Begin typing your search above and press return to search.

అమెరికా రాజకీయాల్లో డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలనం

అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగం ప్రకారం.. ఒక వ్యక్తి అధ్యక్షుడుగా కేవలం రెండు పర్యాయాలు మాత్రమే బాధ్యతలు చేపట్టాలి.

By:  A.N.Kumar   |   23 Jan 2026 7:49 PM IST
అమెరికా రాజకీయాల్లో డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలనం
X

అమెరికా రాజకీయాల్లో డొనాల్డ్ ట్రంప్ అంటేనే ఒక సంచలనం. ఆయన చేసే ప్రతి వ్యాఖ్య.. వేసే ప్రతి అడుగు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తుంది. తాజాగా ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా చేసిన ఒకే ఒక్క పోస్ట్ ఇప్పుడు అగ్రరాజ్యంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. "నేను నాలుగోసారి పోటీ చేయాలా?" అంటూ ఆయన వేసిన ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో సోషల్ మీడియా వేదికగా మరో బాంబు పేల్చారు. తన సొంత ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్' లో "నేను నాలుగో సారి పోటీ చేయాలా?" అని ప్రశ్నిస్తూ "ట్రంప్ 2028 , అవును" అని రాసి ఉన్న ఒక ఫోటోను షేర్ చేశారు. దీంతో అమెరికా రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది.

ఏం జరిగింది?

తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్'లో ట్రంప్ ఒక ఆసక్తికరమైన ఫోటోను షేర్ చేశారు. 2024 ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్న ట్రంప్, తన పదవీకాలం ముగిశాక కూడా మళ్లీ బరిలోకి దిగుతానని సంకేతాలివ్వడం గమనార్హం.

రాజ్యాంగం ఏం చెబుతోంది?

అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగం ప్రకారం.. ఒక వ్యక్తి అధ్యక్షుడుగా కేవలం రెండు పర్యాయాలు మాత్రమే బాధ్యతలు చేపట్టాలి. ట్రంప్ ఇప్పటికే 2016-2020 వరకు ఒకసారి పనిచేశారు. ప్రస్తుతం 2024 గెలుపు తర్వాత రెండోసారి పదవిలో ఉన్నారు. ప్రస్తుత నిబంధనల దృష్ట్యా ట్రంప్ 2028లో మళ్లీ పోటీ చేయడానికి అర్హులు కారు.

రాజ్యాంగ సవరణ సాధ్యమేనా?

ట్రంప్ మద్దతుదారులు కొందరు 'మూడో పర్యాయం' కోసం రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇది అంత సులభం కాదు. అమెరికాలో రాజ్యాంగాన్ని సవరించాలంటే ప్రతినిధుల సభ, సెనెట్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. మొత్తం 50 రాష్ట్రాల్లో కనీసం 38 రాష్ట్రాల అసెంబ్లీలు దీనిని ఆమోదించాలి. ప్రస్తుత రాజకీయ చీలికల నేపథ్యంలో ఇంత భారీ మెజారిటీ సాధించడం దాదాపు అసాధ్యమని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.

స్టంట్ ఆ.. సీరియస్ నా?

రాజకీయ విశ్లేషకులు దీనిని ట్రంప్ మార్క్ 'పబ్లిసిటీ స్టంట్' గా అభివర్ణిస్తున్నారు. ప్రజల దృష్టిని తనపైనే ఉంచుకోవడానికి, అలాగే రిపబ్లికన్ పార్టీపై తన పట్టును నిరూపించుకోవడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారని వారు భావిస్తున్నారు. గతంలో కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేసినా, తర్వాత వాటిని కేవలం సరదాగా చేసినవిగా కొట్టిపారేశారు.

ట్రంప్ వ్యాఖ్యలు కేవలం సోషల్ మీడియా చర్చకే పరిమితమవుతాయా లేక అమెరికా రాజ్యాంగ చరిత్రలో కొత్త మలుపునకు దారితీస్తాయా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా "ట్రంప్ 2028" అనే స్లోగన్ ఇప్పుడు అమెరికా వీధుల్లో మారుమోగిపోతోంది.