబంధనకు మొదటికైతే ట్రంప్ "సరేలే" అని తలాడించారు. మోదీ టీమ్ కూడా "అబ్బా... గండం గడిచింది.. ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రశాంతంగా ముగుస్తుంది" అని ఊపిరి పీల్చుకుంది.
తీరా సమావేశం మొదలయ్యాక కథ అడ్డం తిరిగింది. నేతలిద్దరూ తమ ప్రారంభ వ్యాఖ్యలు పూర్తి చేసారో లేదో... మన ట్రంప్ మామకు తన పాత ముచ్చట్ల సరదా ఆగలేదు. ఎదురుగా ఉన్న జర్నలిస్టులను చూసి “ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?” అంటూ స్వయంగా ఆహ్వానించేశారు. ఇక అంతే... కెమెరాల మైకులు ముందుకు వచ్చాయి, జర్నలిస్టులు వరుసబెట్టి ప్రశ్నల వర్షం కురిపించారు.
మొదట "నో క్వశ్చన్స్" అని ప్లాన్ చేసుకున్న భేటీ కాస్తా.. ఏకంగా 45 నిమిషాల సుదీర్ఘ మీడియా సమరంగా మారిపోయింది. ట్రంప్ తనదైన శైలిలో బిజీగా సమాధానాలు ఇస్తుంటే పక్కనే కూర్చున్న మోదీ బృందానికి ఏం చేయాలో పాలుపోక సైలెంట్‌గా చూడాల్సి వచ్చింది. స్వేచ్ఛాయుత మీడియాకు పెట్టింది పేరైన అమెరికా గడ్డపై.. మీడియాను దూరంగా పెట్టాలనుకున్న ప్రధాని మోదీ వ్యూహానికి ట్రంప్ ఇలా ఊహించని షాక్ ఇచ్చారన్నమాట..
ఏది ఏమైనా "మేము చెప్పిందే స్క్రిప్ట్" అనుకునే భారత ప్లానర్లకు.. ట్రంప్ "నా రూటే వేరు" అని నిరూపించిన ఈ ఉదంతం డిప్లొమాటిక్ వర్గాల్లో భలే సరదాగా మిగిలిపోయింది.
