Begin typing your search above and press return to search.

పదిహేనేళ్ళుట...పవన్ మాట డీకే నోట !

రాజకీయాల్లో ఎవరు ఏ మాట మాట్లాడినా దానికి అర్థాలు పరమార్థాలు వేరేగా ఉంటాయి. వాటిని మళ్లీ లోతుగా విశ్లేషించు కోవాల్సిందే.

By:  Satya P   |   7 Nov 2025 10:38 AM IST
పదిహేనేళ్ళుట...పవన్ మాట డీకే నోట !
X

రాజకీయాల్లో ఎవరు ఏ మాట మాట్లాడినా దానికి అర్థాలు పరమార్థాలు వేరేగా ఉంటాయి. వాటిని మళ్లీ లోతుగా విశ్లేషించు కోవాల్సిందే. అయితే కన్నడ రాజకీయ దిగ్గజం, ట్రబుల్ షూటర్ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తాజాగా చేసిన కామెంట్స్ మాత్రం చర్చను రేపేలా ఉన్నాయి. ఆయన కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు గురించి ఒక విధంగా చూస్తే సంచలన వ్యాఖ్యలు చేశారు. అది ఆయన అభిమానులు వర్గీయులు అనుచరులకు అర్ధం అయీ కాకుండా ఉంటే రాజకీయంగా మాత్రం ఎవరికి తోచిన తీరున వారు మాట్లాడుకునేలా ఉంది అని అంటున్నారు.

విప్లవం అంటూ :

కర్ణాటక రాజకీయాల్లో విప్లవం అంటూ వస్తున్న వార్తలను జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఒక్క దెబ్బకు కొట్టి పారేశారు. నవంబర్ లో విప్లవం వచ్చి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధ రామయ్య మాజీ అయి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని వరసబెట్టి వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే దీని మీద డీకే స్పందిస్తూ నవంబర్ లో కాదు డిసెంబర్ లో కూడా విప్లవం రానే రాదు అని కొట్టిపారేశారు ఏ విప్లవం అయినా 2028లో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చినపుడే జరుగుతుందని అన్నారు. అంటే ఈ అయిదేళ్ళూ సిద్ధరామయ్య సీఎం గా ఉంటారని పరోక్షంగా క్లారిటీ ఇచ్చేశారు అని అంటున్నారు.

కట్టుబడి ఉంటాను :

తాను కాంగ్రెస్ పార్టీకి ఒక క్రమశిక్షణ కలిగిన నేతను అని పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాను అని డీకే ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. అంతే కాదు సీఎం సిద్దరామయ్య తో పాటు ఆయనతో కలిసి ఉంటాను అని కూడా చెప్పారు. సీఎం మార్పు మీద ఆయన మాట్లాడుతూ అలాంటిది ఏమీ లేదని అన్నారు ఇక మంత్రివర్గంలో మార్పులు చేర్పులు అన్నీ కూడా పార్టీ ఇష్టం, అది ముఖ్యమంత్రికి ఉన్న హక్కు అధికారం అని డీకే స్పష్టంగా చెప్పుకొచ్చారు.

ఆయన పదిహేనేళ్ళు అంటే :

ఇక సిద్ధరామయ్య అయిదేళ్ళు సీఎం అని చెప్పినా ఓకే. లేదు ఆయనే పదేళ్ళు లేదా పదిహేనేళ్ళు ఉంటారని పార్టీ పెద్దలు చెప్పినా ఓకే అంటూ డీకే మాట్లాడడం విశేషం. పార్టీ హైకమాండ్ నిర్ణయం మేరకే ఏదైనా జరుగుతుందని ఆయన అన్నారు. అందువల్ల పార్టీకి కట్టుబడిన తన లాంటి వారు ఈ విషయంలో పెద్దలు ఏది చెబితే దానికే కట్టుబడి ఉంటామని కూడా డీకే అంటున్నారు.

సిద్ధూకి లైన్ క్లియర్ :

మొత్తం మీద చూస్తే సిద్ధ రామయ్య అయిదేళ్ళ సీఎం అన్నది ఒక క్లారిటీ వచ్చేసింది అని అంటున్నారు. ఆయన 2013 నుంచి 2018 దాకా అయిదేళ్ళు పాలించారు. తిరిగి ఇపుడు కూడా ఫుల్ టెర్మ్ ఉంటారని అంటున్నారు. ఈ మధ్యనే ఐదేళ్ల పదవీకాలాన్ని తానే పూర్తి చేస్తానని సిద్ధరామయ్య చెప్పారు. అయితే తుది నిర్ణయం పార్టీదేనని ఆయన కూడా స్పష్టం చేశారు. మరో వైపు చూస్తే 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత.. సీఎం పదవి కోసం సిద్ధరామయ్యతో డీకే శివకుమార్‌ కూడా గట్టిగానే పోటీ పడ్డారు.ఆ సమయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ చెరో రెండున్నరేళ్లు సీఎంగా కొనసాగే అవకాశం ఉందని అలా హైకమాండ్ ఒక ఒప్పందాన్ని కుదిర్చిందని ప్రచారం సాగింది. ఇపుడు ఆ రెండున్నరేళ్ళు పూర్తి కావడంతో ఈ చర్చ అంతా సాగుతోంది. అయితే సిద్ధరామయ్యనే పదిహేనేళ్ళు సీఎం గా కొనసాగించిన ఓకే అంటూ డీకే చేసిన వ్యాఖ్యలు అయ్హితే ఏపీలో పవన్ పదిహేనేళ్ళ కూటమి అధికారాన్ని గుర్తుకు తెస్తున్నాయని అంటున్నారు. పవన్ మాట డీకే నోట రావడంతో దాని వెనక వ్యూహమేంటి అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు.