Begin typing your search above and press return to search.

బెంగళూరు నగర జనాభా పెరగడానికి ఎమ్మెల్యేల రెండు పెళ్లిళ్లే కారణమా? సీఎం డీకే పేల్చిన బాంబ్ ఇదీ..

బెంగళూరు నగరాన్ని కెంపేగౌడ నిర్మించారని, విధానసౌధను కేంగల్ హనుమంతయ్య నిర్మిస్తే.. ఎస్.ఎమ్. కృష్ణ నగరానికి ఐటీ రంగులద్ది అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారని డీకే డీసెంట్‌గానే ప్రసంగం ప్రారంభించారు.

By:  A.N.Kumar   |   26 Sept 2026 9:57 AM IST
బెంగళూరు నగర జనాభా పెరగడానికి ఎమ్మెల్యేల రెండు పెళ్లిళ్లే కారణమా? సీఎం డీకే పేల్చిన బాంబ్ ఇదీ..
X

కర్ణాటక అసెంబ్లీ అంటేనే రాజకీయ వ్యూహాలకు.. వేడివేడి విమర్శలకు పురిటిల్లు. అయితే ఆ రోజు చర్చించాల్సిన అంశం నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న విపరీతమైన జనాభా, నడుం విరిచే ట్రాఫిక్ కష్టాలు, కంఠ శోష తెప్పించే నీటి కొరత. రాజధాని బెంగళూరులో మౌలిక సదుపాయాలు చాలడం లేదని.. వలసల ఒత్తిడి పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేయాల్సిన వేదిక అది. కానీ కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ఒక్క మాట విసిరారో లేదో.. సభలోని సీరియస్ చర్చ కాస్తా ఒక్కసారిగా 'కామెడీ విత్ కాంట్రవర్సీ'గా మారిపోయింది.

బెంగళూరు నగరాన్ని కెంపేగౌడ నిర్మించారని, విధానసౌధను కేంగల్ హనుమంతయ్య నిర్మిస్తే.. ఎస్.ఎమ్. కృష్ణ నగరానికి ఐటీ రంగులద్ది అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారని డీకే డీసెంట్‌గానే ప్రసంగం ప్రారంభించారు. అయితే ఊరి నుంచి బెంగళూరుకు వచ్చేవారు మళ్లీ వెనక్కి వెళ్లడం లేదని చెప్తూ.. "అక్కడిదాకా ఎందుకు? మన ఎమ్మెల్యేలే ఇక్కడ స్థిరపడిపోతున్నారు" అని బాంబు పేల్చారు. అంతటితో ఆగితే అది రాజకీయ వ్యంగ్యం అనుకోవచ్చు. కానీ ఆయన వెంటనే "సభలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలకు రెండేసి పెళ్లిళ్లు ఉన్నాయి. దాదాపు డజను మంది అలా రెండు ఇళ్లను నడుపుతున్నారు. కావాలంటే ఆ జాబితా కూడా నా దగ్గరుంది.. ఇచ్చేయమంటారా?" అని నవ్వుతూనే పెద్ద బాంబే పేల్చేశారు. ధార్వాడ్, దక్షిణ కన్నడ జిల్లాల ప్రజాప్రతినిధుల సీక్రెట్లను కూడా చిటికెలో బయటపెట్టేశారు..

ఈ వ్యాఖ్యలతో అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలందరి గుండెల్లో ఒక్కసారిగా రైళ్లు పరిగెత్తాయి. "ఎవరి పేర్లు బయటపడతాయో ఏ డజను మంది పేర్లు ఆ లిస్టులో ఉన్నాయో" అని ఇంట్లో ఉన్న భార్యలు ఎక్కడ టీవీలు చూసి సీరియస్ అవుతారో అని చాలామంది ప్రజాప్రతినిధులు బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. అసలు చర్చ వదిలేసి.. బీజేపీ వెంటనే మైక్ అందుకుంది. "అంత ధైర్యం ఉంటే ఆ డజను మంది 'డబుల్ ధమాకా' నాయకుల పేర్లు బయటపెట్టు డీకే" అని ప్రతిపక్ష నేత ఆర్. అశోక్ సవాల్ విసిరారు. సీనియర్ నేత సురేష్ కుమార్ అయితే "ఇలా పేర్లు చెప్పకుండా సస్పెన్స్ పెడితే.. సభలో ఉన్న అందరినీ అనుమానించాల్సి వస్తుంది. పైగా నగర జనాభా పెరగడానికి ఎమ్మెల్యేల రెండు పెళ్లిళ్లే కారణమన్నట్టు మాట్లాడటం ఏంటి?" అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాపం బెంగళూరు నీటి తిప్పలు, ట్రాఫిక్ కష్టాలు రోడ్డు మీద అల్లాడుతూనే ఉన్నాయి. కానీ శాసనసభలో మాత్రం "ఎవరికి ఇద్దరు భార్యలు ఉన్నారు? ఆ గుట్టు శివకుమార్‌కు ఎలా తెలిసింది? ఆ 12 మంది భాగ్యవంతులు ఎవరు?" అనే ‘పర్సనల్ సైడ్ డిష్’ చర్చతో అసలు సమస్య పక్కదారి పట్టింది. జనాభా నియంత్ణణపై సీరియస్ పాలసీలు రావాల్సిన చోట.. ప్రజాప్రతినిధుల ‘రెండో పెళ్లి’ ముచ్చట్లే కర్ణాటక రాజకీయాల్లో అసలైన హాట్ టాపిక్‌గా మారడం గమనార్హం..