డాలరు కాయిన్‌పై ట్రంప్ మార్క్.. స్పెషల్ కాయిన్ వెనుక అసలు కథ!
దేశం 250వ స్వాతంత్ర్య వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ దేశానికి అంతకంటే గొప్ప కానుక ఏముంటుందని అనుకున్నారో ఏమో కానీ, యుఎస్ మింట్ ద్వారా ఈ సంచలన 'ట్రంప్ కాయిన్' ను సెప్టెంబర్ రెండున మార్కెట్లోకి వదిలారు.
By: A.N.Kumar | 3 Sept 2026 1:28 PM ISTవాషింగ్టన్ నగరం నుంచి మరో ముచ్చటైన వార్త బయటకు వచ్చింది. మన మాజీ అధ్యక్షుడు.. నిత్య వివాదరసికుడు డొనాల్డ్ ట్రంప్ గారు మళ్ళీ వార్తల కెక్కారు. ఈసారి ఆయన చేసిన ఘనకార్యం ఏదో రాజకీయ ప్రకటనో లేక ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలో కాదు. ఏకంగా అమెరికా అధికారిక ఒక్క డాలరు నాణెంపై తన అందమైన ముఖచిత్రాన్ని శాశ్వతంగా చెక్కించేసుకున్నారు. దేశం 250వ స్వాతంత్ర్య వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ దేశానికి అంతకంటే గొప్ప కానుక ఏముంటుందని అనుకున్నారో ఏమో కానీ, యుఎస్ మింట్ ద్వారా ఈ సంచలన 'ట్రంప్ కాయిన్' ను సెప్టెంబర్ రెండున మార్కెట్లోకి వదిలారు.
ఇక ఈ నాణెం ప్రత్యేకతల విషయానికి వస్తే నాణెం ముందు భాగంలో ట్రంప్ గారి వైట్‌హౌస్ అధికారిక ఫోటో ఆధారంగా చెక్కిన గాంభీర్యమైన బొమ్మ మెరుస్తుంటుంది. దాని చుట్టూ స్వాతంత్ర్యం, దేవుడిపై నమ్మకం అని పెద్ద పెద్ద మాటలు రాసి ఉంటాయి. వెనుక వైపు చూస్తే అధ్యక్ష ముద్ర, పక్షి, బాణాలు, 250 అని రాసి ఉంటాయి కానీ జనాల దృష్టి మాత్రం ముందున్న ఆ ముఖం మీదే ఉంటుంది.
అసలైన కామెడీ ఏమిటంటే.. ఈ నాణెం అసలు విలువ కేవలం ఒక్క డాలరే. కానీ దానిని కొనుక్కోవాలంటే మాత్రం జేబులు ఖాళీ చేసుకోవాల్సిందే. పదిహేను వందల రూపాయలకి పైగా పెట్టి 25 నాణేల రోల్ కొంటే ఒక్కో కాయిన్ పడేది రెండు డాలర్ల నలభై నాలుగు సెంట్లు. అదే వంద నాణేల సంచి కొంటే ఒక్కోటి డాలరు యాభై ఐదు సెంట్లు. అంటే ఒక్క డాలరు విలువైన నాణేన్ని సొంతం చేసుకోవడానికి కలెక్టర్లు అదనంగా డబ్బులు తగలేయాలన్నమాట. ఆ కవర్లు, ప్యాకింగ్ డబ్బాల కోసమే ఆ అదనపు వసూళ్లు అని అధికారులు సమర్థించుకుంటున్నారు.
చూడటానికి ఈ కాయిన్ భలే పసిడి వర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది. కానీ ఆగండి అది బంగారం అనుకుంటే పొరపాటే. అందులో నయా పైసా బంగారం లేదు. రాగి, జింక్, మాంగనీస్, నికెల్ లతో చేసిన సాధారణ లోహాల మిశ్రమం మాత్రమే. చూడటానికి బంగారంలా కనిపిస్తుంది కానీ లోపల ఏమీ ఉండదు. సరిగ్గా రాజకీయనాయకుల హామీల్లాగేనని జనాలు నవ్వుకుంటున్నారు.
పైగా ఈ నాణేల ప్రచారానికి మరో మసాలా జోడించారు. జూలై నాలుగో తేదీన ప్రత్యేకంగా తయారు చేసిన రెండున్నర లక్షల నాణేలపై ఒక చిన్న గుర్తు వేసి.. వాటిని సాధారణ సంచుల్లో కలిపేశారట. ఏ సంచిలో ఆ అరుదైన నాణెం వస్తుందో తెలియక జనాలు లాటరీ టికెట్లు కొన్నట్లు ఈ కాయిన్ బ్యాగులు కొంటారని ప్లాన్ చేశారు.
అయితే అమెరికా చట్టాల ప్రకారం బతికున్న వ్యక్తుల బొమ్మలను కరెన్సీపై ముద్రించకూడదు అనేది ఒక నియమం. కానీ మన అధికారులు ఏకంగా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ గారి ఆశీస్సులతో 250వ వార్షికోత్సవ సందు చూసుకుని చట్టంలోని సందుల ద్వారా ఈ నాణేన్ని బయటకు తెచ్చేశారు. ఇది మార్కెట్లో వస్తువులు కొనుక్కోడానికి వాడతారో లేక కేవలం ట్రంప్ అభిమానులు తమ ఇంట్లో షోకేసులో పెట్టుకోవడానికే పరిమితమవుతుందో కాలమే చెప్పాలి.
