Begin typing your search above and press return to search.

డీకేను నడిపించేది ఆ ఇద్దరే.. కర్ణాటక కాబోయే సీఎం స్టోరీ - వెరీ ఇంట్రెస్టింగ్

రాజకీయ దురందరుడిగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నేత డీకే శివకుమార్ కి అపారమైన దైవభక్తి, జ్యోతిష్యంపై బలమైన నమ్మకం కూడా ఉన్నాయని అంటున్నారు.

By:  Tupaki Political Desk   |   29 May 2026 2:00 PM IST
డీకేను నడిపించేది ఆ ఇద్దరే.. కర్ణాటక కాబోయే సీఎం స్టోరీ - వెరీ ఇంట్రెస్టింగ్
X

కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాల్లో ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌ ముఖ్యమంత్రి కాబోతున్నారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ ప్రయాణంలో చివరికి తాను కోరుకున్న స్థానాన్ని దక్కించుకుంటున్నారు డీకే శివకుమార్. ముఖ్యమంత్రికి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయడంతో డీకే ఆ పదవిని చేపట్టడం లాంఛనంగానే చెబుతున్నారు. అయితే సిద్ధూ రాజీనామాను గవర్నర్ ఆమోదించిన వెంటనే డీకే ప్రమాణ స్వీకారానికి సిద్ధం కావడం లేదు. ఇందుకోసం ఆయన మరికొద్ది సమయం ఎదురుచూడాలని అనుకుంటున్నారు. అందుకు కారణం కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, తను ఆరాధించే ఇద్దరు ఆధ్యాత్మిక గురువులు ముహూర్తం ఫిక్స్ చేయకపోవడమే అంటున్నారు.

రాజకీయ దురందరుడిగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నేత డీకే శివకుమార్ కి అపారమైన దైవభక్తి, జ్యోతిష్యంపై బలమైన నమ్మకం కూడా ఉన్నాయని అంటున్నారు. రాజకీయంగా ఆయన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇద్దరు వ్యక్తులను ముందుగా సంప్రదిస్తారని చెబుతున్నారు. ఆ ఇద్దరిలో కాడుసిద్దేశ్వరమఠం కరిబసవేశ్వరస్వామిజీ (అజ్జయ్య) ఒకరైతే, రెండో వారు రాజగురు ద్వారకనాథ్ గురూజీ. ఈ ఇద్దరి మాట లేకుండా డీకే ఏ పనిచేయరని కర్ణాటక కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించే తరుణంలో డీకే ఆధ్యాత్మిక గురువుల పాత్రపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ముహూర్తం కుదిరితేనే ముందుకు..

డీకే శివకుమార్ ఆధ్యాత్మిక విశ్వాసాలు చాలా గట్టివి. ముహూర్తం చూసుకోకుండా ఆయన ఏ శుభకార్యానికి, రాజకీయ నిర్ణయానికి పూనుకోరని చెబుతున్నారు. ప్రస్తుతం కర్ణాటక ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణస్వీకారం ఎప్పుడు చేస్తారనే సస్పెన్స్‌కు కూడా ఈ ముహూర్త బలమే కారణమని చెబుతున్నారు. 30వ తేదీ శనివారం కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ముందుగా చెప్పినా, తగిన ముహూర్తం కోసం డీకే ఎదురుచూడటం వల్ల ఇంకా సస్పెన్స్ కొనసాగుతుందనే అంటున్నారు. అజ్జయ్య, ద్వారకానాథ్ గురూజీ ఎప్పుడు చెబితే అప్పుడు డీకే ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని అంటున్నారు.

తుమకూరు జిల్లాలోని కాడుసిద్దేశ్వరమఠం అధిపతి కరిబసవేశ్వరస్వామిజీ (అజ్జయ్య) అంటే డీకే శివకుమార్‌కు అమితమైన భక్తి. అజ్జయ్య ఆశీస్సులు లేకుండా ఆయన ఒక్క అడుగు కూడా ముందుకు వేయరని అంటున్నారు. గత రెండు రోజులుగా డీకే శివకుమార్ మీడియా ముందుకు రాకపోవడానికి, ఎక్కడా నోరు జారకుండా జాగ్రత్త పడడానికి అజ్జయ్య ఇచ్చిన సూచనలే కారణమని టాక్ వినిపిస్తోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేవరకు వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని అజ్జయ్య ఆదేశించడంతోనే డీకే వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయించారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

ఇక ప్రముఖ జ్యోతిష్యులు రాజగురు ద్వారకనాథ్ గురూజీ సూచనలు తూ.చ. తప్పకుండా పాటించే డీకే శివకుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆయన అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు చెబుతున్నారు. గత 35 ఏళ్లుగా డీకే శివకుమార్‌తో ద్వారకనాథ్‌కు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. డీకే జాతకాన్ని, గ్రహస్థితులను ఆయనే నిశితంగా పరిశీలిస్తుంటారని, ఆయన ముహూర్తం పెట్టిన తర్వాతే ముఖ్యమంత్రిగా డీకే ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

కనీసం ఎనిమిదేళ్లు సీఎం?

ప్రస్తుతం డీకే శివకుమార్ గ్రహస్థితులను బట్టి సోమవారం తర్వాతే ప్రమాణస్వీకారం చేయాలని ద్వారకనాథ్ గురూజీ గట్టిగా సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ సమయం దాటిన తర్వాత బాధ్యతలు చేపడితే, డీకే శివకుమార్ కనీసం ఎనిమిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా తిరుగులేని శక్తిగా కొనసాగుతారని గురూజీ లెక్కలు వేసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నారు. ప్రస్తుతం డీకేకు గురుబలం అద్భుతంగా పెరిగిందని. ఇకపై ఆయనను ఎవరూ ఆపలేరని ద్వారకనాథ గురూజీ కూడా మీడియాతో చెప్పడం విశేషం.