అటు డీకే...ఇటు విజయ్ -మధ్యలో జగన్ ?
ఏమిటిది సినిమా టైటిల్ గా ఉందని అనుకోమాకండి. రాజకీయాల్లో ట్విస్టులు అలాగే ఉంటాయి మరి.
By: Satya P | 24 Jun 2026 9:25 AM ISTఏమిటిది సినిమా టైటిల్ గా ఉందని అనుకోమాకండి. రాజకీయాల్లో ట్విస్టులు అలాగే ఉంటాయి మరి. తెర ముందు కొన్ని జరిగితే తెర వెనక జరగాల్సినవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇదిలా ఉంటే దక్షిణాదిన తమ రాజకీయ ఆధిపత్యాన్ని పూర్తి స్థాయిలో చూపించాలని కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి ఆరాటపడుతోంది. ఉత్తరాదిలో బీజేపీ హవా తగ్గుతూండడంతో దక్షిణాదిని పూర్తిగా తమ సొంతం చేసుకుని ఉత్తరాది మీద కూడా పట్టు సాధించాలని ఇండియా బ్లాక్ అయితే వ్యూహ రచన చేస్తోంది. ఈ క్రమంలో ఏపీ వైపు ఫుల్ ఫోకస్ పెడుతున్నారు అని అంటున్నారు.
జగన్ తో అనివార్యం :
ఏపీలో చూస్తే రాజకీయం పూర్తి స్పష్టతగా ఉంది. బీజేపీతో జనసేన టీడీపీ కలసి ప్రయాణం చేస్తున్నాయి. 2029 ఎన్నికల్లోనూ మూడు పార్టీలు ఎన్డీయే కూటమిగానే వస్తాయని అంటున్నారు. ఈ విషయంలో బీజేపీ కూడా జాగ్రత్తగానే ఉంటుంది. టీడీపీ అలాగే జనసేన 2019 నాటి అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కూటమిని బలోపేతం చేసే విధంగానే వ్యవహరిస్తున్నాయి. దీంతో ఏపీలో ఇండియా కూటమి పాగా వేయాలి అంటే జగన్ తో చెలిమి అనివార్యంగా కనిపిస్తోంది అన్న విశ్లేషణలు ఉన్నాయి. కాంగ్రెస్ ఏ మాత్రం పుంజుకోకపోవడం వామపక్షాలు నామమాత్రం కావడంతో వైసీపీనే తిప్పుకోవాలని ఇండియా బ్లాక్ నేతలు చూస్తున్నారు అని ప్రచారం సాగుతోంది.
వారి మధ్య సాన్నిహిత్యం :
ఇదిలా ఉంటే సడెన్ గా దక్షిణాదిన పరిణామాలు రాజకీయంగా వేగంగా మారిపోతున్నాయి. కర్ణాటకకు ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా వచ్చారు. ఆయనకు ఏకంగా వైఎస్సార్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అంతే కాదు జగన్ తోనూ మంచి పరిచయాలు ఉన్నాయని చెబుతున్నారు. జగన్ ప్రస్తుతం ఉంటోంది కూడా బెంగళూరులోనే అన్నది కూడా గుర్తుంచుకోవాలని చెబుతున్నారు. ఇక తమిళనాడుకు కొత్తగా ముఖ్యమంత్రి అయిన విజయ్ తోనూ జగన్ గుడ్ రిలేషన్స్ మెయిన్ టెయిన్ చేస్తున్నారు. తాజాగా జూన్ 22న విజయ్ బర్త్ డే వస్తే జగన్ గ్రీట్ చేస్తూ ఎక్స్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. అంతకు ముందు కూడా చెన్నైలో ఒక వివాహ వేడుకలో ఇద్దరూ కలుసుకుని ముచ్చటించుకున్నారు. అంతే కాదు విజయ్ గెలిచాక జగన్ ఆయనకు అభినందనలు తెలిపారు. విజయ్ వైపు నుంచి కూడా అదే విధమైన రెస్పాన్స్ వస్తోంది అని అంటున్నారు.
ఏమైనా జరగవచ్చు అంటూ :
దీంతో ఏపీలో రాజకీయ పరిణామాలు ఏమైనా జరగవచ్చు అని అంటున్నారు. 2029 ఎన్నికల నాటికి ఇండియా కూటమిలోకి జగన్ ని తీసుకుని వచ్చేలా అటు డీకే శివకుమార్ ఇటు విజయ్ కూడా తమదైన శైలిలో తీవ్ర ప్రయత్నం చేస్తారు అని అంటున్నారు. జగన్ కి వీరు సన్నిహితులు కావడంతో ఆ వైపు నుంచి కూడా పాజిటివ్ గా రెస్పాన్స్ ఉండొచ్చు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇపుడే తొందరపడకుండా తగిన సమయంలోనే ఏపీ వ్యూహానికి ఒక లాజికల్ ఎండ్ తీసుకుని రావాలని అనుకుంటున్నారు అని చెబుతున్నారు. ఇక 2029 ఎన్నికల నాటికి ఎన్డీయే కూటమి గ్రాఫ్ బాగా తగ్గుతుందని ఇండియా బ్లాక్ నేతలు అంచనా వేస్తున్నారు. సౌత్ పార్ట్ అంతా తమ ప్యాకెట్ లో వేసుకుంటే నార్త్ లో కూడా సగానికి సగం అయినా సీట్లు గుంజుకుంటే కేంద్రంలో ఈజీగా ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు అన్నది ఇండియా బ్లాక్ పక్కా ప్లాన్ గా ఉంది. దానికి ఏపీ ఇపుడు అతి పెద్ద కీలకమైన పరిణామం కాబోతోంది అని అంటున్నారు.
