హాట్ టాపిక్... మ్యాప్ మార్చి, కొత్త బోర్డులు పెడుతున్న ట్రంప్!
వీరందరితోనూ వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీసులో కూర్చున్న ట్రంప్ కుర్చీ పక్కన, మార్చబడిన అమెరికా మ్యాప్ ను ప్రదర్శించారు.
By: Raja Ch | 20 Jan 2026 6:48 PM ISTతాను అనుకున్న పని జరగాల్సిందే.. తాను కోరుకున్నది తనకు దక్కాల్సిందే.. అలాకానిపక్షంలో నాలో మరో మనిషిని చూస్తారు అన్నట్లుగా ప్రపంచంలోని పలు దేశాలపై దండెత్తుతున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ క్రమంలో పలు దేశాలపై సుంకాలతో విరుచుకుపడుతుంటే.. మరికొన్నింటిని స్వాధీనం చేసుకోవాలని పంతం పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. గ్రీన్ లాండ్ ను స్వాధీనం చేసుకోనే విషయంలో సరికొత్త స్టెప్పులు వేస్తూ.. తగ్గేదేలే అంటున్నారు.
అవును... గ్రీన్ లాండ్ ను స్వాధీనం చేసుకునే విషయంలో ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతూ నాటో మిత్రదేశాలను ఎగతాళి చేసే పనులకు పూనుకుంటున్నారు. ఇందులో భాగంగా... ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇటాలియన్ ప్రధాని జార్జియా మెలోని, బ్రిటిష్ ప్రీమియర్ కీర్ స్టార్మర్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ వంటి నాటో మిత్రదేశాలను ఎగతాళి చేస్తున్న ఫోటోను షేర్ చేశారు.
వీరందరితోనూ వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీసులో కూర్చున్న ట్రంప్ కుర్చీ పక్కన, మార్చబడిన అమెరికా మ్యాప్ ను ప్రదర్శించారు. అందులో అమెరికా మ్యాప్ లో గ్రీన్ లాండ్ కలిసి ఉంది! దీంతో.. ఈ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. అక్కడితో గ్రీన్ లాండ్ పై ట్రంప్ సోషల్ మీడియా పోస్టుల వర్షం ఆగలేదు. అనంతరం ఏకంగా గ్రీన్ లాండ్ లో జెండా పాతుతూ.. 2026 నుంచి ఆ దేశం అమెరికాలో భాగం అన్నట్లుగా ఉన్న బోర్డున్న ఫోటోను షేర్ చేశారు.
ఇందులో భాగంగా... ఒక ఫోటోలో అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్ లాండ్ భూభాగంపై అమెరికా జెండాను పాతుతున్నారు. ఆ సమయంలో ఆయన వెంట ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, యూఎస్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఉన్నారు. దానికి సమీపంలోని ఒక బోర్డుపై... "గ్రీన్ ల్యాండ్.. యూఎస్ భూభాగం.. ఈ.ఎస్.టీ 2026" అని రాసి ఉంది. ఈ రెండు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్లు ట్రంప్ పంతాన్ని టార్గెట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.
కాగా.. గత ఏడాది వైట్ హౌస్ కు తిరిగి వచ్చినప్పటి నుంచీ గ్రీన్ లాండ్ ను అమెరికా భూభాగంగా మార్చాలని ట్రంప్ పదే పదే చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. కారకాస్ (వెనిజువెలా రాజధాని) పై దాడి.. అనంతరం ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను స్వాధీనం చేసుకున్న తర్వాత.. గ్రీన్ లాండ్ విషయంలో ట్రంప్ తన పట్టును మరింతగా పునరుద్ధరిస్తున్నారు. ఈ డానిష్ భూభాగాన్ని అమెరికాలో భాగం చేయడం వల్ల జాతీయ భద్రతా ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని వాదిస్తున్నారు.
