దావోస్ లోని ట్రంప్ రిసెప్షన్ కు ఆహ్వానం.. ఆ భారతీయ సీఈఓలు వీరే..!
ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరు కానున్న భారతీయ వ్యాపార నాయకుల జాబితా ఈ విధంగా ఉంది...!:
By: Raja Ch | 20 Jan 2026 11:01 PM ISTప్రపంచ రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఈ వారం స్విస్ లో సమావేశమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ప్రపంచ ఆర్థిక వేదికకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి రాబోతున్నారు. ఈ సమయంలో... బుధవారం ఉన్నత స్థాయి స్వాగత కార్యక్రమానికి ముందు ట్రంప్ కీలక ప్రసంగం చేస్తారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించబడిన వారిలో భారతదేశంలోని అత్యంత ప్రభావవంతమైన ఏడుగురు వ్యాపారవేత్తలు ఉండటం గమనార్హం.
అవును... బుధవారం దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సందర్భంగా ఎంపిక చేయబడిన ప్రపంచ వ్యాపార నాయకుల బృందాన్ని డొనాల్డ్ ట్రంప్ కలవనున్నారు. ఈ సందర్భంగా.. అక్కడ జరిగే రాజకీయ, కార్పొరేట్ ఉన్నత వర్గాల వార్షిక సమావేశంలో అమెరికా విధాన ప్రాధాన్యతలను ఆయన నొక్కి చెప్పనున్నారని అంటున్నారు. ఈ వరల్డ్ కార్పొరేట్ ఎంగేజ్మెంట్ లో భారతదేశపు విస్తరిస్తున్న పాత్రను హైలైట్ చేస్తూ.. ప్రముఖ భారతీయ సీఈఓల ప్రతినిధి బృందం కూడా ఈ రిసెప్షన్ కు హాజరవుతారు.
ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరు కానున్న భారతీయ వ్యాపార నాయకుల జాబితా ఈ విధంగా ఉంది...!:
నటరాజన్ చంద్రశేఖరన్ - చైర్మన్ - టాటా సన్స్ ఇండియా
సునీల్ భారతి మిట్టల్ - చైర్మన్ - భారతి ఎంటర్ ప్రైజెస్
శ్రీని పల్లియా - సీఈఓ - విప్రో
సలీల్ ఎస్ పరేఖ్ - సీఈఓ - ఇన్ఫోసిస్
అనీష్ షా – గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ - మహీంద్రా గ్రూప్
సంజీవ్ బజాజ్ - చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ - బజాజ్ ఫిన్సర్వ్
హరి ఎస్. భారతీయ - వ్యస్థాపకుడు & కో-చైర్మన్ - జూబిలెంట్ ఇండియా గ్రూప్
దీంతో.. వేగంగా మారుతున్న అంతర్జాతీయ వాతావరణానికి ప్రతిస్పందనగా కంపెనీలు, ప్రభుత్వాలు, సాంకేతిక భాగస్వామ్యాలు, పెట్టుబడి ప్రవాహాలను తిరిగి అంచనా వేస్తున్నందున.. భారత సీఈఓల భాగస్వామ్యం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దేశం యొక్క విస్తరిస్తున్న పాత్రను నొక్కి చెబుతుందని అంటున్నారు. మరోవైపు కొత్త వాణిజ్య వ్యవహారాలపై అమెరికా - భారత్ చర్చలు మధ్యలో ఉన్నందున.. ట్రంప్ దావోస్ సమావేశాలలో భారతీయ ఉనికిని పెట్టుబడిదారులు నిశితంగా గమనిస్తున్నారని అంటున్నారు.
మరోవైపు.. గ్రీన్ ల్యాండ్ ను సొంతం చేసుకోవాలనే వివాదాస్పద ప్రయత్నం.. అనేక యూరోపియన్ నాటో మిత్రదేశాలపై 10% సుంకాల బెదిరింపులు వంటి పెరిగిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య బుధవారం దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదికలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రసంగంపై అందరి దృష్టి నెలకొని ఉందని అంటున్నారు. ప్రపంచ నాయకులు, వ్యాపార ప్రముఖులు సమావేశమవుతున్న ఈ కార్యక్రమంలో ట్రంప్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారని చెబుతున్నారు.
కాగా... ఈ సంవత్సరం 130కి పైగా దేశాల నుండి దాదాపు 3,000 మందికి పైగా ప్రతినిధులకు ఆతిథ్యం ఇస్తున్న దావోస్ లో వారి ఉనికి భారతదేశపు బలమైన కార్పొరేట్ పాదముద్రను ప్రతిబింబిస్తుందని అంటున్నారు. ఇక.. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు దావోస్ కు చేరుకున్న సంగతి తెలిసిందే.
