ట్రంప్ టారిఫ్: ఫార్మాపై 200% సుంకం భయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే టారిఫ్ నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారుతున్నాయి.
By: A.N.Kumar | 7 Sept 2025 10:26 AM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే టారిఫ్ నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు స్టీల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ వంటి విభాగాలపై భారీ పన్నులు విధించిన ఆయన, ఇప్పుడు ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులపై దృష్టి సారించబోతున్నారన్న వార్తలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే మందులపై 200 శాతం సుంకం విధించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
*ధరల పెరుగుదల–కొరత భయం
ఇప్పటికే అమెరికాలో మందుల ధరలు సాధారణ ప్రజలకు భారం అయ్యే స్థాయిలో ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో 200% సుంకం విధిస్తే ధరలు మరింత పెరగటమే కాకుండా సరఫరాలో కొరత ఏర్పడే అవకాశముంది. ఆరోగ్య బీమా ప్రీమియంలు కూడా భారీగా పెరిగిపోతాయని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.
*2027 నుంచి ప్రభావం?
ప్రస్తుతం అమెరికా ఫార్మా కంపెనీలు నిల్వలను పెంచుకుంటున్నాయి. ట్రంప్ ఒకటిన్నర సంవత్సరంపాటు టారిఫ్ వాయిదా వేస్తానని చెప్పడంతో, ఆ కాలంలో అవసరమైన మందులను ముందుగానే దిగుమతి చేసుకుని స్టాక్ చేస్తున్నారు. అందువల్ల నిజమైన ప్రభావం 2027-28 నాటికి మాత్రమే కనిపించవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే అప్పటికి ట్రంప్ 200% టారిఫ్ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గి తక్కువ పన్నులే విధిస్తారన్న అభిప్రాయం కూడా ఉంది. కానీ కేవలం 25% టారిఫ్ విధించినా అమెరికాలో మందుల ధరలు 10-14% వరకు పెరుగుతాయని అంచనా.
*అమెరికా తయారీ వైపు ఒత్తిడి
అమెరికాలో తయారీ ఖర్చులు ఎక్కువ కావడంతో గతంలో ఫార్మా తయారీ చైనా, భారత్, స్విట్జర్లాండ్, ఐర్లాండ్‌లకు మారిపోయింది. దీంతో అమెరికాకు ఏటా 150 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు వస్తోంది. ఇప్పుడు ట్రంప్ ఒత్తిడి కారణంగా కొన్ని కంపెనీలు అమెరికాలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతున్నాయి. ఉదాహరణకు స్విట్జర్లాండ్‌కు చెందిన రోష్ అమెరికాలో 50 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. అయితే అన్ని మందులను అమెరికాలోనే తయారు చేయడం సాధ్యం కాదు. ముడి పదార్థాలు, APIs మాత్రం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే.
*పరిష్కారం పన్నులు పెంచడం మాత్రమేనా?
కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం, అధిక పన్నులు విధించడం ద్వారా అమెరికాలో తయారీ పెరగదని, దానికి ప్రభుత్వ మద్దతు, సహకారం అవసరమని చెబుతున్నారు. పరిశ్రమను పూర్తిగా అమెరికాలోకి మార్చడానికి వ్యవస్థాత్మక మార్పులు అవసరం. అది చేయడానికి ఎంత ఖర్చైనా భరించేందుకు అమెరికా సిద్ధమా? అన్న ప్రశ్న పెద్దదిగా మారింది.
ట్రంప్ టారిఫ్ ఆలోచన ఫార్మా రంగంలో అనిశ్చితి, ఆందోళన సృష్టిస్తోంది. అమెరికాలో మందుల ధరలు తగ్గించాలని చెప్పిన ఆయన నిర్ణయాలు వ్యతిరేక ఫలితాన్నే ఇస్తే ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి 200% సుంకం విధించాలా, లేక సరైన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలా అన్నది రాబోయే నెలల్లో తేలనుంది.
