మలేషియాలో మిస్సైనా భారత్ లో కాదు.. బిగ్ హింట్ ఇచ్చిన ట్రంప్!
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఓ బిగ్ హింట్ ఇచ్చారు. ఇందులో భాగంగా.. వచ్చే ఏడాదిలో భారత్ పర్యటనకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
By: Raja Ch | 7 Nov 2025 4:00 PM ISTమలేసియా రాజధాని కౌలాలంపూర్ లో అక్టోబరు 26 నుంచి 28 వరకు 47వ ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గైర్హాజరు అయ్యారు! దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మోడీల మధ్య భేటీ లేనట్లేననే చర్చ మొదలైంది! షెడ్యూల్ సమస్యల వల్లే మోడీ పాల్గొనలేకపోయారు. ఈ సమయంలో ట్రంప్ నుంచి బిగ్ హింట్ వచ్చింది!
అవును... ఈ సంవత్సరం ప్రారంభంలో వాషింగ్టన్ భారతీయ వస్తువులపై 50% సుంకాలు విధించాలని నిర్ణయించిన తర్వాత మోడీ, ట్రంప్ ల మొదటి ఫేస్ టు ఫేస్ సంభాషణపై తీవ్ర ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఓ బిగ్ హింట్ ఇచ్చారు. ఇందులో భాగంగా.. వచ్చే ఏడాదిలో భారత్ పర్యటనకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇందులో భాగంగా... వచ్చే ఏడాది భారత్ లో పర్యటించాలని మీరు ప్లాన్ చేస్తున్నారా? అని ఓ విలేకరి ట్రంప్ ను ప్రశ్నించగా.. దీనికి బదులిస్తూ.. 'కావొచ్చు.. అవును' అని ఆయన సమాధానం ఇచ్చారు. దీంతో ఈ ప్రకటన భారత్- అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ పర్యటనపై వైట్ హౌస్ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.
మోడీపై ట్రంప్ మరోసారి ప్రశంసలు!:
భారత్ ను సుంకాల రాజు అని అంటూ తన అక్కసు, ఆగ్రహం వెళ్లగక్కే అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ప్రధాని మోడీపై మాత్రం అప్పుడప్పుడూ ప్రశంసలు కురిపిస్తుంటారు! ఈ క్రమంలో తాజాగా మరోసారి ఆ పనికి పూనుకున్నారు. ఇందులో భాగంగా... వైట్ హౌస్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని మోడీ గొప్ప వ్యక్తి అని, ఆయన తనకు మంచి స్నేహితుడని అన్నారు.
ప్రధానంగా... బరువు తగ్గించే మందుల ధరలను తగ్గించడానికి సంబంధించి కొత్త ఒప్పందాన్ని ప్రకటించిన ట్రంప్.. ప్రధాని మోడీతో వాణిజ్య చర్చలు చాలా బాగా జరుగుతున్నాయని తెలిపారు. ఇదే సమయంలో.. మోడీ రష్యా నుంచి చమురు కొనడం చాలావరకు మానేశారని.. తమ మధ్య చర్చలు జరుగుతున్నాయని.. తాను అక్కడికి (భారత్) రావాలని ఆయన (మోడీ) కోరుకుంటున్నారని తెలిపారు.
కాగా... వాషింగ్టన్ భారీ సుంకాలను విధించాలనే నిర్ణయం తర్వాత.. ఈ ఏడాది చివర్లో జరగనున్న క్వాడ్ సమ్మిట్ కోసం ట్రంప్ ఇకపై భారతదేశాన్ని సందర్శించే ఉద్దేశం లేదని న్యూయార్క్ టైమ్స్ తన ఆగస్టు నివేదికలో చెప్పిన కొన్ని నెలల తర్వాత ఈ ప్రకటన రావడం గమనార్హం!
ఫిబ్రవరిలో ట్రంప్ ను కలిసిన మోడీ!:
ఫిబ్రవరి 12, 2025న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటన తర్వాత వాషింగ్టన్ డీసీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అనంతరం.. ఫిబ్రవరి 13న, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఆయన వైట్ హౌస్ లో కలిశారు. ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనను కలిసిన నాల్గవ విదేశీ నాయకుడిగా మోడీ నిలిచారు.
కుప్పకూలిన ఫార్మాస్యూటికల్ ఎగ్జిక్యూటివ్!:
మరోవైపు బరువు తగ్గించే మందుల ధరల తగ్గింపు లక్ష్యంగా పలు ఫార్మా కంపెనీలతో చేసుకున్న కీలక ఒప్పందం గురించి ట్రంప్ వైట్ హౌస్ లో విలేకరులకు వివరిస్తుండగా.. ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఇందులో భాగంగా... ట్రంప్ పక్కన ఉన్న ఓ ఫార్మాస్యూటికల్ ఎగ్జిక్యూటివ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.
ఈ సంఘటనపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లీవిట్ స్పందించారు. ఆయన స్పృహ తప్పారని వెల్లడించారు. వైట్ హౌస్ వైద్యబృందం వెంటనే స్పందించి ఆయనకు చికిత్స అందించినట్లు తెలిపారు. సదరు వ్యక్తి నోవో నార్డిస్క్ ఎగ్జిక్యూటివ్ గోర్డాన్ ఫైండ్లేగా తెలుస్తోంది.
