దీపావళి విషెస్ తో ఉదయనిధి కొత్త వివాదం
అందుకే సాధారణంగా దీపావళి అయినా మరో పండుగ అయినా గ్రీట్ చేయడం అన్నది ఉండదు, కానీ ఉదయనిధి ఈసారి ఎందుకో దానికి బ్రేక్ చేస్తూ విషెస్ చెప్పారు.
By: Satya P | 20 Oct 2025 11:00 PM ISTఏ పండుగ వచ్చినా ప్రజలకు విషెస్ చెప్పడంలో రాజకీయ నాయకులు ముందు ఉంటారు. ఎందుకంటే ప్రజలతో కనెక్షన్ అతి ముఖ్యం కాబట్టి. అందుకే మతాలకు సంబంధం లేకుండా అందరికీ శుభాకాంక్షలు చెబుతారు. అయితే తమిళనాడులో ఉప ముఖ్యమంత్రి డీఎంకే పార్టీ యువజన నాయకుడు ఉదయనిధి తనదైన శైలిలో దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. ఆయన షరతులతో కూడిన విధంగా ఆయన విషెస్ చెప్పడం మీద పెద్ద చర్చ సాగుతోంది. ఒక విధంగా ఇది రాజకీయ దుమారం రేపింది.
నమ్మకం ఉన్న వారికేనట :
దీపావళి పండుగ మీద నమ్మకం ఉన్న వారికే అంటూ ఆయన విషెస్ చెప్పారు. దాంతో ఇదేమి విషెస్ ఉప ముఖ్యమంత్రి గారూ అని అంతా ఆశ్చర్యపోతున్నారు. దీపావళి వేడుకలను భారత దేశంలో అన్ని మతాలకు అతీతంగా జరుపుకుంటారు అన్నది తెలిసిందే. పైగా ఇతర దేశాలలో కూడా దీపావళిని ఒక అతి పెద్ద వేడుకగా ఉత్సాహంగా జరుపుకునే సంబరంగా గుర్తించి సెలవు కూడా ఇస్తున్నారు. అటువంటిది దేశంలో ఒక ముఖ్యమైన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఉదయనిధి ఈ విధంగా చెప్పడమేంటి అని హిందూత్వవాదులు మండిపోతున్నారు.
హేతు వాద భావజాలం :
డీఎంకే ద్రవిడ భావజాలంతో ఏర్పడిన పార్టీ. హేతు వాల భావజాలాన్ని అంతా నమ్ముతారు. అందుకే సాధారణంగా దీపావళి అయినా మరో పండుగ అయినా గ్రీట్ చేయడం అన్నది ఉండదు, కానీ ఉదయనిధి ఈసారి ఎందుకో దానికి బ్రేక్ చేస్తూ విషెస్ చెప్పారు. ఆ చెప్పినది కూడా కండిషన్ తో కూడి ఉండడంతో అది కాస్తా రాజకీయ దుమారం రేపుతోంది.
ఆనాడు సనాతనం :
గతంలో సనాతన ధర్మాన్ని కూడా విమర్శిస్తూ ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో అంతా చూశారు. చివరికి కోర్టుల దాకా ఈ వ్యవహారం వెళ్ళింది. మరి ఇంత జరిగిన తరువాత కూడా ఆయన తన తీరుని మార్చుకోలేదని అంటున్నారు మత విశ్వాసాలు ఎవరివి అయినా గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్న వారికి ఫలనా మతం మీద ప్రత్యేక అభిమానం ఉండకూడదు కానీ అదే సమయంలో అన్ని మతాల పట్ల సమానమైన గౌరవం ఆదరణ చూపించాల్సి ఉంటుందని అంటున్నారు. ఇలా ఆయన దీపావళి పండుగ రోజున ఈ విధంగా చెప్పడంతో సహజంగానే బీజేపీ నేతలు గట్టిగానే విమర్శలు చేస్తున్నారు.
హిందూ వ్యతిరేక పార్టీ :
బీజేపీ మహిళా నాయకురాలు తమిల్ సై దీని మీద ఫైర్ అయ్యారు. డీఎంకే హిందూ వ్యతిరేక పార్టీ అని ఆమె విమర్శించారు. రాష్ట్రంలో ఇతర మతాల వారి పండుగలకు ఈ విధంగానే శుభాకాంక్షలు షరతులతో చెబుతారా అని ఆమె ప్రశ్నించారు. హిందూ మతం మీద అంత వివక్ష ఎందుకు చూపిస్తున్నారు అని ఆమె నిలదీశారు. రాష్ట్రంలో పౌరులు అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంటుందని ఆమె అన్నారు. మొత్తానికి ఈ వివాదంతో మరోసారి డీఎంకే వర్సెస్ బీజేపీగా రాజకీయ రచ్చ రాజుకునే అవకాసం ఉంది.
