డీకే రెండేళ్ళ సీఎం ....జాతకం చూస్తే షాక్ !
ఇక డీకే సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రి అయ్యేందుకు అన్నీ అనుకూలిస్తాయని గురూజీ అంటున్నారు.
By: Satya P | 30 May 2026 11:55 PM ISTకర్ణాటకకి కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివ కుమార్ అవుతున్నారు. ఆయన జూన్ 3న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆరున్నర పదుల వయసు కలిగిన డీకే శివ కుమార్ సీఎం కుర్చీని పట్టడానికి దశాబ్దాల పాటు వేచి చూడాల్సి వచ్చింది. ఆయన పాతికేళ్ళ వయసులో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. యువకుడిగా ఉండగానే మంత్రి కూడా అయ్యారు. ఆ మీదట వివిధ కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. ఉప ముఖ్యమంత్రి దాకా వచ్చారు. కానీ సీఎం కావడానికి మాత్రం సుదీర్ఘ కాలం వేచి ఉండాల్సి వచ్చింది రాజకీయం అంటే ఇదే కదా. మరి ఇన్నేళ్ళకు సీఎం అవుతున్న డీకే పదవీ కాలం అచ్చంగా రెండేళ్ళు మాత్రమే ఉంది. హానీ మూన్ తో సహా మూడేళ్ల కాలం అంతా సిద్ధ రామయ్య పూర్తి చేశారు. ఇపుడు ఎన్నికల ముంగిట డీకే చేతికి పగ్గాలు దక్కాయి. దాంతో ఆయన సీఎం సీటు ఒక ముళ్ళ కిరీటం అని అంటున్నారు. ఈ సీటులో కూర్చున్న దగ్గర నుంచి 2028 మేలో వచ్చే ఎన్నికల గురించిన వ్యూహ రచనతో పాటు పార్టీని మరోసారి గెలిపించేందుకు డీకే పూర్తి సమయం వెచ్చించాల్సి ఉంటుంది.
రెండేళ్ళు ముచ్చటేనా :
రాక రాక సీఎం పదవి వచ్చింది. అది కూడా రెండేళ్ళు. ఇందులో ఎన్నికల ముందు ఆరు నెలలు తీసేస్తే అచ్చంగా అధికారానికి చేతిలో ఉన్నది 18 నెలలు మాత్రమే. అంటే సీఎం సీటు పట్టాను అన్న ఆనందం ఆవిరి కాక ముందే డీఎకే ఎన్నికల సమరంలోకి దిగిపోవాలి. చావో రేవో అన్నట్లుగా పోరాటం చేయాలి. ఇవన్నీ ఆయన ముందున్న బిగ్ చాలెంజెస్. మరి డీకే 2023 లో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకుని రావడం కోసం ఎంతగానో కష్టపడ్డారు. కనీసం రెండున్నరేళ్ళ పాటు అయినా సీఎం పదవి లభించలేదు అన్న ఆవేదన అయితే ఆయనను అభిమానించే క్యాడర్ లో ఉంది.
జాతకం ఏమంటోంది :
అయితే డీకే జాతకం ప్రకారం సీఎం సీటు లేటు అయినా ఆయన ఆ సీట్లో మాత్రం దీర్ఘ కాలం పాటు కుదురుకుంటారు అనే అంటున్నారు. డీకే చేతికి పగ్గాలు రావాలి కానీ అంత సులువుగా ఆయన నుంచి ముఖ్యమంత్రి సీటు పోదని కూడా జాతకం చెబుతోంది అని అంటున్నారు. ఇక డీకే జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ద్వారకానాధ్ గురూజీ అయితే ఆయన జాతకంలో రాజయోగం పరుగులు తీస్తోంది అని చెప్పారు. ఒక్కసారి సీఎం కాదు మరిన్ని సార్లు ముఖ్యమంత్రి అయ్యే యోగ బలం డీకే జాతకంలో ఉందని ఆయన తేల్చారు అని అంటున్నారు. డీకే నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2028 ఎన్నికలను ఎదుర్కొని మరోసారి గెలిచి తీరుతుందని గురూజీ జోస్యం చెబుతున్నారు. ఆ విధంగా డీకే మరో అయిదేళ్ళు ఫుల్ టెర్మ్ సీఎం గా ఉంటారని కూడా ధీమాగా చెబుతున్నారు.
అన్నీ అనుకూలంగా :
ఇక డీకే సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రి అయ్యేందుకు అన్నీ అనుకూలిస్తాయని గురూజీ అంటున్నారు. ఆయనకు కాంగ్రెస్ అగ్ర నాయకత్వం కూడా ఎంతగానో సహకరించి పూర్తి మద్దతు ఇస్తుందని కూడా చెబుతున్నారు. డీకే అన్ని విధాలుగా తన సమర్ధతను చాటుకుంటారు అని అంటున్నారు. దీంతో డీకే అనుచరుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. జాతకాన్ని కాసేపు పక్కన పెట్టి ఆలోచించినా డీకే వ్యూహాలు చాణక్యుడిని మించి ఉంటాయి. అలాంటి ఆయన చేతిలో అధికారం కూడా ఉండి అన్నీ తోడు అయితే కాంగ్రెస్ ని ఆయన గెలిపించడం పెద్ద కష్టం కాదని అంటున్నారు. దాంతో జాతకం ప్రకారం చూసినా డీకే చాణక్యాన్ని చూసినా ఆయన లాంగ్ టెర్మ్ సీఎం గా కర్ణాటక రాజకీయాల్లో చరిత్ర సృష్టిస్తారు అని అంటున్నారు. చూడాలి మరి గురూజీ జాతక బలం ఏ విశేషాలను అందిస్తుందో.
