ట్రంప్ మరోసారి ‘పీస్‌మేకర్’ అంటూ భారత్–పాక్ ఉద్రిక్తతలపై క్రెడిట్ కొట్టేసే వ్యూహం
అంతర్జాతీయ రాజకీయ యవనికపై డొనాల్డ్ ట్రంప్ శైలి ఎప్పుడూ భిన్నంగానే ఉంటుంది.
By: A.N.Kumar | 18 April 2026 3:00 PM ISTఅంతర్జాతీయ రాజకీయ యవనికపై డొనాల్డ్ ట్రంప్ శైలి ఎప్పుడూ భిన్నంగానే ఉంటుంది. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి.. ఆయన తన విదేశీ విధానాన్ని కేవలం ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదానికే పరిమితం చేయకుండా, ‘గ్లోబల్ పీస్‌మేకర్’ అనే కొత్త ముసుగును తొడుగుతున్నారు. తాజాగా అరిజోనాలో ఆయన చేసిన వ్యాఖ్యలు తాను పది యుద్ధాలను ఆపగలిగానని.. ముఖ్యంగా భారత్-పాకిస్తాన్ మధ్య అణు యుద్ధ ముప్పును తప్పించానని చెప్పుకోవడం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో సరికొత్త చర్చకు దారితీసింది.
అతిశయోక్తి ఆవరణలో శాంతి వచనాలు
ట్రంప్ తన విశ్లేషణలో ‘ఆపరేషన్ సింధూర్’ సమయాన్ని ప్రస్తావిస్తూ తానే గనుక లేకపోతే 3 నుండి 5 కోట్ల మంది చనిపోయేవారని పేర్కొనడం ఆయన మార్కు ‘హైపర్బోల్’ కి నిదర్శనం. గతంలో పహల్గామ్ దాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన మాట వాస్తవమే. కానీ దశాబ్దాలుగా భారత్ అనుసరిస్తున్న ‘ద్వైపాక్షిక విధానం’ ప్రకారం.. మూడో పక్షం జోక్యాన్ని ఢిల్లీ ఎప్పుడూ స్వాగతించలేదు. ట్రంప్ తన మధ్యవర్తిత్వాన్ని పదేపదే ప్రకటించుకోవడం ద్వారా అంతర్జాతీయ వేదికపై తన ప్రాధాన్యతను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారనేది స్పష్టమవుతోంది.
మధ్యవర్తిత్వపు విస్తృతి..ఇస్లామాబాద్ చర్చల ప్రాధాన్యత
ట్రంప్ కేవలం ఆసియాకే పరిమితం కాకుండా ఆఫ్రికా, యూరప్, మధ్యప్రాచ్య దేశాల మధ్య వివాదాలను కూడా తన ఖాతాలో వేసుకున్నారు. సెర్బియా-కొసోవో నుండి ఇజ్రాయెల్-హమాస్ వరకు అన్నిటా తన ముద్ర ఉందని ఆయన వాదిస్తున్నారు. ఇందులో అత్యంత కీలకమైన అంశం ఇరాన్‌తో జరగబోయే చర్చలు. ఈ చర్చలకు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదిక కాబోతోందన్న వార్త అంతర్జాతీయ రాజకీయ సమీకరణాల్లో వస్తున్న మార్పులకు సంకేతం. ఒకప్పుడు ‘టెర్రరిజం’ ముద్రతో ఇబ్బంది పడ్డ పాకిస్తాన్‌ను.. అమెరికా తన దౌత్య చర్చలకు వేదికగా ఎంచుకోవడం వెనుక ట్రంప్ వ్యూహం ఏంటనేది ఆసక్తికరంగా మారింది.
దౌత్యం వర్సెస్ దేశీయ రాజకీయం
ట్రంప్ చేస్తున్న ఈ ‘శాంతి’ ప్రకటనల వెనుక అమెరికా దేశీయ రాజకీయం కూడా దాగి ఉంది. యుద్ధాల వల్ల అమెరికా ఖజానా ఖాళీ అవుతోందని భావించే ఓటర్లకు “నేను యుద్ధాలు చేసేవాడిని కాదు.. ఆపేవాడిని” అని చెప్పుకోవడం ద్వారా ఆయన తన పట్టును బిగించుకుంటున్నారు. అయితే, ఆయన చెబుతున్న దేశాలన్నీ ఈ మధ్యవర్తిత్వాన్ని అధికారికంగా ధృవీకరించకపోవడం గమనార్హం.
శాంతి స్థాపన అనేది ఎప్పుడూ స్వాగతించదగ్గ పరిణామమే. కానీ అది సంబంధిత దేశాల సార్వభౌమత్వానికి భంగం కలగకుండా ఉండాలి. ట్రంప్ తన వ్యక్తిగత చరిష్మాను పెంచుకోవడానికి అంతర్జాతీయ సంక్షోభాలను వాడుకుంటున్నారా లేక నిజంగానే అమెరికా దౌత్యం అంత బలంగా పని చేస్తోందా అన్నది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా ట్రంప్ రెండో ఇన్నింగ్స్ ప్రపంచాన్ని మరింత అనిశ్చితిలోకి కాకుండా, ఆయన చెబుతున్నట్లుగా ‘శాంతి’ వైపు నడిపిస్తే అది మానవాళికే మేలు. కానీ, ఆ శాంతి కేవలం ‘అంకెల్లో’ కాకుండా ‘అమలులో’ కనిపించాల్సిన అవసరం ఉంది.
