Begin typing your search above and press return to search.

డీఎంకే ఒంటరి...విజయ్ కి రాజకీయ సిరి !

ఇప్పటికే వామపక్షాలు, అలాగే ముస్లిం లీగ్, విజయ్ కాంత్ పార్టీ ఇవన్నీ డీఎంకేని వీడిపోయినవే. లేటెస్ట్ గా చూస్తే దాదాపుగా పదేళ్ళుగా డీఎంకేతో కలసి పనిచేస్తున్న ఎండీఎంకే తన బంధాన్ని తెంపుకుంది.

By:  Satya P   |   28 Jun 2026 9:40 AM IST
డీఎంకే ఒంటరి...విజయ్ కి రాజకీయ సిరి !
X

రాజకీయాల్లో ఎపుడూ అవసరాలదే ప్రధాన పాత్ర అన్నది తెలిసిందే. అయితే అనుభవించే దాకా తత్వం ఎవరికీ అర్ధం కాదు. డీఎంకేకి ఈ నిజం బోధ పడేసరికి పుణ్య కాలం గడచిపోయింది. తమిళనాడులో డీఎంకే ఆరున్నర దశాబ్దాల కాలం నాటి పార్టీ. మిత్రులతో ఎపుడూ డీఎంకే కళకళలాడుతూ ఉండేది. గెలిచినా ఓడినా అరడజను మంది మిత్రులు డీఎంకేతో ఉండేవారు. అయితే ఈసారి మాత్రం సీన్ రివర్స్ అయింది. తమిళనాడులో మొత్తం రాజకీయమే మారిపోయింది. సినీ తెర నుంచి వచ్చిన దళపతి విజయ్ టీవీకే పార్టీ పెట్టి తొలి ఎన్నికల్లోనే గెలిచి వచ్చారు. సీఎం పీఠం అందుకున్నారు. ఆయన నానాటికీ రాజకీయంగా బలపడుతున్నారు అన్నది తెలుస్తోంది. అందుకే వరసగా మిత్రులు అంతా డీఎంకేని వీడిపోతున్నారు అని అంటున్నారు.

దశాబ్దాల నాటి బంధం కట్ :

ఇప్పటికే వామపక్షాలు, అలాగే ముస్లిం లీగ్, విజయ్ కాంత్ పార్టీ ఇవన్నీ డీఎంకేని వీడిపోయినవే. లేటెస్ట్ గా చూస్తే దాదాపుగా పదేళ్ళుగా డీఎంకేతో కలసి పనిచేస్తున్న ఎండీఎంకే తన బంధాన్ని తెంపుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా ఆ పార్టీ ప్రకటించింది. అంతే కాదు తమిళనాడులో సీఎం విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా ఎండీఎంకే తన పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం కూడా చేసింది. దాంతో డీఎంకేకి ఇది గట్టి షాక్ లాంటి పరిణామం అని అంటున్నారు. ఎండీఎంకేని బలహీనపరచేందుకు డీఎంకే కుట్ర చేసింది అని ఎండీఎంకే అధినేత వైగో ఆరోపించడం విశేషం.

సైలెంట్ గానే విజయ్ :

తమిళనాడు వంటి రాజకీయ చైతన్యం కలిగిన రాష్ట్రానికి పెద్దగా రాజకీయ అనుభవం లేని విజయ్ సీఎం అయ్యారు. ఆయనకు మద్దతు అయితే పూర్తిగా లేదు. ఏకైక పెద్ద పార్టీగానే టీవీకే అవతరించింది. దాంతో ఎలా నెగ్గుకుని వస్తారు అనుకుంటే ఒక్కొక్క పార్టీని విజయ్ ఆకట్టుకుంటున్న తీరు ఆయన సైలెంట్ గానే పొలిటికల్ ఆపరేషన్ చేసారా అన్న చర్చ సాగుతోంది. ఇప్పటికే ఇప్పటికే కాంగ్రెస్‌, వీసీకే, ఐయూఎంఎల్‌ విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచాయి. ఈ పార్టీలకు మంత్రివర్గంలో చోటు దక్కింది. అయితే సీపీఐ, సీపీఎంలు టీవీకే ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తున్నాయి. ఇపుడు ఎండీఎంకే మద్దతు ఇచ్చి ప్రభుత్వంలో చేరుతుందా అన్న చర్చ సాగుతోంది.

సోలోగానే డీఎంకే :

ఇదిలా ఉంటే డీఎంకే తమిళనాడు రాజకీయాల్లో ఒంటరిగా మిగిలినట్లు అయింది. తమిళనాడులో ఈ రోజుకీ విపక్షంలో ఉన్న ఏకైన పెద్ద పార్టీ డీఎంకేనే. కానీ మిత్రులందరితో కలసి బలంగా కనిపించేంది. ఇపుడు మిత్రులు అంతా పార్టీని వీడుతున్నారు. ఈ నేపధ్యంలో రానున్న కాలంలో డీఎంకే ఒంటరి పోరుకే సిద్ధపడాల్సి ఉంటుందని అంటున్నారు. విజయ్ టీవీకే ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగి ఇపుడు డీఎంకే మిత్రులను అందరినీ తన వైపునకు తిప్ప్పుకుంది. రానున్న కాలంలో టీవీకే రాజకీయంగా పటిష్టమైన స్థానంలో ఉండబోతోంది అని అంటున్నారు. డీఎంకేకి మాత్రం ఒంటరి పోరు పెను సవాల్ గా మారనుంది అని చెబుతున్నారు. జాతీయ స్థాయిలో కూడా ఇండియా కూటమికి దూరంగా జరిగిన డీఎంకే ఇంటా బయటా పోరు చేయాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు.