సీఎం యోగి ఎంట్రీ.. దిశా పటానీ ఇంటి వద్ద కాల్పుల నిందితుల ఎన్ కౌంటర్
ఆరు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో బాలీవుడ్ నటి దిశా పటానీ ఇంటి వద్ద కాల్పుల ఉదంతం చోటు చేసుకోవటం.. ఇది కాస్తా పెను సంచలనంగా మారటం..
By: Garuda Media | 18 Sept 2025 10:01 AM ISTఆరు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో బాలీవుడ్ నటి దిశా పటానీ ఇంటి వద్ద కాల్పుల ఉదంతం చోటు చేసుకోవటం.. ఇది కాస్తా పెను సంచలనంగా మారటం.. బాలీవుడ్ నటీనటుల భద్రతపై సందేహాలు వ్యక్తం కావటం.. ఈ వ్యవహారంపై భారీగా చర్చ జరుగుతున్న వేళలో.. రెండు రోజుల క్రితం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ స్పందించటం.. నిందితులపై కఠిన చర్యలు ఖాయమని దిశా పటానీ కుటుంబ సభ్యులకు హామీ లభించిన రోజు తర్వాత నిందితులు ఎన్ కౌంటర్ తాజా సంచలనంగా మారింది.
ఆరో రోజుల క్రితం జరిగిన కాల్పుల ఘటనకు మూలం ఆగస్టులో దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ చేసిన పోస్టుగా చెబుతున్నారు. ఇంతకూ అసలు వివాదం ఏమిటి? చివరకు అదెన్ని మలుపులు తిరిగి.. ఎన్ కౌంటర్ వద్దకు చేరిందన్న విషయంలోకి వెళితే.. పలు అంశాలు వెలుగు చూస్తాయి. ముందుగా ఆరు రోజుల క్రితం ఏం జరిగింది? అన్న విషయంలోకి వెళితే.. ఆ తర్వాత ఈ ఘటనకు నేపథ్యంగా చెబుతున్న ఆగస్టులో దిశా సోదరి పెట్టిన వీడియోలోకి వెళదాం.
బరేలీలోని కోత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌపాల చౌరామా సమీపంలో బాలీవుడ్ నటి దిశా పటానీ ఇంటి వద్ద (విల్లా నంబరు 40).. ఆమె నివాసంపై గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు బైకుల మీద వచ్చి ఆరు నుంచి ఏడు రౌండ్ల వరకు కాల్పులు జరిపారు. సెప్టెంబరు 12 తెల్లవారుజామున మూడు గంటల నుంచి నాలుగున్నర గంటల మధ్య ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలో లక్కీగా ఎవరికీ ఏమీ కాలేదు. ఈ ఉదంతంపై పెను సంచలనంగా మారింది. ఇటీవల కాలంలో బాలీవుడ్ కు చెందిన ప్రముఖులు.. సెలబ్రిటీలపై దాడులు జరుగుతున్న ఘటనలు పెరుగుతున్న వేళలో.. ఈ ఘటన కొత్త కలకలాన్ని రేపిందని చెప్పాలి.
కాల్పులు జరిగిన సమయంలో ఇంట్లో దిశా తల్లిదండ్రులతో పాటు.. దిశా సోదరి ఖుష్బూ కూడా ఉన్నారు. దిశాకు ముంబైలో షూటింగ్ ఉండటంతో ఆమె అక్కడ లేనట్లుగా సమాచారం. ఇక.. దిశా పటానీ తండ్రి విషయానికి వస్తే.. ఆయన రిటైర్డు డీఎస్పీ. ఇక.. ఖుష్బూ పటాని విషయానికి వస్తే.. ఆమె ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్ గా పని రిటైర్ అయ్యారు.
