Begin typing your search above and press return to search.

సీఎం విజయ్-త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. ఎమ్మెల్యే అరెస్ట్

కానీ ఆ నోటి దూల ఒక్కోసారి జైలు ఊచలు లెక్కపెట్టేలా చేస్తుందని తమిళనాడు డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్‌కు ఇప్పుడు బాగా అర్థమై ఉంటుంది.

By:  A.N.Kumar   |   3 July 2026 4:31 PM IST
సీఎం విజయ్-త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. ఎమ్మెల్యే అరెస్ట్
X

రాజకీయాల్లో మైకు దొరికితే చాలు.. ఏం మాట్లాడుతున్నామో కూడా మర్చిపోయి రెచ్చిపోవడం మన నేతలకు అలవాటే. కానీ ఆ నోటి దూల ఒక్కోసారి జైలు ఊచలు లెక్కపెట్టేలా చేస్తుందని తమిళనాడు డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్‌కు ఇప్పుడు బాగా అర్థమై ఉంటుంది. తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్, అలాగే స్టార్ హీరోయిన్ త్రిషను ఉద్దేశించి ఆయన చేసిన "అతి" తెలివి కామెంట్లు.. చివరకు ఆయన్ను ‘కటాకటాల’ వెనక్కి నెట్టేశాయి. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఇటీవల ఓ పబ్లిక్ మీటింగ్‌లో మైకు అందుకున్న రాధాకృష్ణన్ గారు, పొలిటికల్ విమర్శలు పక్కనబెట్టి పర్సనల్ లైఫ్ లోకి దూరేశారు. "రాజకీయాల్లోకి వచ్చి విజయ్ ఇరుక్కుపోయారు. ఇంట్లో నటి త్రిషతో ఎంతో సంతోషంగా ఉండేవారని, ఇప్పుడు ఆ రోజులను గుర్తు చేసుకుంటూ ఉంటారేమో" అంటూ లీకులు ఇచ్చారు.

సరిగ్గా ఇక్కడే సీన్ రివర్స్ అయింది.. ప్రజా సమస్యలపై మాట్లాడమంటే.. ఎవరో ఇంట్లో ఏం జరుగుతుందో మనకెందుకు స్వామీ? అని సోషల్ మీడియా కోడై కూసింది. 'లియో' సినిమాలో విజయ్-త్రిష కెమిస్ట్రీ బాగా నచ్చేసిందో ఏమో గానీ, దాన్ని తెచ్చి పొలిటికల్ స్టేజీపై రుద్దేసరికి టీవీకే నేతలకు ఎక్కడో కాలింది. వెంటనే పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టేశారు.

ముందస్తు బెయిల్ ‘స్కెచ్’ రివర్స్.. జైలులో రిమాండ్

కేసు నమోదు కాగానే సీన్ అర్థమైన ఎమ్మెల్యే గారు, అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి మద్రాస్ హైకోర్టు మెట్లు ఎక్కారు. "అయ్యా.. నాది నోటి పొరపాటే.. ముందస్తు బెయిల్ ఇవ్వండి" అంటూ పిటిషన్ వేశారు. కానీ కోర్టు మాత్రం "మైకు దొరికితే ఏదైనా మాట్లాడతారా?" అన్నట్లుగా పిటిషన్‌ను నిర్మొహమాటంగా తిరస్కరించింది. ఇంకేముంది.. పోలీసులు ఎంట్రీ ఇచ్చి, ఆయన్ను అదుపులోకి తీసుకుని జడ్జి ముందు నిలబెట్టారు. కోర్టు కాస్తా సారు గారికి గట్టిగానే ‘హోంవర్క్’ ఇచ్చి, జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ జైలుకు పంపింది.

సినిమా వేరు.. రాజకీయం వేరు బాసూ!

రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు కామనే. పాలన బాగోలేదనో, విధానాలు నచ్చలేదనో తిట్టిపోస్తే అదో పద్ధతి. కానీ, ఇలా పర్సనల్ లైఫ్‌ను, అదీ ఒక మహిళా నటిని లాగి మాట్లాడటం ఏ రకమైన సంస్కారమో ఆ డీఎంకే ఎమ్మెల్యే గారికే తెలియాలి. ప్రస్తుతం ఈ వ్యవహారం తమిళనాడు పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. డీఎంకే, టీవీకే మధ్య సోషల్ మీడియాలో పెద్ద ‘కత్తియుద్ధమే’ నడుస్తోంది.

ప్రజల ముందు మాట్లాడేటప్పుడు నోటికి కొంచెం ‘సెన్సార్’ వేసుకోకపోతే.. ఇలాగే రిమాండ్ రూమ్‌లో కూర్చుని "ఆ రోజులను గుర్తు చేసుకోవాల్సి వస్తుంది" అని రాజకీయ విశ్లేషకులు చెవులు పిండి చెబుతున్నారు. మరి ఇప్పటికైనా మన నేతలు మారతారా? లేక నెక్స్ట్ వికెట్ ఎవరిదా అని వెయిట్ చేయాలా? చూడాలి.