ట్రంప్ వెంటనే క్షమాపణలు చెప్పాలి.. పీఎం డిమాండ్!
డోనాల్డ్ ట్రంప్ ఈమధ్య కాలంలో చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు.. ప్రవర్తిస్తున్న తీరు చాలామందికి ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.
By: Madhu Reddy | 24 Jan 2026 7:00 PM ISTడోనాల్డ్ ట్రంప్ ఈమధ్య కాలంలో చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు.. ప్రవర్తిస్తున్న తీరు చాలామందికి ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఇటీవల గ్రీన్ ల్యాండ్ లో పెంగ్విన్లు ఉంటాయో లేదో కూడా తెలియని డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ నుండి షేర్ చేసిన ఫోటో నెటిజన్స్ ట్రోల్స్ కి గురైన విషయం తెలిసిందే. ఇప్పుడు అంతలోనే ట్రంప్ క్షమాపణలు చెప్పాలి అని బ్రిటన్ పీఎం డిమాండ్ చేయడం మరింత సంచలనంగా మారింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
విషయంలోకి వెళ్తే.. దావోస్ సమావేశం సందర్భంగా.. ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధం సమయంలో అమెరికా బలగాలు మాత్రమే ముందున్నాయి నాటో దేశాల బలగాలు దూరంగా ఉండిపోయాయి అంటూ ట్రంప్ అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. "మాకు అవసరమైనప్పుడు నాటో దేశాలు అండగా నిలుస్తాయని నేను అనుకోవడం లేదు. అయినా వారి అవసరం మాకు లేదు. వారినెప్పుడు మేము ఏది అడగలేదు.
మా ఆదేశాలు, మా పాలనను ఆదర్శంగా తీసుకోవాలి. లేదంటే మునిగిపోవడం ఖాయం.. ఒకరకంగా చెప్పాలి అంటే ఆఫ్గానిస్థాన్ కి సేనలు పంపాము. ఇంకేదో చేశామని నాటో దేశాలు చెబుతున్నాయి. వారు ఎప్పుడూ కూడా యుద్ధరంగంలో ముందు లేరు. వెనకే ఉన్నారు" అంటూ ట్రంప్ కీలక కామెంట్లు చేశారు.. అయితే ట్రంప్ వ్యాఖ్యలకు యూరోపియన్ దేశాలలో ప్రకంపనలు చెలరేగుతున్నాయి.
అయితే ఈ నాటో లో అమెరికాతో పాటు బ్రిటన్, ఫ్రాన్స్ సహా పలు దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు చేయడంతో బ్రిటన్ ప్రధాని స్టార్మర్ తీవ్రంగా స్పందిస్తూ.. ట్రంప్ వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.." అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన అవమానకరమైన వ్యాఖ్యలతో దిగ్బ్రాంతి చెందాను. ముఖ్యంగా ఆ వ్యాఖ్యలు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన వారి కుటుంబ సభ్యులకు అలాగే దేశ ప్రజలకు తీవ్ర వేదన కలిగించాయి.
ఆఫ్ఘనిస్తాన్లో నాటో బలగాలు సాహసోపేతంగా పోరాడాయి . దేశం కోసం ఎన్నో త్యాగాలు కూడా చేశాయి. ముఖ్యంగా నాటో బలగాల గురించి అవమానకరంగా మాట్లాడినందుకు ట్రంప్ వెంటనే క్షమాపణలు చెప్పాలి" అంటూ ఆయన డిమాండ్ చేశారు.. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా ట్రంప్ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో నాటో దేశాల ప్రజలు కూడా ట్రంప్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ మండిపడుతున్నారు.
