Begin typing your search above and press return to search.

తెలంగాణ నుంచి ఒకరికి మంత్రి యోగం! రేసులో ముగ్గురు ఎంపీలు?

రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎంపీలు ఉండగా, ఇప్పటికే ఇద్దరు మంత్రులుగా వ్యవహరిస్తున్నారు. పునర్వ్యస్థీకరణలో మరొకరికి చాన్స్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారని అంటున్నారు.

By:  Tupaki Political Desk   |   20 Aug 2026 6:00 PM IST
తెలంగాణ నుంచి ఒకరికి మంత్రి యోగం! రేసులో ముగ్గురు ఎంపీలు?
X

కేంద్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ జరుగుతుందన్న ప్రచారం నేపథ్యంలో తెలంగాణ నుంచి ఒకరికి అవకాశం వస్తుందన్న సమాచారంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇటీవల చేపట్టిన బీజేపీ కేంద్ర కమిటీ విస్తరణలో తెలంగాణ నుంచి ఎవరికీ అవకాశం ఇవ్వకపోవడం, అదే సమయంలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు ప్రముఖ నేతలను జాతీయ కార్యకర్గం నుంచి తప్పించడంతో ఈ ప్రచారానికి ఊతమిస్తుందని చెబుతున్నారు. రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎంపీలు ఉండగా, ఇప్పటికే ఇద్దరు మంత్రులుగా వ్యవహరిస్తున్నారు. పునర్వ్యస్థీకరణలో మరొకరికి చాన్స్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారని అంటున్నారు.

మరో రెండేళ్లలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హాట్ ఫేవరెట్ గా పోటీ ఇవ్వాలంటే రాష్ట్రంలో బీజేపీ నేతలు మరింత క్రియాశీలంగా పనిచేయాలని కేంద్ర పెద్దలు భావిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రతిపక్షాన్ని వెనక్కి నెట్టి ఆ స్థానంలో పోటీ ఇవ్వడమే కాకుండా, అధికారంలోకి రావాలంటే పార్టీని ఇంకా విస్తరించాలని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నారని చెబుతున్నారు. తమ లక్ష్యానికి చేరువ కావాలంటే పార్టీని పరిగెత్తించాలని, ఇందుకోసం నేతలకు కొత్త పదవులతో ప్రోత్సహించాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

దీంతో త్వరలో జరగబోయే కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో తెలంగాణ నుంచి కచ్చితంగా ఒకరికి అవకాశం వస్తుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉండగా, ఇప్పటికే ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. ఇంకా మిగిలిన ఆరుగురిలో ఒకరికి చాన్స్ ఇస్తారా? లేక బయట రాష్ట్రాల నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రానికే చెందిన ఎంపీలకు అవకాశం ఇస్తారా? అనేది హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం రాష్ట్రానికి చెందిన ఇద్దరు బీజేపీ నేతలు బయట రాష్ట్రాల నుంచి రాజ్యసభ సభ్యులుగా పనిచేస్తున్నారు. వీరిలో సంఘ్ నేపథ్యం ఉన్న ఓబీసీ మోర్చా మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్, బీసీ ఉద్యమ నాయకుడు ఆర్.కృష్ణయ్య ఉన్నారు. లక్ష్మణ్ ఉత్తరప్రదేశ్ నుంచి కృష్ణయ్య ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న విషయం తెలిసిందే.

ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి చెందిన 8 మందిలో ఎవరికి మంత్రి పదవి లభిస్తుందనేది విస్తృత చర్చగా ఉందని చెబుతున్నారు. ప్రధానంగా అనేక సమీకరణాలను పరిశీలిస్తున్న బీజేపీ అధిష్టానం బీసీ, మహిళ కోటాలో ఒకరికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఇప్పటికే బీసీ కోటాలో కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ మంత్రిగా ఉండటంతో రాష్ట్రానికి చెందిన మహిళా నాయకురాలు డీకే అరుణ మంత్రి పదవి రేసులో ముందున్నట్లు ప్రచారం జరుగుతోంది. డీకే అరుణను మంత్రి వర్గంలోకి తీసుకోవాలనే ఆలోచనతోనే ఆమెను బీజేపీ జాతీయ ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించారని చెబుతున్నారు.

ప్రస్తుత సమీకరణాలను పరిశీలిస్తే కేంద్ర మంత్రివర్గంలో డీకే అరుణకు చోటిచ్చే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు. డీకే అరుణ సీనియార్టీ, సామాజిక నేపథ్యంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దీటుగా ఎదుర్కొనే సామర్థ్యం ఆమెకు అడ్వాంటేజ్ గా చెబుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ప్రాంతానికి చెందిన అరుణ అన్నిరకాలుగా సీఎం స్పీడుకు బ్రేకులు వేయగలరని చెబుతున్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దన్నుగా ఉంటున్న అగ్రవర్ణాలలోనూ చీలక తేవడానికి అరుణ నాయకత్వం ఉపయోగపడుతుందనే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. అయితే ఆమెకు దీటుగా బీసీ నేత లక్ష్మణ్ పేరు కూడా ఎక్కువగా వినిపిస్తోందని అంటున్నారు. తొలి నుంచి బీజేపీలో కొనసాగుతున్న లక్ష్మణ్ కు సంఘ్ నేపథ్యం అదనపు బలంగా చెబుతున్నారు. దీంతో రాష్ట్రం నుంచి డీకే అరుణ, లక్ష్మణ్ మధ్య మంత్రి పదవికి గట్టి పోటీ జరుగుతుందని అంచనా వేస్తున్నారు.