ఈ ఘటనకు తమదే బాధ్యతగా పేర్కొంటూ గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్.. రోమిత్ గోదారా గ్యాంగ్ సభ్యులు విరేంద్ర చారణ్.. మహేంద్ర సరణ్ లు ఫేస్ బుక్ ద్వారా తామే కాల్పులకు పాల్పడినట్లుగా ఒప్పుకోవటమే కాదు.. ‘‘సనాతన ధర్మానికి అవమానం చేస్తే మరింత తీవ్ర చర్యలు తీసుకుంటాం. ఇది ట్రైలర్ మాత్రమే’’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. దీనిపై దిశా పటానీ తండ్రి కంప్లైంట్ ఇవ్వటంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కాల్పుల ఉదంతం అనంతరం నిందితులు ఢిల్లీ - లక్నో హైవే ద్వారా పారిపోయారని.. ముందుగా పక్కా రెక్కీ చేసినట్లుగా పోలీసులు అనుమానించారు.
ఇక్కడే.. అసలు వీరు కాల్పులకు తెగపడేంత విషయం ఏం జరిగింది? ఇంతవరకు విషయం ఎందుకు వచ్చింది? అన్న సందేహానికి సమాధానాల్ని వెతికినప్పుడు విషయం ఆగస్టులోకి వెళుతుంది. ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో అప్పుడప్పుడు పోస్టు పెడుతుంటారు. దిశా పటానీ సోదరిగానే ఆమెకు గుర్తింపు ఉంది. ఆగస్టులో పెట్టిన పోస్టులో.. ఆధ్యాత్మిక గురువు అనిరుద్ధాచార్య మహారాజ్ చేసిన లివ్ఇన్ రిలేషన్ షిప్ మీద చేసిన వ్యాఖ్యలకు ప్రతి స్పందనగా ఒక వీడియో పెట్టారు.
ఆధ్యాత్మిక గురువు చేసిన వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ గా వీడియో పెట్టారు. అయితే.. ఆ వ్యాఖ్యాల్ని తప్పు పట్టారు. ఆ వీడియో వైరల్ అయ్యింది. దీంతో.. ఈ వ్యాఖ్యల్ని కొందరు ట్రోలర్లు ఎడిట్ చేసి.. ఆమె మరో ఆధ్యాత్మిక గురువు ప్రీమానంద్ మహారాజ్ పై ఉన్నట్లుగా తప్పుడు ప్రచారం చేశారు. అది కాస్తా పెద్ద ఎత్తున వైరల్ గా మారటమే కాదు.. ఆమెను వివాదంలోకి తీసుకెళ్లింది. ఈ తప్పుడు ప్రచారంతో ఖుష్బూపై ఆన్ లైన్ లో వేధింపులు పెరిగాయి.
ఈ నేపథ్యంలో మరోసారి స్పందించిన ఖుష్బూ తాను చేసిన వ్యాఖ్యలు అనిరుద్దాచార్య చేసిన వ్యాఖ్యల మీదే తప్పించి ప్రీమానంద్ మహారాజ్ మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేస్తూ తన స్పందనను తెలియజేశారు. ఈ ఇష్యూ మీద తన ప్రవచనంలో ప్రీమానంద్ మహారాజ్ స్పందించారు. అనిరుద్ధాచార్య వ్యాఖ్యలకు ఆయన మద్దతు తెలపటంతో పాటు..యువతకు మార్గదర్శకత్వం చేయటానికి కఠిన వ్యాఖ్యలు అవసరని పేర్కొన్నారు. కట్ చేస్తే.. ప్రవచనంలో చేసిన వ్యాఖ్యలకు బదులుగా బరేలీలోని దిశా పటానీ ఇంటి వద్ద కాల్పులతో సమాధానం ఇచ్చే ప్రయత్నం జరిగిందన్న ప్రచారం జరిగింది.
ఈ దాడి అనంతరం ఆమెకు భద్రత పెంచాలని కొందరు.. ప్రముఖుల భద్రత మీద సందేహాల్ని వ్యక్తం చేస్తూ మరికొందరు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగేలా చేసింది. అంతేకాదు.. ఈ మొత్తం ఎపిసోడ్ హాట్ హాట్ గా నడుస్తున్న వేళలో.. ఖుష్బూ పటానీ మరో వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. అందులో ఆమె తమను తాము రక్షించుకోవటానికి కేవలం ఫోన్ కు ఉపయోగించే డేటా కేబుల్ తోనూ సాధ్యమేనని పేర్కొంటూ సవివరంగా వీడియోను పోస్టు చేశారు. లావుగా ఉండే ఫోన్ కేబుల్ ను తీసుకొని.. దానికి నాలుగు ఇనుప రివిట్లు వేసి.. దాడి చేసే వారికి ఎలా సమాధానం ఇవ్వాలో అందులో చూపించారు. భద్రత కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా సూచనలు చేశారు.
