హెచ్-1బీ సంక్షోభం.. అమెరికాను వీడుతున్న భారతీయ కుటుంబాలు!
ఉద్యోగ భద్రత అనేది టెక్ రంగానికి దిష్టిచుక్కలా మారిపోవడంతో మన డల్లాస్, ఇర్వింగ్ అంకుల్స్ పరిస్థితి 'అటు ఉద్యోగం లేక.. ఇటు ఇల్లు అమ్మలేక' త్రిశంకు స్వర్గాన్ని తలపిస్తోంది.
By: A.N.Kumar | 6 Sept 2026 12:27 PM ISTఒకప్పుడు "అమెరికా వెళ్తున్నాం బాబాయ్" అంటే బంధువుల కళ్లల్లో అసూయ... పొరుగువారి గుండెల్లో విస్మయం కనిపించేవి. డాలర్ల వర్షంలో తడిసి ముద్దయిపోవచ్చని.. పిల్లలకు పింక్ కార్డ్.. చేతికి గ్రీన్ కార్డ్ వచ్చేశాయని పండగ చేసుకునేవారు. కానీ కట్ చేస్తే.. ఇప్పుడు ఆ "అమెరికన్ డ్రీమ్" కాస్తా.. "హోమ్ లోన్ ప్లస్ హెచ్-1బీ" అనే నైట్ మేర్‌గా మారిపోయింది.
ఉద్యోగ భద్రత అనేది టెక్ రంగానికి దిష్టిచుక్కలా మారిపోవడంతో మన డల్లాస్, ఇర్వింగ్ అంకుల్స్ పరిస్థితి 'అటు ఉద్యోగం లేక.. ఇటు ఇల్లు అమ్మలేక' త్రిశంకు స్వర్గాన్ని తలపిస్తోంది. పదేళ్లు కష్టపడి సంపాదించిన డబ్బుతో "సెలినా, మెలిస్సా" ప్రాంతాల్లో రాజభవనాల్లాంటి ఇళ్లు కొంటే.. ఇప్పుడు ఆ ఇళ్ల విలువల కంటే బ్యాంకు మార్ట్గేజ్ బకాయిలే భారీగా దర్శనమిస్తున్నాయి. దీనికే అమెరికన్లు ముద్దుగా ‘అండర్‌వాటర్ మార్ట్‌గేజ్’ అని పేరు పెట్టారు. అంటే నీటిలో మునిగిపోతున్నామని అర్థం.. ఐదు లక్షల డాలర్ల ఇల్లు కొంటే ఇప్పుడు దాని రేటు నాలుగు లక్షలకు పడిపోయింది. ఇల్లు అమ్మాలన్నా జేబులోంచి మరో లక్ష డాలర్లు తీసి బ్యాంకు ముఖాన కొట్టాలి. ఉద్యోగం పోయిన 60 రోజుల్లో కొత్త ఉద్యోగం వెతుక్కోవాలో.. లేక ఈ మార్ట్‌గేజ్ గోల తేల్చుకోవాలో తెలియక మనవాళ్లు తలలు పట్టుకుంటున్నారు.
ఇక వీసా నిబంధనల సంగతి సరేసరి. 60 రోజుల గ్రేస్ పీరియడ్ అంటే ఏదో రోడ్‌సైడ్ టిఫిన్ సెంటర్‌లో దోశ తిన్నంత వేగంగా కరిగిపోతోంది. ఈ అనిశ్చితి, గ్రీన్ కార్డ్ కోసం దశాబ్దాల తరబడి చేసే నిరీక్షణ, నెలకు చెల్లించాల్సిన ప్రాపర్టీ ట్యాక్స్‌ల వాతలు భరించలేక... చాలామంది "చాలు మహాప్రభో ఈ డాలర్ల గోల" అని సైలెంట్‌గా సర్దుకుని స్వదేశానికి యూ-టర్న్ తీసుకుంటున్నారు.
ఫ్లైట్ ఎక్కి హైదరాబాదో, బెంగళూరో వస్తున్న కుటుంబాలు ఇప్పుడు "అక్కడి కంటే ఇక్కడే పీస్ ఆఫ్ మైండ్ ఉందబ్బా" అని కవర్ చేసుకుంటున్నా లోలోపల మాత్రం అమెరికన్ డ్రీమ్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోవడానికి కాస్త సమయం పట్టేలానే ఉంది. మొత్తానికి 'డాలర్ డ్రీమ్స్' చూపిస్తూ అమెరికా ఇచ్చిన గిఫ్ట్.. ఇప్పుడు 'దేశం కాని దేశంలో రీసేల్ లేని ఇల్లు' అని తేలిపోయింది.
