Begin typing your search above and press return to search.

మోదీ రష్యా ఆయిల్ కొనబోమని చెప్పారు.. మరో బాంబు పేల్చిన ట్రంప్..నిజమెంత?

ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక రంగాల్లో కొత్త చర్చకు దారితీశాయి.

By:  A.N.Kumar   |   16 Oct 2025 10:47 AM IST
మోదీ రష్యా ఆయిల్ కొనబోమని చెప్పారు.. మరో బాంబు పేల్చిన ట్రంప్..నిజమెంత?
X

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి ప్రపంచ ఇంధన మార్కెట్లలో భారత్‌ పాత్ర కీలకంగా మారింది. రష్యా నుంచి భారీ తగ్గింపు ధరలకు చమురు కొనుగోలు చేస్తూ, దేశ ఇంధన భద్రతను కాపాడుకుంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక రంగాల్లో కొత్త చర్చకు దారితీశాయి. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్‌ ప్రకటించారు. ఈ ప్రకటనతో ప్రపంచ ఇంధన దౌత్యం మళ్లీ కదలికలోకి వచ్చింది.

* ఉక్రెయిన్‌ యుద్ధం, భారత్‌ ఇంధన వ్యూహం

2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా తన చమురును తగ్గింపు ధరలకు విక్రయించడం ప్రారంభించింది. ఈ అవకాశాన్ని భారత్‌ వినియోగించుకుని, చారిత్రక భాగస్వామి అయిన రష్యా నుంచి పెద్ద మొత్తంలో ముడి చమురును దిగుమతి చేసుకుంది. ప్రపంచ మార్కెట్ కంటే తక్కువ ధరకు చమురు లభించడంతో భారత్‌కు కొన్ని బిలియన్ డాలర్లు ఆదా అయ్యాయి.

రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని అమెరికాతో (USA) సహా పశ్చిమ దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ట్రంప్‌ ఇప్పటికే భారత్‌పై టారిఫ్‌లు విధించారు, రష్యాకు ఆర్థిక వనరులు అందిస్తున్నారని ఆరోపించారు. అయితే, తన దేశ అవసరాలు, ప్రయోజనాలే ముఖ్యమని భారత్‌ గట్టిగా సమాధానమిచ్చింది.

* ట్రంప్‌ వ్యాఖ్యల వెనుక కదలికలు

ట్రంప్‌ ప్రకటన వెనుక కేవలం రాజకీయ అంశమే కాకుండా వ్యూహాత్మక ప్రయోజనాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్‌-మోదీ మధ్య ఇంధన సరఫరాల పునర్‌వ్యవస్థీకరణ, వ్యూహాత్మక భాగస్వామ్యాల బలోపేతంపై చర్చలు జరిగాయని సమాచారం.

అమెరికా ప్రయోజనం

చైనా ప్రభావాన్ని తగ్గించడానికి ఇండో-పసిఫిక్‌ వ్యూహంలో భారత్‌ను మరింత భాగస్వామిగా చేసుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో, భారత్ పాశ్చాత్య మార్కెట్‌కు దగ్గరవ్వడం అమెరికాకు అనుకూలం.

రష్యా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం

చమురుకు రష్యాకు రెండవ అతిపెద్ద కొనుగోలుదారు భారత్. భారత కొనుగోళ్లు తగ్గితే రష్యా ఆదాయం తగ్గుతుంది. ఇది ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాపై ఆర్థిక ఒత్తిడిని పెంచుతుంది.

* భారత్‌కి ఎదురయ్యే ఇంధన సవాళ్లు

భారత్‌ తన రోజువారీ అవసరాలకు సుమారు 5 మిలియన్ బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంటుంది. ఇందులో రష్యా వాటా సుమారు 35-40 శాతం వరకు ఉంది. రష్యా నుంచి చమురు సరఫరా తగ్గే నిర్ణయం తీసుకుంటే భారత్‌కు తక్షణమే ప్రత్యామ్నాయ వనరులు అవసరమవుతాయి:

ధరల పెరుగుదల

మధ్య ప్రాచ్యం, అమెరికా లేదా లాటిన్ అమెరికన్ మార్కెట్ల నుంచి కొనుగోలు చేస్తే ధరలు పెరగవచ్చు, ఎందుకంటే రష్యా ఇచ్చినంత డిస్కౌంట్‌ ఇతర దేశాలు ఇవ్వకపోవచ్చు. ఒక్క దేశంపై ఆధారపడకుండా చమురు వనరులను వైవిధ్యపరచడం భారత్‌కు సవాలుగా మారుతుంది. ఇతర దూర ప్రాంతాల నుంచి చమురు దిగుమతి చేసుకోవడం వల్ల రవాణా వ్యయాలు కూడా పెరుగుతాయి.

* నూతన ఇంధన వ్యూహం దిశగా భారత్‌

దీర్ఘకాలికంగా, రష్యా చమురుపై ఆధారపడటాన్ని తగ్గించే క్రమంలో భారత్ పునరుత్పాదక శక్తి , గ్రీన్ హైడ్రోజన్, లిథియం బ్యాటరీ నిల్వలు వంటి కొత్త రంగాలపై మరింత దృష్టి పెట్టవచ్చు. ఇది భారత ఇంధన స్వావలంబన లక్ష్యానికి కొత్త దశను ప్రారంభించవచ్చు. ట్రంప్‌ ప్రకటన నిజమైతే, భారత్‌ ఇంధన నిర్ణయాలు రాబోయే నెలల్లో ప్రపంచ ఇంధన మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి.