Begin typing your search above and press return to search.

మగవారికీ ఉచిత బస్సులు...సూపర్ పథకం గురూ !

ఉచిత బస్సులు మహిళలకే కేటాయించడంతో మగ మహారాజులు అంతా తెగ ఇబ్బంది పడుతున్నారు. తాము చార్జీలు కట్టి బస్సులో ఎక్కుతామన్నా వీలు లేకుండా పోతోందని తెగ బాధ పడుతున్నారు.

By:  Satya P   |   17 Jan 2026 6:00 PM IST
మగవారికీ ఉచిత బస్సులు...సూపర్ పథకం గురూ !
X

ఉచిత బస్సులు మహిళలకే కేటాయించడంతో మగ మహారాజులు అంతా తెగ ఇబ్బంది పడుతున్నారు. తాము చార్జీలు కట్టి బస్సులో ఎక్కుతామన్నా వీలు లేకుండా పోతోందని తెగ బాధ పడుతున్నారు. ఎంతో కష్టపడి బస్సు ఎక్కినా సీటులో కూర్చున్న వారిని సైతం లేపేసి నెట్టేసి కొందరు ఆడవాళ్ళు కూర్చుంటున్నారు అని వాపోతున్నారు. తాము కూడా ఉద్యోగ వ్యాపారాలు చేసుకోవాలి కదా తమకు కూడా అవే బస్సులు కదా అని వారు ఎంత గోడు పెడుతున్నా లేడీస్ స్పెషల్ గా జనరల్ బస్సులు మార్చేసి మగవాళ్ళ చేత గుంజీలు తీయించేస్తున్నారు. ఈ పథకం ద్వారా మహిళా ఓట్లు ఎన్ని వస్తాయో తెలియదు కానీ పురుషులు అయితే మండిపోతున్నారు.

తంబీలకు హామీ :

మరి ఈ బాధను ఆవేదనను తమిళనాడులోని ప్రతిపక్ష అన్నా డీఎంకే పార్టీ అర్ధం చేసుకున్నట్లుంది. అందుకే తాజాగా విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో తంబీలకు భారీ హామీ ఇచ్చేసింది. తాము అధికారంలోకి వస్తే పురుషులకు కూడా మహిళలతో పాటుగా బస్సులలో ఉచిత ప్రయాణం పధకం ప్రవేశపెడతామని ఒట్టేసి మరీ చెప్పేసింది. దీంతో పురుషులు ఎలా రియాక్టు అవుతారో తెలియదు, ఒక వేళ వారు అంతా సంబరపడి ఎగిరి గంతేసి అన్నాడీఎంకేకి పట్టం కట్టారే అనుకుంటే ఇప్పటికే మహిళల కోసం ఉచిత బస్సు పధకం అమలు అవుతున్న కర్ణాటక, తెలంగాణా, ఏపీ రాష్ట్రాలలో కూడా మగవారు ఆ డిమాండ్ చేయడం ఖాయం. దానితో పాటు ఓటు పవర్ చూసి ఆయా ప్రభుత్వాలు సైతం వారికి కూడా ఫ్రీ బస్సులు అని పచ్చ జెండా ఊపేయడం ఖాయమని అంటున్నారు.

టోటల్ గా ఫ్రీనా :

ఇక మగవారికీ ఉచితం చేస్తే బస్సులో చార్జీలు కట్టి ఎవరు ప్రయాణం చేస్తారు అన్న చర్చ అయితే సాగుతోంది. ఇప్పటికే రాయితీలు చాలా వాటికి ఉన్నాయి. దీంతో వీటికి బదులు అంతా ఉచితం అంటే మాత్రం బస్సులు అన్నీ ఫ్రీగానే రోడ్ల మీదకు తిరగాల్సి ఉంటుందా అన్న చర్చ కూడా వస్తోంది. మరి ఏ రకమైన పరిణామాలు ముందు ముందు చోటు చేసుకుంటాయో తెలియదు కానీ అన్నా డీఎంకే అధికారంలోకి వచ్చి ఈ హామీని నెరవేర్చితే మాత్రం అపుడు అసలు కధ మొదలవుతుంది అంతా చూడాల్సిందే అంటున్నారు.

వరాల మూట విప్పేశారు :

కేవలం ఈ ఒక్క హామీతోనే కాదు మహిళల కోసం ఏకంగా వరాల మూటనే అన్నా డీఎంకే విప్పేసింది. అందులో ప్రతీ మహిళకు నెలకు వారి ఖాతాలో రెండు వేల రూపాయలు కానుక పేరుతో కొత్త పధకంగా అందిస్తామని చెబుతున్నారు. అలాగే ఇల్లు లేని వారి కోసం అమ్మ ఇంటి పధకాన్ని తీసుకుని వచ్చి గ్రామాలలో అయితే ప్రభుత్వమే భూమిని కొనుగోలు చేసి కాంక్రీట్ తో ఇళ్ళు నిర్మించి ఇస్తుందని హామీ ఇచ్చారు. అలాగే పట్టణాలలో అయితే అపార్టుమెంట్లు నిర్మించి ఇస్తామని అంటున్నారు. మహిళా సాధికారికత లో భాగంగా అమ్మ టూ వీలర్ పథకాన్ని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకం కింద అయిదు లక్షల మంది మహిళలకు ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసుకునేందుకు ప్రభుత్వం తరఫున పాతిక వేల రూపాయల దాకా సబ్సిడీ ఇస్తామని అన్నా డీఎంకే హామీ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న వంద రోజుల ఉపాధి హామీని ఏకంగా 150 రోజులకు చేస్తామని ఆ విధంగా వలసలు ఆపి గ్రామీణ పురుషులు మహిళలకు ఉపాధి భరోసా కల్పిస్తామని అన్నా డీఎంకే పేర్కొంది.