రూ.50కే హెయిర్ కట్ ఓకే... రోలెక్స్ వాచ్ సంగతేంటి డీకే ?
కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ కి ట్రబుల్ షూటర్ అని పేరుంది. అదే సమయంలో ఆయన దేశంలోనే అత్యంత సంపన్నుడు అయిన ముఖ్యమంత్రిగా నిలిచారు.
By: Satya P | 27 Aug 2026 6:13 AM ISTకర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ కి ట్రబుల్ షూటర్ అని పేరుంది. అదే సమయంలో ఆయన దేశంలోనే అత్యంత సంపన్నుడు అయిన ముఖ్యమంత్రిగా నిలిచారు. ఆయన ఆస్తుల విలువ చూస్తే మతి పోతుంది. ఏకంగా 1400 కోట్ల రూపాయలు ఆయనకు స్థిర చర ఆస్తుల రూపంలో ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినపుడు ఈ వివరాలు అన్నీ మీడియా కవర్ చేయడంతో దేశమంతా డీకే శివకుమార్ వైపు ఆసక్తిగా చూడడమే కాదు సీరియస్ గానే ఫోకస్ పెట్టింది. అయితే తమ కుటుంబ వ్యాపారాలు వ్యవహారాలతో ఈ ఆస్తులు డీకే సంపాదించుకున్నారు అని ఆయన వర్గీయులు చెప్పుకొచ్చారు.
సాధారణ జీవితం అంటూ :
అయితే వందల వేల కోట్ల ధనికుడు పైగా ముఖ్యమంత్రి అయిన డీకే జీవిత శైలి ఎలా ఉంటుంది అన్న చర్చ కూడా ఉంటుంది. దానికి తాజాగా డీకే శివ కుమార్ చెప్పిన జవాబు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. తాను సింపుల్ లైఫ్ స్టైల్ కి ప్రాధాన్యత ఇస్తాను అని ఆయన ఇండియా టుడే సమ్మిట్‌లో చెప్పారు. అంతే కాదు తాను కేవలం యాభై రూపాయలకే హెయిర్ కట్ చేయించుకునేందుకు ఇష్టపడతాను అని ఆయన చెప్పడం విశేషం. తనది వెరీ సింపుల్ లివింగ్ అని సాధారణ జీవితం గడిపేందుకే తాను ఆసక్తిని చూపిస్తాను అని ఆయన వెల్లడించారు. అయితే డీకే చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా కొత్త చర్చకు రచ్చకు కారణం అవడం గమనార్హం.
డీకే మార్క్ సింపుల్ లైఫ్ :
కర్ణాటకలో బలమైన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ అయితే డీకే వ్యాఖ్యలను సీరియస్ గానే తీసుకుంది. ఆయన సాధారణ జీవితం మీద సెటైర్లు వేసింది. డీకే మార్క్ సాధారణ జీవితం అంటే ఇదే కాబోలు అని బీజేపీ వ్యంగ్యస్త్రాలు సంధించింది. యాభై రూపాయలకే హెయిర్ కట్ అంటే సాధారణ జీవితం బాగానే ఉంది కానీ డీకే వినియోగించే రోలెక్స్ వాచీలు, లూయీ విటన్ ఎల్వీ స్కార్ఫ్, కార్టియర్ వాచ్ కూడా సింపుల్ లైఫ్ నా అంటూ బీజేపీ సెటైరికల్ గా కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. డీకే ఖరీదైన బ్రాండెడ్ వస్తువులు వాడుతున్నారని కర్ణాటక బీజేపీ ఎద్దేవా చేసింది. ఇది కేవలం కపట నాటకం అంటూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించింది. డీకే అత్యంత సంపన్నుడే కాదు ఆయన జీవిత విధానం కూడా సంపన్నమే అన్నది బీజేపీ వాదనగా ఉంది.
మాటల యుద్ధం :
ముఖ్యమంత్రి డీకే మీద బీజేపీ ఈ తీరున సెటైర్లు పేల్చడంతో కాంగ్రెస్ నుంచి కూడా రివర్స్ ఎటాక్ వస్తోంది. డీకే తన వ్యక్తిగత జీవితం గురించి సాదా సీదాగా గడుపుతాను అని చెప్పారని దీనికి ప్రతిపక్షానికి బాధ ఎందుకు అంటోంది. అయితే చెప్పేవి చేయాలి కదా అన్నది బీజేపీ వాదనగా ఉంది. ఏది ఏమైనా రాజకీయ నాయకులు ఈ రోజులలో ఎవరు సింపుల్ గా జీవిస్తున్నారు అన్నది నెటిజన్ల మాట. పైగా దాదాపుగా ఎక్కువ మంది ధనవంతులే అని కూడా గుర్తు చేస్తున్నారు. ప్రజలకు మేలు చేస్తే చెప్పుకుంటారు కానీ తాము సగటు జనంలో ఒకరిమని ప్రకటించినా నాయకులను ఎవరూ సొంతం చేసుకోరన్నది నెటిజన్ల మాటగా ఉంది.
