లోకల్ బిరియానీకి గ్లోబల్ తడ్కా .. హైదరాబాద్‌కు పోయి పోయి ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ నా?
మన హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ బ్రాండింగ్ తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక ‘విరాట్ రూప’ నిర్ణయం తీసుకుంది.
By: A.N.Kumar | 16 Jun 2026 12:05 AM ISTమన హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ బ్రాండింగ్ తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక ‘విరాట్ రూప’ నిర్ణయం తీసుకుంది. కేవలం బిరియానీ, ఐటీ కారిడార్లతో గ్లోబల్ సిటీ అయిపోతే ఎలా? అందుకే నగరానికి మరింత ‘అమెరికన్ లుక్’ తీసుకురావాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును హైదరాబాద్‌లోని ఒక ప్రధాన రహదారికి పెట్టబోతున్నారు.
అమెరికా కాన్సులేట్ కార్యాలయం పక్కన ఉన్న రోడ్డును జూన్ 23 నుంచి అధికారికంగా ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా మార్చబోతున్నారు. ఎంతైనా ‘ట్రంప్’ గారికి, ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా’కు ఉన్న కనెక్షన్ కంటే, మన గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లకే ఎక్కువ కనెక్షన్ ఉందేమోనని అధికారులు భావించి ఉంటారు.
గ్లోబల్ సిటీ అంటే గ్లోబల్ లీడర్లు ఉండాలిగా..
ప్రభుత్వ వర్గాల అంతర్గత సమాచారం ప్రకారం.. హైదరాబాద్‌ను నిజమైన ‘గ్లోబల్ సిటీ’గా మార్చడానికి కేవలం రోడ్లు వేస్తే సరిపోదు, వాటికి విదేశీ పేర్లు కూడా పెట్టాలి. అందుకే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ నాయకులు, బిజినెస్ టైకూన్ల పేర్లను నగరంలోని ముఖ్య రహదారులకు పెట్టే ప్రతిపాదనపై కసరత్తు జరుగుతోంది. ఈ లెక్కన రేపు పొద్దున జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36 ను ‘ఎలాన్ మస్క్ ఎక్స్‌ప్రెస్‌వే’గా మార్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాగే కూకట్‌పల్లి రోడ్లను ‘మార్క్ జుకర్‌బర్గ్ లేన్’ అని పిలుచుకునే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయేమో... దీనివల్ల విదేశీ పెట్టుబడులు వర్షంలా కురుస్తాయని అధికారులు గట్టి నమ్మకంతో ఉన్నారు. ట్రంప్ పేరు చూడగానే అమెరికా కంపెనీలన్నీ డాలర్ల మూటలతో హైదరాబాద్‌లో వాలిపోతాయన్నమాట.. ట్విస్ట్ ఏంటంటే ఈ ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’లో రేపు పొద్దున ట్రాఫిక్ జామ్ అయితే వాహనదారులు హారన్లు కొడుతూ చేసే రచ్చకు ట్రంప్ గారు సోషల్ ట్రూత్ లో ఏమని స్పందిస్తారో చూడాలి.
సోషల్ మీడియాలో మీమ్స్ పండగ.. రాజకీయాల్లో రచ్చ
ఈ నిర్ణయం బయటకు రాగానే సోషల్ మీడియాలో మీమ్స్ రాయుళ్లు పండగ చేసుకుంటున్నారు. "అమెరికా కాన్సులేట్ పక్కన రోడ్డు కాబట్టి సరిపోయింది.. రేపు పొద్దున ఆ రోడ్డు మీద ఎవరైనా గొడవ పడితే, దాన్ని ‘కాపిటల్ హిల్ దాడి’తో పోల్చరు కదా?" అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. దేశంలో, రాష్ట్రంలో ఎంతోమంది మహానుభావులు, స్వాతంత్ర్య సమరయోధులు ఉంటే.. వాళ్ల పేర్లు వదిలేసి, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన విదేశీ నాయకుడి పేరు పెట్టడం ఎంతవరకు సమంజసం? అంటూ ప్రశ్నిస్తున్నారు. మద్దతుదారుల మాత్రం "మన ఆలోచనలు ఎప్పుడూ లోకల్‌గా ఉండకూడదు బ్రదర్.. గ్లోబల్‌గా ఉండాలి. ట్రంప్ పేరు పెడితే ఆ ‘గెటప్’ వేరేలా ఉంటుంది" అని సమర్థిస్తున్నారు.
జూన్ 23న గ్రాండ్ ఓపెనింగ్?
నగర మౌలిక వసతులకు అంతర్జాతీయ ‘కలర్’ అద్దే ఈ నామకరణ కార్యక్రమం జూన్ 23న జరగనున్నట్లు తెలుస్తోంది. ఆ రోజు నుంచి హైదరాబాద్ మ్యాప్‌లో ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ అధికారికంగా దర్శనమివ్వనుంది.
ఏదేమైనా రేపు పొద్దున ఆ రోడ్డు మీద వెళ్లే ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు.. "సార్.. కొంచెం ట్రంప్ అవెన్యూ దగ్గర దించేయండి" అని పలికే పలుకులు వినడానికి రెండు చెవులూ చాలవేమో.. లోకల్ బిరియానీకి గ్లోబల్ తడ్కా అంటే ఇదేనేమో మరి!
