ట్రంప్ కి పిచ్చి పట్టిందా.. సోషల్ మీడియా కోసమేనా ఈ స్టేట్ మెంట్స్
ఇంతకీ అసలు విషయం ఏంటంటే... ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య నడుస్తున్న హైటెన్షన్ ఉద్రిక్తతలపై మీడియా ప్రతినిధులు ట్రంప్‌ను ఒక సీరియస్ ప్రశ్న అడిగారు.
By: A.N.Kumar | 21 May 2026 11:32 AM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మైక్ పట్టుకుంటే చాలు... ప్రపంచ దేశాల అధినేతలకు చెమటలు పడతాయో లేదో తెలీదు కానీ.. సోషల్ మీడియా మీమర్స్‌కు.. ట్రోలర్స్‌కు మాత్రం పండగే పండగ.. ప్రశ్న ఒకటి అడిగితే... సమాధానం ఇంకో ట్రాక్‌లో తీసుకెళ్లి.. మధ్యలో ఒక భారీ డైలాగ్ వదలడం ట్రంప్ తాతకు వెన్నతో పెట్టిన విద్య. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ చూస్తుంటే "సార్‌కి అమెరికా అధ్యక్ష పదవి చిన్నదైపోయిందా? ఇప్పుడు ఏకంగా గ్లోబల్ లెవెల్లో హల్చల్ చేయాలనుకుంటున్నారా?" అని నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే... ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య నడుస్తున్న హైటెన్షన్ ఉద్రిక్తతలపై మీడియా ప్రతినిధులు ట్రంప్‌ను ఒక సీరియస్ ప్రశ్న అడిగారు. "ఇరాన్‌పై యుద్ధం విషయంలో మీరు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఏం చెప్పారు?" అని అడిగితే ట్రంప్ తనదైన స్టైల్‌లో రూట్ మార్చేశారు. ఇరాన్ ముచ్చట పక్కనబెట్టి... "ఇజ్రాయెల్ ప్రజల్లో నాకు 99 శాతం ప్రజాదరణ ఉంది. భవిష్యత్తులో నేను అక్కడికి వెళ్లి ఎన్నికల్లో పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు" అంటూ ఒక గాల్లో బాంబు పేల్చారు. దీంతో పక్కనే ఉన్న విలేకరులు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ... "సార్, మీరు నిజంగానే మాట్లాడుతున్నారా? లేక పొద్దున్నే ఏదైనా జోక్ వేస్తున్నారా?" అన్నట్టుగా బిత్తరపోయారు.
‘మేక్ ఇజ్రాయెల్ ట్రంప్ అగేన్’.. మీమర్స్ అలర్ట్
ట్రంప్ ఈ స్టేట్‌మెంట్ ఇచ్చారో లేదో... అమెరికా మీడియా కంటే ముందుగా సోషల్ మీడియా ఆర్మీ అలర్ట్ అయిపోయింది. ఆయన గతంలో వాడిన "మేక్ అమెరికా గ్రేట్ అగేన్" (మాగా) స్లోగన్‌ను కాస్తా మార్చేసి... "మేక్ ఇజ్రాయెల్ ట్రంప్ అగేన్" అంటూ నెటిజన్లు కొత్త క్యాంపెయిన్లు.. మీమ్స్ మొదలుపెట్టేశారు. మరికొందరైతే ఒక అడుగు ముందుకు వేసి... "రేపు బ్రిటన్ రాజు చార్లెస్‌కు కూడా పోటీగా వచ్చి లండన్ సింహాసనం నాదే అంటారేమో!" అంటూ ఒక రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. "రాజకీయ నాయకుడిగా కంటే ట్రంప్ ఒక గ్లోబల్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా బాగా సెట్ అవుతారు. ఆయనకు కావాల్సింది కేవలం వ్యూస్, లైక్స్, ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్స్ మాత్రమే!" అంటూ సెటైర్లు వేస్తున్నారు.
అసలు వ్యూహం పాలిటిక్స్ నా? రీల్స్ హైప్ నా?
రాజకీయ విశ్లేషకులు సైతం ట్రంప్ స్ట్రాటజీ చూసి తలలు పట్టుకుంటున్నారు. ఆయనకు ప్రపంచ శాంతి కంటే... తను ఎప్పుడూ వార్తల్లో ఉండాలి, ప్రపంచ మీడియా మొత్తం తన చుట్టూనే తిరగాలి అనే ‘అటెన్షన్’ ముఖ్యం అని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల సీజన్ దగ్గరపడుతున్న వేళ ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేస్తే ఫాలోవర్లలో జోష్ పెరుగుతుందని.. ఓట్లు రాలుతాయని ఆయన ప్లాన్ కావచ్చు.
ఇక ఇరాన్‌తో చర్చల ముచ్చట వస్తే... "నేనేం తొందరపడటం లేదు" అని చాలా కూల్‌గా చెప్పారు ట్రంప్. కానీ ప్రపంచ దేశాలు మాత్రం "ట్రంప్ ఇప్పుడు ఏం మాట్లాడారో కాదు... అసలు నెక్స్ట్ ఏ బాంబు పేలుస్తారో" అని తీవ్రమైన టెన్షన్‌లో బతుకుతున్నాయి.
మొత్తానికి డొనాల్డ్ ట్రంప్ తాజా వ్యాఖ్యలు చూశాక ఆయనో రాజకీయ నాయకుడా లేక వరల్డ్ క్లాస్ ఎంటర్‌టైనరా అనే డౌట్ రాక మానదు. ఈ లెక్కన చూస్తే భవిష్యత్తులో ఎప్పుడైనా ఎలోన్ మస్క్ కంటే ముందే ట్రంప్ గారు మైక్ పట్టుకుని... "చంద్రుడి మీద కూడా నాకు 100% పాపులారిటీ ఉంది.. వచ్చే ఎన్నికల్లో అక్కడ ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తా" అని స్టేట్‌మెంట్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అప్పటివరకు మీమర్స్ అందరూ కీబోర్డులకు పదును పెట్టుకుని రెడీగా ఉండటమే మంచిది మరీ..!
