Begin typing your search above and press return to search.

100% సుంకాల బాంబు పేల్చిన ట్రంప్.. అమలు ముహూర్తం ఫిక్స్!

అవును... అమెరికాకు అరుదైన ఖనిజాలు ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తంచేసిన ట్రంప్‌.. భారీ సుంకాలు విధిస్తానంటూ హెచ్చరికలు చేశారు.

By:  Raja Ch   |   11 Oct 2025 11:38 AM IST
100% సుంకాల బాంబు పేల్చిన ట్రంప్.. అమలు ముహూర్తం ఫిక్స్!
X

రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్.. ప్రపంచ దేశాలపై సుంకాల బాంబులు వేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే సుంకాల రాజు అని అభివర్ణిస్తూ.. భారత్ పై అన్ని విధాలా తన దాడి మొదలుపెట్టిన ట్రంప్.. ఇప్పుడు తాజాగా చైనాకు షాక్ ఇచ్చారు. ఇందులో భాగంగా... చైనా దిగుమతులపై అదనంగా 100 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు.

అవును... అమెరికాకు అరుదైన ఖనిజాలు ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తంచేసిన ట్రంప్‌.. భారీ సుంకాలు విధిస్తానంటూ హెచ్చరికలు చేశారు. ఇదే సమయంలో చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ తో భేటీని రద్దు చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగారు. ఈ నేపథ్యంలో తాజాగా చైనాపై సుంకాల బాంబు పేల్చారు. ఈ టారిఫ్ లు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించారు.

ఇప్పటికే చైనాపై 30 శాతం సుంకాలు విధించిన ట్రంప్... అదనంగా 100 శాతం సుంకం విధిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా... వాణిజ్యంపై బీజింగ్ అసాధారణమైన దూకుడు వైఖరిని తీసుకుంటోందని ఆరోపిస్తూ.. అమెరికా కూడా అదే విధంగా స్పందిస్తుందని హెచ్చరించారు. దీంతో.. ఈ నిర్ణయాన్ని ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఉద్రిక్తతలను పెంచే చర్యగా అభివర్ణిస్తున్నారు.

ఈ సందర్భంగా... నవంబర్ 1, 2025 నుండి, ముందుగానే.. చైనా తీసుకునే ఏవైనా తదుపరి చర్యలు లేదా మార్పులను బట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆ దేశంపై 100% సుంకాన్ని విధిస్తుందని ట్రంప్ ప్రకటించారు. చైనా తాము తయారు చేసే ప్రతి ఉత్పత్తిపైనా భారీ ఎగుమతి ఆంక్షలు విధించాలని యోచిస్తోందనే నివేదికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఈ చర్య అమలు చేయబడితే.. ఇప్పటికే ఉన్న సుంకాల వల్ల ఒత్తిడిలో ఉన్న వినియోగదారు ఎలక్ట్రానిక్స్ నుండి ఎలక్ట్రిక్ వాహనాల వరకు దాదాపు చాలా రంగాలపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో... ట్రంప్ తన మొదటి పదవీకాలంలో చేసిన వాణిజ్య యుద్ధాల తర్వాత వాషింగ్టన్ తీసుకున్న అత్యంత తీవ్రమైన చర్యలలో ఇది ఒకటి అవుతుందని అంటున్నారు.

దక్షిణ కొరియాలో సుమారు మూడు వారాల్లో జిన్‌ పింగ్‌ ను కలవనున్న ట్రంప్ తాజా నిర్ణయం ఆసక్తిగా మారింది. పైగా అమెరికాకు అరుదైన ఖనిజాలు ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడంపై ట్రంప్ మండిపడుతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే క్రిటికల్‌ సాఫ్ట్‌ వేర్‌ ను ఇతర దేశాలతో పంచుకోవడంపై నియంత్రణ విధిస్తున్నట్లు వివరిస్తూ.. ట్రంప్ తాజా నిర్ణయం తీసుకున్నారు!