Begin typing your search above and press return to search.

ఎన్డీఏ నుంచి బయటకు వస్తేనే చర్చలు.. అన్నాడీఎంకేకు డీఎంకే షరతులు

తమిళనాడు రాజకీయ యవనికపై పెను మార్పులు సంభవించబోతున్నాయా? దశాబ్దాల కాలంగా కత్తులు దూసుకున్న ద్రావిడ దిగ్గజాలు ఒకే గొడుగు కిందకు చేరబోతున్నాయా? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి.

By:  A.N.Kumar   |   8 May 2026 3:52 PM IST
ఎన్డీఏ నుంచి బయటకు వస్తేనే చర్చలు.. అన్నాడీఎంకేకు డీఎంకే షరతులు
X

తమిళనాడు రాజకీయ యవనికపై పెను మార్పులు సంభవించబోతున్నాయా? దశాబ్దాల కాలంగా కత్తులు దూసుకున్న ద్రావిడ దిగ్గజాలు ఒకే గొడుగు కిందకు చేరబోతున్నాయా? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. డీఎంకే , అన్నాడీఎంకే మధ్య పొత్తు పొడవబోతోందన్న వార్తలు ఇప్పుడు కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాక దేశవ్యాప్త రాజకీయ వర్గాల్లో పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి.

తమిళనాడులో కరుణానిధి, జయలలిత కాలం నుంచి డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రాజకీయ వైరం ఉంది. అధికారం ఈ రెండు పార్టీల మధ్యే మారుతూ వస్తోంది. అయితే మారుతున్న కాలం, మారుతున్న రాజకీయ సమీకరణాలు ఇప్పుడు ఈ ఇద్దరు ప్రత్యర్థులను ఒక్కటి చేసే దిశగా అడుగులు వేయిస్తున్నాయి.

ఎన్డీటీవీ కథనం సృష్టించిన సంచలనం

డీఎంకే వర్గాలు ఇటీవల నేషనల్ మీడియాతో పంచుకున్న కొన్ని అంశాలు ఈ చర్చలకు ఆజ్యం పోశాయి. ఒకవేళ అన్నాడీఎంకే గనుక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నుంచి శాశ్వతంగా బయటకు వస్తే వారితో కలిసి పనిచేయడానికి తమకు అభ్యంతరం లేదని డీఎంకే సంకేతాలిచ్చింది. అయితే దీనికి కొన్ని కఠినమైన షరతులను కూడా ముందుంచినట్లు సమాచారం. డీఎంకే ప్రస్తుత మిత్రపక్షాలైన వీసీకే , కమ్యూనిస్టు పార్టీలకు మంత్రి పదవులు ఇచ్చి గౌరవించాలి. తాము ప్రభుత్వంలో నేరుగా చేరకుండా కేవలం బయటి నుంచి మద్దతు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు డీఎంకే వర్గాలు పేర్కొన్నాయి.

టీవీకే ఎదుగుదల..అసలైన భయం?

తమిళ సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి రాష్ట్రంలో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. భారీ బహిరంగ సభలతో విజయ్ తన రాజకీయ శక్తిని చాటారు. ఒకవేళ ఈ కొత్త శక్తి బలపడితే సాంప్రదాయ ద్రావిడ పార్టీల ఓటు బ్యాంకుకు గండి పడుతుందని అటు స్టాలిన్, ఇటు పళనిస్వామి ఇద్దరూ ఆందోళన చెందుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ 'మూడో శక్తి'ని అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఈ రెండు పార్టీలు ఏకం కావాలని చూస్తున్నాయి.

బీజేపీ వ్యూహాలకు చెక్ పెట్టే ప్రయత్నం

తమిళనాడులో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ, అన్నాడీఎంకేతో పొత్తు ద్వారా క్రమంగా తన బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. అయితే రాష్ట్రంలో బీజేపీ ప్రభావం పెరగడం వల్ల అన్నాడీఎంకే తన సొంత ఉనికిని కోల్పోతుందనే భయం ఆ పార్టీ నేతల్లో ఉంది. అందుకే బీజేపీని కాదని, ద్రావిడ భావజాలం ఉన్న డీఎంకేతో ఏదో ఒక రూపంలో అవగాహనకు రావడం మేలని అన్నాడీఎంకే నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

రాజకీయ విశ్లేషకుల ప్రకారం ఈ పొత్తు జరిగితే అది తమిళనాడు చరిత్రలోనే అతిపెద్ద మలుపు అవుతుంది. అయితే ఇందులో కొన్ని చిక్కులు కూడా ఉన్నాయి.. దశాబ్దాలుగా ఒకరిపై ఒకరు పోరాడిన కేడర్ ఈ పొత్తును ఎలా రిసీవ్ చేసుకుంటుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. లెఫ్ట్ పార్టీలు , వీసీకే వంటి శక్తులు ఈ కొత్త సమీకరణాల్లో తమ స్థానం ఎక్కడో అని డైలమాలో ఉన్నాయి. "తమిళనాడు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఒకప్పుడు జయలలిత, కరుణానిధి మధ్య ఉన్న వ్యక్తిగత వైరం ఇప్పుడు లేదు. కాబట్టి రాజకీయ మనుగడ కోసం డీఎంకే-అన్నాడీఎంకే కలవడం అసాధ్యమేమీ కాదు." అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతానికి ఇవన్నీ ప్రాథమిక చర్చల దశలోనే ఉన్నప్పటికీ, ఈ వార్తలు తమిళనాడు ఓటర్లలో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఇది కేవలం ఎన్నికల వ్యూహమా లేక నిజంగానే ద్రావిడ పార్టీలు ఏకమవుతాయా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఒకవేళ ఈ పొత్తు నిజమైతే, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు రాజకీయం సరికొత్త రంగును పులుముకోవడం ఖాయం.