Begin typing your search above and press return to search.

బీజేపీలో హాట్ టాపిక్ : ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు ?

అయితే అంతలోనే తేరుకుని ఉందిలే మంచి కాలం అని బీజేపీ నేతలు తమకు తాముగా చెప్పుకుంటున్నారు. పెద్ద పదవులు ఇచ్చేందుకే ఇలా చేశారు అని సర్ది చెప్పుకుంటున్నారు.

By:  Satya P   |   24 Aug 2026 9:23 AM IST
బీజేపీలో హాట్ టాపిక్ : ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు ?
X

తెలంగాణా బీజేపీకి జాతీయ కార్యవర్గం పదవుల విషయంలో అన్యాయం జరిగింది అన్న భావన ఉంది. గతంలో పదవులు నిర్వహించిన వారికి కూడా ఈసారి అవకాశం దక్కలేదు సరికదా కొత్త వారిని ఎవరినీ తీసుకోలేదు. దీంతో తెలంగాణా బీజేపీ నేతలు లేకుండా బీజేపీ జాతీయ కార్యవర్గం కూర్పు జరిగిపోయింది. అదే సమయంలో ఏపీకి మంచి ప్రాధాన్యత ఇచ్చారు. ఏపీ కంటే తెలంగాణాలోనే బీజేపీకి బలం ఉంది. ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న తెలంగాణాలో బలమైన నాయకులు ఎంతో మంది ఉన్నారు. 2028 ఎన్నికల్లో తెలంగాణాలో అధికారంలోకి రావాలని గట్టిగా తలపోస్తున్న కమల నాధులు ఇలా ఎందుకు చేశారు అని తెలంగాణా బీజేపీ నేతలు అంతా తీవ్రంగా చర్చిస్తున్నారు. బీజేపీలో అంతర్మధనం పెద్ద ఎత్తున సాగుతోంది.

బహుశా అదే కావచ్చు :

అయితే అంతలోనే తేరుకుని ఉందిలే మంచి కాలం అని బీజేపీ నేతలు తమకు తాముగా చెప్పుకుంటున్నారు. పెద్ద పదవులు ఇచ్చేందుకే ఇలా చేశారు అని సర్ది చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఆ పెద్ద పదవులు ఏమిటి అంటే కేంద్ర మంత్రి వర్గ విస్తరణ తొందరలో జరగబోతోంది కాబట్టి అందులో కచ్చితంగా మరో రెండు బెర్తులు తెలంగాణాకు దక్కుతాయని భారీ ఆశలను బీజేపీ నేతలు పెంచుకుంటున్నారు. పార్టీ పదవులు దక్కపోవడం వెనక ఇదే కారణం అయి ఉంటుందని అంచనాకు వస్తున్నారు. అదే జరిగితే తమకు దశ తిరిగినట్లే అని కూడా వారు ఊహించుకుంటున్నారని ప్రచారం సాగుతోంది.

కచ్చితంగా ఇస్తారంటూ :

బీజేపీకి దక్షిణాన కర్ణాటక తరువాత తెలంగాణాలోనే ఆశలు ఎక్కువగా ఉన్నాయని కూడా అంటున్నారు. దక్షిణాదికి గేట్ వేగా తెలంగాణాను బీజేపీ పెద్దలు పదే పదే చెబుతూ వచ్చారని అంటున్నారు. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయని 2028లో అసెంబ్లీ ఎన్నికలు 2029లో లోక్ సభ ఎన్నికలు ఉన్నాయని కూడా అంటున్నారు. దాంతో బీజేపీ బలపడాలి అంటే మరింత మందికి కేంద్ర మంత్రి పదవులు లభిస్తాయని కూడా లెక్క వేసుకుంటున్నారు.

ఆమెకు ఖాయమేనా :

ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి పదవుల రేసులో మహబూబ్ నగర్ ఎంపీ మాజీ రాష్ట్ర మంత్రి డీకే అరుణ ముందు వరుసలో ఉన్నారని అంటున్నారు. ఆమెకు తాజాగా ప్రకటించిన జాతీయ కార్యవర్గంలో జాతీయ ఉపాధ్యక్ష పదవిని తీసేశారు. దాంతో ఆమెకు కేంద్ర మంత్రి పదవి ఇస్తారనడానికి ఇది సంకేతంగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కావడంతో పాటు అదే సామాజిక వర్గానికి అదే జిల్లాకు చెందిన అరుణకు కేంద్ర మంత్రి పదవి ఇస్తే కనుక తప్పనిసరిగా బీజేపీ అక్కడ పుంజుకుంటుందని కేంద్ర పెద్దలు భావిస్తున్నారు అని విశ్లేషిస్తున్నారు. దాంతో ఎపుడు విస్తరణ జరిగినా అరుణకు పదవి ఖాయమని అంటున్నారు.

ఈ ఇద్దరిలో ఒకరికి :

అంతే కాదు బీఆర్ఎస్ లో పునాది నుంచి ఉన్న మాజీ రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఒకసారి నెగ్గారు. బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్ కి కేంద్ర మంత్రి పదవి ఇస్తే బీసీ వర్గాలు చేరువ అవుతాయని కేంద్ర పెద్దలు చూస్తున్నారు అని అంటున్నారు. అంతే కాదు బీఆర్ఎస్ నుంచి మరింత మందిని ఈ వైపుగా ఆకర్షించేందుకు వీలు అవుతుందని కూడా అంచనా కడుతున్నారు. ఒక వేళ ఏ కారణం చేతనైనా ఆయనకు పదవి ఇవ్వకపోతే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కి కేంద్ర మంత్రి పదవి దక్కడం ఖాయమని అంటున్నారు. ఆయన కూడా బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు అని అంటున్నారు. ఫైర్ బ్రాండ్ గా పేరున్న ఆయనకు ఇస్తే జిల్లాలో మరింతగా బీజేపీ బలపడడంతో పాటు కాంగ్రెస్ నుంచి నేతలను ఆకట్టుకోవడం సులువు అవుతుందని కూడా భావిసున్నారుట. మొత్తానికి తెలంగాణా బీజేపీలో కేంద్ర మంత్రి పదవుల మీద హాట్ డిస్కషన్ అయితే సాగుతోంది.