దీంతో.. తమను చంపుతామని బెదిరిస్తున్న వారికి తన వీడియోతో సరైన సమాధానం ఇచ్చిందన్న వాదనలు వినిపించాయి. ఇంట్లో ఉండే సాదాసీదాగా కనిపించే వస్తువులతో ఎఫెక్టివ్ గా ఎలా సేవ్ చేసుకోవాలో చెప్పటంతో పాటు.. అందుకు కాస్తంత కసరత్తు ఎలా చేయాలో స్పష్టం చేశారు. ఈ వీడియోను పలువురు ప్రశంసించగా.. మరికొందరు విమర్శలతో విరుచుకుపడ్డారు. పలువురు నెటిజన్లు ఆమెకున్న ధైర్యాన్ని.. తెగువను ప్రసంశించారు.
ఈ రచ్చ ఇలా సాగుతున్న వేళ.. ప్రభుత్వంపై విమర్శలు అంతకంతకూ పెరుగుతున్న వేళ.. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ఎంట్రీ ఇచ్చారు. దిశా పటానీ తండ్రికి ఫోన్ చేసిన ఆయన. కాల్పులకు పాల్పడిన నిందితుల్ని అదుపులోకి తీసుకుంటామని.. వారు ఎవరైనా.. ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని సీఎం యోగి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి మాటలు తమ కుటుంబానికి ఎంతో ధైర్యాన్ని కలిగించాయని.. రాష్ట్ర ప్రభుత్వం తమకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారని దిశా తండ్రి తెలిపారు.
భద్రతలో నిర్లక్ష్యం ఉండదని కాల్పులకు కారణమైన వారిని పట్టుకోవటం ఖాయమని స్పష్టంగా చెప్పారన్నారు. కట్ చేస్తే.. సీఎం యోగి హామీ ఇచ్చిన తర్వాత రోజే కాల్పులకు కారణమైన ఇద్దరు నిందితులు ఎన్ కౌంటర్ అయినట్లుగా పోలీసులు వెల్లడించారు. కాల్పుల ఘటనకు చెందిన నిందితులు పోలీసులు జరిపిన కాల్పుల్లో హతమైనట్లుగా ఢిల్లీ పోలీసులు కన్ఫర్మ్ చేశారు. కాల్పులకు పాల్పడిన వారు ఎక్కడున్నా పట్టుకొని తీరుతామని సీఎం చెప్పిన తర్వాతి రోజే ఎన్ కౌంటర్ జరగటం సంచలనంగా మారింది.
ఘాజియాబాద్ లోని ట్రోనికా సిటీలో కాల్పులకు పాల్పడిన నిందితులు ఉన్నట్లుగా యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్సు.. ఢిల్లీ పోలీసుల జాయింట్ టీం గుర్తించింది. వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో కాల్పులు.. ఎదురు కాల్పులు జరిగాయి. ఈ క్రమంలో నిందితులు ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించే వేళలోనే ఈ ఇద్దరు మరణించారు. వీరిని రవీంద్ర.. అరుణ్ లుగా పోలీసులు గుర్తించారు. వీరు. రోహిత్ గోదారా - గోల్డీ బ్రార్ ముఠా సభ్యులుగా పోలీసులు చెబుతున్నారు. ఘటనాస్థలం నుంచి పెద్ద ఎత్తున పిస్టళ్లు.. బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు మొత్తంగా పలు మలుపులు తిరిగిన ఒక వివాదాంశం చివరకు ఎన్ కౌంటర్ తో ఒక కొలిక్కి వచ్చినట్లుగా చెప్పాలి. రానున్న రోజుల్లో ఈ మొత్తం వివాదం మరెన్ని మలుపులు తిరుగుతుందో?
