ట్రంప్ కు నోబెల్ లేని శాంతి బహుమతి.. ప్రధానం ఎప్పుడంటే..!
అయినప్పటికీ ఆయన కోరిక కొంత నెరవేరబోతోంది. ఇందులో భాగంగా ఈ ఏడాదిలోనే అమెరికా అధ్యక్షుడికి "శాంతి బహుమతి" అందనుంది.
By: Raja Ch | 7 Nov 2025 11:00 PM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి పట్ల ఉన్న మక్కువ సంగతి తెలిసిందే. ఆయనకంటే ఆ బహుమతికి ఇప్పుడు ఎవరు అర్హులు అనే స్థాయిలోనూ ప్రచారం జరిగింది. తాను ఎన్ని యుద్ధాలు ఆపినా తనకు నోబెల్ శాంతి బహుమతి రాదనే నిట్టూర్పులూ ట్రంప్ నుంచి వినిపించాయి. ఎన్ని జరిగినా నోబెల్ శాంతి బహుమతిని పొందడంలో ట్రంప్ విఫలమయ్యారు.
అయినప్పటికీ ఆయన కోరిక కొంత నెరవేరబోతోంది. ఇందులో భాగంగా ఈ ఏడాదిలోనే అమెరికా అధ్యక్షుడికి "శాంతి బహుమతి" అందనుంది. డిసెంబర్ 5న వాషింగ్టన్ డీసీలో ట్రంప్ ఈ అవార్డును అందుకోనున్నారు. కాకపోతే ఈ అవార్డులో 'నోబెల్' ఉండదు కానీ 'శాంతి' మాత్రం ఉంటుంది. ఫిఫా తన 'శాంతి బహుమతి'ని ట్రంప్ కు అందించాలని నిర్ణయించింది.
వివరాళ్లోకి వెళ్తే... నోబెల్ శాంతి బహుమతి దక్కించుకోవాలని ట్రంప్ తెగ ఆరాటపడిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో పలు ప్రపంచదేశాలు తమ వంతు ప్రయత్నం చేశాయి. కాకపోతే ఆ కోరిక ఈసారి తీరలేదు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఫుట్ బాల్ క్రీడా సమాఖ్య (ఫిఫా) త్వరలో తమ సంస్థ నుంచి "శాంతి బహుమతి"ని అందించాలని నిర్ణయించింది.
దీనికి 'ఫిఫా శాంతి బహుమతి'గా నామకరణం చేసింది. ప్రపంచంలో శాంతి, ఐక్యతల కోసం విశేషంగా కృషి చేసిన వారికి ఈ 'శాంతి బహుమతి'ని ప్రదానం చేయాలని నిర్ణయిచింది. ఈ బహుమతిని ఈ ఏడాది డిసెంబర్ 5న వాషింగ్టన్ డీసీలో జరిగే 2026 ప్రపంచ కప్ డ్రా సందర్భంగా ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినో తన చేతుల మీదుగా ఒక ప్రముఖునికి అందించనున్నారు.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో సన్నిహిత సంబంధం కలిగిన ఫిఫా అధ్యక్షుడు ఇన్ఫాంటినో.. అమెరికా బిజినెస్ ఫోరమ్ లో పాల్గొన్న సందర్బంగా విలేకరులు.. 'ఈ బహుమతి తొలిసారిగా ట్రంప్ అందుకోబోతున్నారా?' అని అడిగారు. దీనికి సమాధానంగా స్పందించిన ఆయన.. 'డిసెంబర్ 5న మీరంతా చూస్తారు' అని అన్నారు.
అనంతరం తన ప్రసంగంలో.... ట్రంప్ ను ప్రపంచ శాంతి సాధనలో ఛాంపియన్ గా తాను చూస్తున్నానని అన్నారు. అనంతరం.. గాజాలో శాంతి ఒప్పందం కోసం ట్రంప్ చేసిన కృషికి గాను ఈ అవార్డుకు ఆయన ఖచ్చితంగా అర్హుడు అని తన ఇన్ స్టాగ్రామ్ లో ఖాతాలో రాశారు. దీంతో ఈ అవార్డు ట్రంప్ కే ఇవ్వనున్నారని నెటిజన్లు ఫిక్సైపోయారు.
మరోవైపు నోబెల్ శాంతి బహుమతి అందుకోలేకపోయిన ట్రంప్ బాధ భరించలేకో, చూడలేకో జియాని ఇన్ఫాంటినో ఈ మేరకు నిర్ణయం తీసుకుని ఉంటారనే కామెంట్లు ఈ సందర్భంగా కనిపిస్తున్నాయి.
