ట్రంప్ మరో మెట్టు.. ఈసారి `సర్వనాశనం` వ్యాఖ్యలు
మరోవైపు అమెరికాలో ప్రజలు ట్రంప్‌పై తిరగబడే పరిస్థితి వచ్చింది. ధరలు పెరిగింది యుద్ధం కారణంగానేనని నమ్ముతున్న వారు ఉన్నారు.
By: Garuda Media | 30 March 2026 11:00 PM ISTఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిల్లిమొగ్గలు వేస్తున్నారు. మొన్నటి వరకు ఇజ్రాయెల్‌తో కలిసి ఆ దేశంపై యుద్ధం చేసిన ఆయన.. ఇంకేముంది.. అమెరికా చేతిలో ఇరాన్ అయిపోయిందని ప్రకటించారు. కానీ, ఇరాన్ బలంగా ప్రతిఘటించడం.. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను అంతం చేయడంతో పాటు ఎఫ్-16 యుద్ధవిమానాలను కూడా నాశనం చేయడంతో ఉలిక్కిపడ్డారు. వెంటనే ఇరాన్ తమతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉందని.. తాము కూడా ప్రయత్నిస్తున్నామ న్నారు.
మరోవైపు అమెరికాలో ప్రజలు ట్రంప్‌పై తిరగబడే పరిస్థితి వచ్చింది. ధరలు పెరిగింది యుద్ధం కారణంగానేనని నమ్ముతున్న వారు ఉన్నారు. ఈ క్రమంలో ట్రంప్ రెండు మూడు రోజులుగా ఇరాన్ విషయంలో దిగి వచ్చారు. ఇరాన్‌తమకు గొప్ప బహుమతి పంపించనుందని... తమ దేశానికి చెందిన 20 చమురు నౌకలను కూడా హోర్ముజ్ జలసంధి ద్వారా.. అమెరికాకు చేరుకునేందు కు అవకాశం ఇచ్చింది.. ఇది ఇరాన్ అమెరికాకు ఇచ్చిన గొప్ప గౌరవంగా భావిస్తున్నామన్నారు. త్వరలోనే యుద్ధం కూడా సమసి పోతుందని ఆశిస్తున్నానని ట్రంప్ పేర్కొన్నారు.
ఇలా.. ట్రంప్ ఒక భిన్నమైన వైఖరిని తీసుకుని.. ఇరాన్ విషయంలో వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ క్రమంలో తాజాగా ఆయన మరో సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ కనుక తమతో ఒప్పందానికి రాకపోతే.. హోర్ముజ్ జలసంధిని అమెరికా నౌకల కోసం తెరవకపోతే.. ఇరాన్‌ను సర్వనాశనం చేసేస్తామని సోమవారం సాయంత్రం(భారత కాలమానం ప్రకారం) తన సోషల్ మీడియా ట్రూత్ పోస్టులో హెచ్చరించారు. వాస్తవానికి గతంలో `నాశనం` అన్న అన్న ట్రంప్ ఇరాన్ దెబ్బకు వెనక్కి తగ్గారు(అంటే గల్ఫ్‌దేశాల ఒత్తిడితో). కానీ.. ఇప్పుడు అది కాస్తా..సర్వనాశనం అంటూ మరో మెట్టు ఎక్కారు.
రిపబ్లికన్ల ఒత్తిడి!
అధికార పార్టీ రిపబ్లికన్‌ల నుంచి ట్రంప్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇరాన్‌పై యుద్ధం వద్దన్న వారి మాట వినకుండా ఆయన ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై యుద్ధానికి దిగారు. ఇక, ఇప్పుడు దీనిలో విజయం దక్కించుకోకుండా.. పిల్లిమొగ్గలు వేస్తే.. వచ్చే రెండుమూడు మాసాల్లో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు ఓడిపోవడం ఖాయమనే చర్చ ప్రారంభమైంది. దీంతో వారి నుంచి ట్రంప్‌పై ఒత్తిడి పెరుగుతోంది. దీనిని ఎలాగైనా అమెరికా ఖాతాలో వేసుకోకపోతే.. ఇబ్బందులు తప్పవని భావిస్తున్న ట్రంప్.. క్షణాకోరకంగా.. ప్రకటన చేస్తూ.. ప్రపంచ దేశాలను నివ్వెరపోయేలా చేస్తున్నారు.
