Begin typing your search above and press return to search.

విడాకుల దిశగా ములాయం కొడుకు అడుగులు?

సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం ఇంట ఇప్పుడు విడాకుల మంట నడుస్తోంది. అయితే.. దీనికి సంబంధించి పరిణామాలు అనూహ్య ట్విస్టులు నెలకొన్నాయి.

By:  Garuda Media   |   20 Jan 2026 10:39 AM IST
విడాకుల దిశగా ములాయం కొడుకు అడుగులు?
X

సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం ఇంట ఇప్పుడు విడాకుల మంట నడుస్తోంది. అయితే.. దీనికి సంబంధించి పరిణామాలు అనూహ్య ట్విస్టులు నెలకొన్నాయి. ఆయన రెండో భార్య కొడుకు వైవాహిక జీవితం విడాకుల దిశగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి అతను పెట్టిన పోస్టులు ఇప్పుడు సంచలనంగా మారాయి. ములాయం సింగ్ యాదవ్ కు ఇద్దరు భార్యలు. ఆయన రెండో భార్య సాధన కొడుకు పేరు ప్రతీక్. అతడి భార్య పేరు అపర్ణా యాదవ్. వీరిద్దరి మధ్య కొంతకాలంగా సరైన సంబంధాలు లేవన్న మాట వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా.. తాజాగా ప్రతీక్ సోషల్ మీడియాలో తన భార్య తీరును తీవ్రంగా తప్పు పడుతూ పోస్టులు పెట్టాడు. అపర్ణ వల్ల తమ కుటుంబ సభ్యుల మద్య అనుబంధాలు దెబ్బ తిన్నాయన్న ఆరోపణలు చేసవాడు కీర్తి.. పరపతి సాధించాలనే వ్యక్తిగత స్వార్థంతో ఆమె తమ కుటుంబాన్ని ధ్వంసం చేశారంటూ విరుచుకుపడ్డారు. అపర్ణ విషయానికి వస్తే.. ఆమె 2017లో లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి సమాజ్ వాదీ పార్టీ టికెట్ మీద అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు

అనంతరం ఆమె 2022లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేయటం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం యూపీ రాష్ట్ర మహిళా కమిషన్ ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న ఆమె తీరును భర్త ప్రతీక్ తప్పు పట్టారు. స్వార్థపరురాలైన తన భార్య నుంచి విడాకులు తీసుకోనున్నట్లు ప్రకటించాడు. ‘ఈ బంధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని అనుకుంటున్నా’ అంటూ తన ఇన్ స్టా హ్యాండిల్ లో పోస్టు పెట్టాడు.

ఇదిలా ఉండగా అపర్ణా యాదవ్ వ్యక్తిగత సహాయకుడు మాత్రం అందుకు భిన్నమైన రీతిలో వ్యాఖ్యానించాడు. ఒక ప్రముఖ మీడియా చానల్ తో మాట్లాడిన అతను.. ప్రతీక్ యాదవ్ ఇన్ స్టా అకౌంట్ హ్యాక్ అయ్యిందని.. ఎవరో తప్పుడు పోస్టులు పెట్టారని.. భార్యభర్తల మధ్య ఎలాంటి పంచాయితీలు లేవని వివరణ ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. ఈ ఉదంతంపై అటు ప్రతీక్ కానీ.. ఆయన సతీమణి అపర్ణ కానీ ఓపెన్ గా పెదవి విప్పట్లేదు. మరోవైపు.. ఆమె ఫోన్ స్విచ్ఛాప్ వస్తోంది. ఇదిలా ఉంటే.. తన భార్య సహాయకుడు చేసిన వ్యాఖ్యలకు ప్రతీక్ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందన్నది ఇప్పుడు అసలు ప్రశ్నగా చెప్పాలి.