Begin typing your search above and press return to search.

జిల్లాకో మాట‌.. విభ‌జ‌న అయ్యేనా ..!

జిల్లాల విభజన అంశం టిడిపిలో వివాదానికి దారి తీస్తోంది. నియోజకవర్గాల స్థాయిలో ఎమ్మెల్యేలు కొన్ని జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నారు.

By:  Garuda Media   |   29 Aug 2025 12:00 PM IST
జిల్లాకో మాట‌.. విభ‌జ‌న అయ్యేనా ..!
X

జిల్లాల విభజన అంశం టిడిపిలో వివాదానికి దారి తీస్తోంది. నియోజకవర్గాల స్థాయిలో ఎమ్మెల్యేలు కొన్ని జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నారు. పార్లమెంటు స్థాయిలో ఉన్న నాయకులు అలా విభజించటం సరికాదని పేర్కొంటున్నారు. దీంతో పలు జిల్లాల్లో నాయకుల మధ్య విభేదాలు తలెత్తాయి. వాస్తవానికి మార్కాపురం నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలన్న వాదన వైసిపి హయాం నుంచి ఉంది. ఇటీవల దీనిపై పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. కానీ ఇప్పుడు మార్కాపురం ఎమ్మెల్యే జిల్లాను ఏర్పాటు చేస్తే రాజకీయంగా తనకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని పార్టీకి లేఖ రాయటం సంచలనంగా మారింది.

అదేవిధంగా రాజంపేట పార్లమెంటు స్థానంలోనూ ఇలాంటి వివాద‌మే నడుస్తోంది. గతంలో రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేశారు. దానిని రాజంపేట కేంద్రంగా ఏర్పాటు చేయాలన్న వాదన వినిపించింది. కానీ, రాజంపేటలో వైసిపి బలంగా ఉండటం, రాజంపేట ఎంపీ కూడా వైసిపి నాయకుడే కావడంతో ప్రస్తుతం రాయచోటి కేంద్రంగానే ఉంచాలని రాయచోటి ఎమ్మెల్యే మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి కోరుతున్నారు. దీనికి సంబంధించి ఆయన కూడా లేఖ‌ ఇచ్చారు.

ఇక ఎన్టీఆర్ జిల్లా విషయానికొస్తే జిల్లా పేరు మార్చాలనేది కొన్నాళ్లుగా ఉన్న డిమాండ్. దీనికి కొంతమంది సానుకూలత‌ వ్యక్తం చేస్తుండగా మరికొందరు మాత్రం ప్రస్తుతం ఉన్న పేరుని కొనసాగించాలని కోరుతున్నారు. వాస్తవానికి ఎన్టీఆర్ పుట్టిన ప్రాంతం ఎన్టీఆర్ జిల్లా పరిధిలో లేకపోవడంతో ఈ జిల్లాకు పేరు మార్చి ఎన్టీఆర్ పుట్టిన ప్రాంతం ఉన్న కృష్ణ జిల్లాకు ఆయన పేరు పెట్టాలనేది ప్రధాన డిమాండ్. అయితే దీనిపై కూడా కొందరు విబేధిస్తున్నారు. ఇక ఏలూరు జిల్లా విషయానికి వస్తే దీనికి రంగా పేరు పెట్టాలని ఒక వర్గం డిమాండ్ చేస్తుండగా. మరో వర్గం వేరే జిల్లాకు రంగా పేరు పెట్టుకోవాలని చెబుతోంది.

ఏలూరు జిల్లాకు రంగా పేరు వద్దని కోరుతుండడం విశేషం. ఇలా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పేర్లు మార్పు నుంచి జిల్లా కేంద్రాలు ఏర్పాటు వరకు కూడా పరిస్థితి డోలాయ‌మానంగా మారింది. దీనిపై ఏర్పాటైన మంత్రి అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్‌ కమిటీ వీటిని ఏ విధంగా పరిష్కరిస్తుందో చూడాలి. ప్రస్తుతానికైతే ఎమ్మెల్యేలు ఎంపీలు నుంచి అనేక అభ్యంత‌రాలు, వివాదాలు వస్తుండడం వీటిని పరిష్కరించే విషయంలో రాజకీయాలు చోటుచేసుకునే అవకాశం ఉండటంతో జిల్లాల విభజన ముందుకు పోవడం క‌ష్టంగా ఉంద‌ని పార్టీ నాయ‌కులు చెబుతున్నారు.