ట్రంప్ ఆశలు.. అడియాశలు.. ఈ‘సారీ’ నోబెల్ రానట్టే.. కారణమిదే
ఒబామా 2009లో అణ్వాయుధ నిరోధక చర్యలు, అంతర్జాతీయ సహకారం కోసం చేసిన కృషికి గుర్తింపుగా నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు.
By: A.N.Kumar | 10 Oct 2025 11:58 AM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి గెలుచుకోవాలన్న ఆశలు గల్లంతయ్యాయి. పలు యుద్ధాలు ఆపి, ప్రపంచ శాంతి కోసం కృషి చేశానని ట్రంప్ బలంగా వాదించినప్పటికీ, ఈసారి నోబెల్ కమిటీ ఆయన పేరును పరిగణనలోకి తీసుకోలేదు. దీనికి ముఖ్య కారణం, నామినేషన్ గడువులోగా అధికారిక దరఖాస్తు (నామినేషన్) రాకపోవడమేనని తెలుస్తోంది.
* గడువులోగా నామినేషన్ అందకపోవడమే కారణం
నోబెల్ శాంతి బహుమతికి నామినేషన్లను సమర్పించడానికి గడువు ఫిబ్రవరి 1. ఈ గడువు ముగిసేలోపు ట్రంప్ పేరుతో ఎటువంటి అధికారిక నామినేషన్ కూడా కమిటీకి చేరకపోవడంతో ఆయన పేరును ఈ ఏడాది జాబితా నుంచే తప్పించారు. గతంలో పాకిస్థాన్, ఇజ్రాయెల్, కంబోడియా వంటి దేశాల నేతలు ట్రంప్ పేరును సిఫారసు చేసినప్పటికీ, ఈ ఏడాది గడువులోగా ఆ ప్రయత్నాలు జరగలేదు.
* 'ఒబామా ఏమీ చేయకుండానే గెలిచారు.. నేను ఎనిమిది యుద్ధాలు ఆపాను' :ట్రంప్ ఆవేదన
నోబెల్ ప్రకటన రానున్న నేపథ్యంలో ట్రంప్ తన ఆవేదనను, అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేశారు. ముఖ్యంగా, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు నోబెల్ దక్కడంపై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. "నేను ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది యుద్ధాలు ఆపడంలో విజయం సాధించాను. గాజాలో శాంతి నెలకొల్పడానికి కృషి చేశాను. అయినా నా కృషిని గుర్తించడం లేదు." "ఒబామా ఏమీ చేయకుండానే ఈ అవార్డు పొందారు. ఎందుకిచ్చారో అతనికి కూడా తెలియదు. ఏమీ చేయకుండానే ఆయన అమెరికాను నాశనం చేసినందుకే ఈ బహుమతి ఇచ్చారు" అని ట్రంప్ ఆరోపించారు.
ఒబామా 2009లో అణ్వాయుధ నిరోధక చర్యలు, అంతర్జాతీయ సహకారం కోసం చేసిన కృషికి గుర్తింపుగా నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు. నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న యూఎస్ అధ్యక్షులు ట్రంప్ ముందు నలుగురు అమెరికా అధ్యక్షులు ఈ ప్రతిష్ఠాత్మక బహుమతిని అందుకున్నారు.
థియోడర్ రూజ్వెల్ట్ (1906): రస్సో–జపాన్ యుద్ధాన్ని ఆపినందుకు...
వుడ్‌రో విల్సన్ (1919): లీగ్ ఆఫ్ నేషన్స్ స్థాపనకు కృషి చేసినందుకు.
జిమ్మీ కార్టర్ (2002): మానవహక్కుల పరిరక్షణ, అంతర్జాతీయ శాంతి ప్రయత్నాలకు.
బరాక్ ఒబామా (2009): అణ్వాయుధాలను అరికట్టేందుకు చేసిన కృషికి.
అధికారంలోకి రెండోసారి వచ్చినప్పటి నుండి, ట్రంప్ నోబెల్ బహుమతి కోసం బలంగా కోరుకుంటున్నారు. ఈ లక్ష్యంతోనే, ఆయన దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధాలను.. అనేక ఘర్షణలను ఆపినట్లుగా స్వయంగా ప్రకటించుకున్నారు. ఈ నేపథ్యంలో, పాకిస్తాన్ సైన్యాధిపతి మునీర్‌తో పాటు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహులు ట్రంప్ పేరును నోబెల్ బహుమతికి నామినేషన్ కు పంపారు.
ఇలాంటి సమయంలో నేడు నోబెల్ శాంతి బహుమతికి సంబంధించిన ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ట్రంప్‌కు నోబెల్ అవార్డుపై మక్కువ ఉన్నప్పటికీ, నామినేషన్ ప్రక్రియలో జరిగిన లోపం కారణంగా ఈ ఏడాది ఆయన ఆశలు నెరవేరలేదని స్పష్టమవుతోంది.
