ట్రంప్ వేశాలు.. పాక్ ప్రధాని జాకీలు.. మెలోనీ నవ్వులు!
ప్రపంచ రాజకీయ వేదికపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో సెన్సేషనల్ వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.
By: A.N.Kumar | 14 Oct 2025 11:06 AM ISTప్రపంచ రాజకీయ వేదికపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో సెన్సేషనల్ వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. నోబెల్ శాంతి బహుమతి తనకు రాకపోవడంపై చేసిన వ్యాఖ్యలు, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రశంసలు, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీపై చేసిన సరదా వ్యాఖ్యలు.. ఇవన్నీ కలిసి అంతర్జాతీయ మీడియా దృష్టిని బలంగా ఆకర్షించాయి.
* "నేనలా చేసింది నోబెల్ కోసం కాదు" – ట్రంప్ స్పష్టీకరణ
ట్రంప్ మాట్లాడుతూ భారత్–పాక్ సంఘర్షణతోపాటు ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఎనిమిది యుద్ధాలను నేను నిలువరించాను. కానీ అది నోబెల్ శాంతి బహుమతి కోసం కాదు” అని వ్యాఖ్యానించారు. 2024 నోబెల్ శాంతి బహుమతి ప్రకటించబడిన వెంటనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.
ట్రంప్ వివరించిన వివరాల ప్రకారం.. అణ్వాయుధాలు కలిగిన భారత్, పాక్‌లు యుద్ధానికి సిద్ధమైన సమయంలో “మీరు యుద్ధం చేస్తే 100% లేదా 200% సుంకం విధిస్తాను” అని తాను హెచ్చరించానని, 24 గంటల్లోనే ఇరుదేశాలూ వెనక్కి తగ్గారని ఆయన తెలిపారు. తాను 2025లో ఈ యుద్ధాలను ఆపగా.. నోబెల్ అవార్డులు 2024లో ప్రకటించారని చమత్కరించారు.
* రష్యాకు ట్రంప్ గట్టి హెచ్చరిక: తోమహాక్ క్షిపణి ప్రస్తావన
రష్యా వెంటనే యుద్ధాన్ని ఆపకపోతే అమెరికా ఉక్రెయిన్‌కు దీర్ఘశ్రేణి తోమహాక్ క్షిపణులను అందిస్తుందని ట్రంప్ గట్టిగా హెచ్చరించారు. “అది అత్యంత విధ్వంసకమైన ఆయుధం. దాన్ని ఉక్రెయిన్‌కు ఇవ్వడం రష్యాకు రుచించదు,” అని ఆయన స్పష్టం చేశారు. దీనిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వెదేవ్‌లు తీవ్రంగా స్పందిస్తూ ఉక్రెయిన్‌కు అటువంటి క్షిపణులు అందించడం ప్రపంచవ్యాప్తంగా వినాశనానికి దారితీస్తుందని హెచ్చరించారు.
* షెహబాజ్ షరీఫ్ పొగడ్తలతో ట్రంప్ ఉక్కిరిబిక్కిరి
ఈజిప్టులోని షర్మ్ ఎల్ షేక్‌లో ఇజ్రాయెల్–హమాస్‌ల మధ్య శాంతి ఒప్పందంపై సంతకాల సందర్భంగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ట్రంప్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. “గాజాలో శాంతి సాధన ట్రంప్ నేతృత్వంలో సాధ్యమైంది. భారత్–పాక్ యుద్ధాన్ని ఆయనే నిలిపారు. ఆయన నిజంగా శాంతిని కోరుకునే నాయకుడు. ఇప్పటివరకు ఏడు యుద్ధాలను ఆపారు, ఇది ఎనిమిదవది” అని షరీఫ్ వ్యాఖ్యానించారు.
షరీఫ్ పొగడ్తల వర్షానికి ట్రంప్ కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారు. తరువాత చమత్కారంగా “ఇక నేను మాట్లాడాల్సింది ఏమీ లేదు, ఇంటికి వెళ్లిపోదాం,” అని చెప్పి వేదికపై నవ్వులు పూయించారు.
* మెలోనీపై సరదా కామెంట్.. వేదికపై నవ్వుల వర్షం
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీపై ట్రంప్ చేసిన సరదా వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి. “నాకు ఇది చెప్పడం సరికాదు, ఎందుకంటే అలా చెబితే నా రాజకీయ జీవితం ముగుస్తుంది. కానీ నేను ఆ రిస్క్ తీసుకుంటాను. మీరు అందంగా ఉన్నారని చెప్పక తప్పదు!” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
దీంతో మెలోనీతో పాటు ఇతర దేశాధినేతలు కూడా నవ్వులు చిందించారు. తర్వాత ట్రంప్ ఆమెను “అద్భుతమైన నాయకురాలు”గా పేర్కొంటూ, శాంతి ఒప్పందానికి హాజరైనందుకు ధన్యవాదాలు తెలిపారు.
* ట్రంప్ స్టైల్ డిప్లమసీ – మాటల్లో మంత్రం
ట్రంప్ వ్యాఖ్యలు మరోసారి ఆయన ప్రత్యేక శైలిని ప్రపంచానికి చూపించాయి. రాజకీయ చమత్కారం, ఘాటైన మాటలు, కొంచెం హాస్యం కలగలిసి ఆయనను మళ్లీ గ్లోబల్ మీడియా ఫోకస్‌లోకి తెచ్చాయి. పాక్ ప్రధాని పొగడ్తలు, మెలోనీపై కామెంట్, రష్యాపై హెచ్చరికలు.. ఇవన్నీ కలిపి ట్రంప్ దౌత్యం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మొత్తం మీద మాటలతో మాయ చేసే నాయకుడు మరోసారి ప్రపంచ వేదికపై ‘షోమ్యాన్’గా మెరిశారు!
