Begin typing your search above and press return to search.

ఏపీలో ఫ్లాష్ ఫ్లడ్స్...మూడు జిల్లాలపై ఫుల్ ఫోకస్

ఏపీలో మూడు జిల్లాలలో ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దిత్వా తుఫాన్ ప్రభావం భీకరంగా ఉందని అంటున్నారు.

By:  Satya P   |   29 Nov 2025 11:34 PM IST
ఏపీలో ఫ్లాష్ ఫ్లడ్స్...మూడు జిల్లాలపై ఫుల్ ఫోకస్
X

ఏపీలో మూడు జిల్లాలలో ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దిత్వా తుఫాన్ ప్రభావం భీకరంగా ఉందని అంటున్నారు. ఇప్పటికే శ్రీలంకలో దిత్వా తన విశ్వ రూపాన్ని చూపించింది. దాంతో తమిళనాడులో చెన్నై సహా కీలక ప్రాంతాలలో దిత్వా బలంగా ఉనికిని చాటుకుంటోంది. ఇక ఏపీలో దక్షిణ కోస్తా జిల్లాలలో కూడా దిత్వా ప్రభావం అధికంగా ఉంటుందని అంటున్నారు దిత్వా తుపాను ప్రభావంతో రానున్న రెండు రోజులు దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఫుల్ అలెర్ట్ గా :

ఏపీలో ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. అదే విధంగా గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అలాగే అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

అక్కడ కూడా :

కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. దీంతో హోం,విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తం అయింది.

మండలస్థాయిలో కంట్రోల్ రూమ్స్ :

అత్యవసర సహాయక చర్యల కోసం కడపలో 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, వెంకటగిరిలో 3 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉంచామని అధికారులు వెల్లడించారు. అలాగే విపత్తుల నిర్వహణ సంస్థలోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి తుపాను గమనాన్ని పర్యవేక్షిస్తూ ప్రభావం చూపే జిల్లాల యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అలెర్ట్ చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి జిల్లాల్లో మండలస్థాయి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని సూచనలు ఇచ్చామన్నారు.

మత్స్యకారులు వెనక్కి

ముందస్తుగానే ప్రభుత్వ శాఖల వారీగా తీసుకోవాల్సిన ఉపశమన చర్యలపై ఆదేశాలు జారీ చేశామని అధికారులు చెబుతున్నారు. సముద్రంలో వేటకి వెళ్లిన మత్స్యకారులని వెనక్కి రప్పించామని, రైతాంగానికి భారీవర్షాల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తం చేశామన్నారు. ప్రజలను హెచ్చరిక సందేశాలు పంపిస్తున్నామన్నారు. ఫ్లాష్ ఫ్లడ్స్ సూచనలు ఉన్నందువల్ల ఫుల్ అలెర్ట్ గా ఉండాలని అధికారులు సూచించారు.