Begin typing your search above and press return to search.

డిజటల్ యుగ తుగ్లక్ గా ట్రంప్ నిలవనున్నారా?

సాఫీగా సాగిపోవటం కొందరికి అస్సలు ఇష్టం ఉండదు. సంబంధం లేని అంశాల్ని తెర మీదకు తీసుకురావటం.. సంబంధం లేని అంశాల్ని ఒక దగ్గరకు తీసుకొచ్చి.. ముడులు వేయటం..

By:  Garuda Media   |   5 Sept 2025 3:00 PM IST
డిజటల్ యుగ తుగ్లక్ గా ట్రంప్ నిలవనున్నారా?
X

సాఫీగా సాగిపోవటం కొందరికి అస్సలు ఇష్టం ఉండదు. సంబంధం లేని అంశాల్ని తెర మీదకు తీసుకురావటం.. సంబంధం లేని అంశాల్ని ఒక దగ్గరకు తీసుకొచ్చి.. ముడులు వేయటం.. వాటికి అసందర్భమైన పోలికి తీసుకొచ్చి... తర్కానికి అందని పిడి వాదనను వినిపించటం.. కాదన్నోళ్ల మీద కయ్యిమనటం.. తన తప్పుడు నిర్ణయాలతో తన చేతికి పాలనా అధికారాన్ని కట్టబెట్టిన వారికి చుక్కలు చూపించటం లాంటివెన్నో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లో కనిపిస్తాయి.

ప్రజాస్వామ్య ప్రపంచంలో అత్యంత నిలకడలేని అధినేతగా ఆయన తన పేరును సుస్థిరం చేసుకుంటున్నారు. ఇవాల్టి మిత్రుడు రేపటి శత్రువుగా.. అదే సందర్భంలో తిట్టిన నోటితో పొగడటం.. సాయం చేసిన చేతికి తెగనరకటం లాంటి సంబంధం లేని అంశాలకు కేరాఫ్ అడ్రస్ గా ట్రంప్ నిలుస్తారు. అతగాడి పాలనను చూస్తే.. భారత దేశ చరిత్రలో అత్యంత విఫల రాజుగా.. ప్రజల్ని తన పిచ్చి చేష్టలతో పీక్కుతిన్న మహ్మద్ బిన్ తుగ్లక్ గుర్తుకు వస్తారు. అతడి ప్రభావం ఎంతంటే.. అతడి పాలన పోయి వందల ఏళ్లు గడిచిన తర్వాత కూడా పిచ్చి పనులు చేసేటోళ్లను తుగ్లక్ మాదిరి చేయొద్దని చెప్పటం కనిపిస్తుంది.

తొందరపాటు.. అసందర్భమైన నిర్ణయాలతో తనను ఎన్నుకున్న ప్రజలను మాత్రమే కాదు.. ప్రపంచానికి పెద్దన్న హోదాను అపహాస్యం చేసిన ఘనత ట్రంప్ సొంతమని చెప్పాలి. తొందరపాటునిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ గా ఆయన నిలుస్తారు. ఇదంతా చూసినప్పుడు నేటి డిజిటల్ ప్రపంచ తుగ్లక్ గా ట్రంప్ నిలుస్తారు. అలా ఎలా అంటారని కొందరు ప్రశ్నించొచ్చు. పాలనలో తుగ్లక్ తీసుకున్న నిర్ణయాలకు తగ్గట్లే ట్రంప్ తీరు దగ్గరగా ఉండటం ఆసక్తికర అంశంగా చెప్పాలి. అదెలా అన్నది అంశాల వారీగా చూస్తే.. ఇట్టే అర్థమవుతుంది.

- ఆకస్మిక నిర్ణయాలు.. విధాన పరంగా స్థిరత్వం లేకపోవటం తుగ్లక్ లో కనిపిస్తుంది. అదే విధంగా ట్రంప్ లోనూ. తుగ్లక్ రాజుగా వ్యవహరించే వేళ రాజధానిగా ఉన్న ఢిల్లీని దౌలతాబాద్ కు మార్చటం.. ఆ తర్వాత తిరిగి ఢిల్లీకి మార్చటం కనిపిస్తుంది. అదే విధంగా ట్రంప్ సైతం సోషల్ మీడియా వేదికగా తన విధానపరమైన నిర్ణయాలు తీసుకోవటం కనిపిస్తుంది. తుగ్లక్ తన పాలనలో అప్పటికే చలామణిలో ఉన్న నాణెలకు బదులుగా తామ్ర నాణేల్ని తీసుకురాగా.. చివరకు నకిలీ నాణేలతో అప్పటి ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింది.

తాజాగా ట్రంప్ విషయానికి వస్తే సుంకాల పేరుతో పలు దేశాల మీద విరుచుకుపడటం కనిపిస్తుంది. చైనా మీద విధించిన సుంకాల విషయంలో ట్రంప్ నిర్ణయం తేడా కొట్టి అమెరికన్ల మీదనే ధరల భారం పడటంతో దెబ్బ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. తుగ్లక్ తన మనసుకు వచ్చిన ఆలోచనలు బ్రహ్మండం.. తనకు మించిన ముందు చూపు మరెవరికీ ఉండదన్నట్లుగా ఆయన వ్యవహరించేవారు. తుగ్లక్ మాదిరే ట్రంప్ సైతం హటాత్తు నిర్ణయాలు తీసుకోవటం మొనగాడిగా చెప్పాలి.

రాజకీయంగా నిర్ణయాలు తీసుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలి.కానీ.. తుగ్లక్ అలా వ్యవహరించేవారు కాదు. లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా తన రాజధానిని దక్షిణాదికిఒకసారి.. కొంతకాలానికి తిరిగి ఢిల్లీకి అన్నట్లుగా మార్చేసినట్లే.. ట్రంప్ తన విదేశాంగ విధానంలోనూ అలాంటి తీరునే ప్రదర్శించటం కనిపిస్తుంది. మిత్రదేశాలతో ఒక రోజు స్నేహం.. మరోరోజు శత్రుత్వం చూపించటం ట్రంప్ కు మాత్రమే సాధ్యమయ్యే వ్యవహారంగా చెప్పాలి. తుగ్లక్ పాలనలోవిఫలమైన నిర్ణయాలు పెద్ద నష్టాన్ని కలిగించాయి. అయితే.. ట్రంప్ నిర్ణయాలు అమెరికా సంస్థాగత నియంత్రణకు కాస్త సాయం చేశాయని చెప్పేవాళ్లు ఉన్నారు. అయితే.. ప్రపంచంలో ఒకలాంటి అలజడికి కారణమయ్యారని మాత్రం చెప్పొచ్చు. మొత్తంగా చూస్తే.. డిజిటల్ ప్రపంచంలో అభినవ తుగ్లక్ గా ట్రంప్ ను చెప్పక తప్పదు.