Begin typing your search above and press return to search.

అపరిచితుడివి నీవే !

కానీ తమ గురించి తమలోని ప్రతిభ గురించి, తమలోని మంచిని లేక తమకు అవసరం లేని చెడు గురించి ఆలోచించుకుని విశ్లేషించుకున్నారా అంటే లేదు అనే ఎక్కువగా సమాధానం చెబుతారు.

By:  Satya P   |   22 Dec 2025 12:15 AM IST
అపరిచితుడివి నీవే !
X

నీవు ఎవరితో మాట్లాడితే ఎక్కువ ఆనందమో తెలుసా. ఆ వ్యక్తి ఉన్నత స్థాయిలో ఉండాల్సిన అవసరం లేదు, లేదా పేరు ప్రఖ్యాతులు ఉండి తీరాలని కండిషన్ కూడా లేదు, అతను నీలా ఉంటే చాలు, నీలా ఉండడం అంటే నీవే అన్న మాట. అవును నీవే. అదేంటి నేను నాతో మాట్లాడుకోవడమేంటి అని డౌటానుమానం నీకు రావచ్చు. కానీ అది నిజం. నిజంగా మనలో ఎంతమంది తన గురించి తాము ఆలోచిస్తున్నారు అంటే జవాబు చెప్పడం కష్టం. ఎవరూ కూడా ఎదుటి వారి గురించి ఆలోచించేదుకే సమయం సరిపోదు, వారి మీద అసూయ అక్కసు పెంచుకుని పోటీతో పడి ఏడుస్తూనే జీవితంలో పుణ్య కాలం అంతా ఇట్టే పోనిస్తున్నారు. కానీ తమ గురించి తమలోని ప్రతిభ గురించి, తమలోని మంచిని లేక తమకు అవసరం లేని చెడు గురించి ఆలోచించుకుని విశ్లేషించుకున్నారా అంటే లేదు అనే ఎక్కువగా సమాధానం చెబుతారు.

మంచి నేస్తంగా :

ఈ ప్రపంచంలో నీకు నీవే మంచి నేస్తానివి. అది గుర్తించాల్సింది కూడా నీవే. నీకు తెలియని ఒక మనిషి నీలో ఉన్నాడు. వింత విడ్డూరం ఏమిటి అంటే నీ గురించి నీకే తెలియదు అన్నది. నీవు అందరి గురించి బాగా చెబుతారు. చాలా మందికి చెందిన విషయాలు నీ మెదడులో ఉంచుకుని వాటినే స్మరిస్తావు. కానీ ఎపుడైనా నీ గురించి నీవు ఏకంతంగా ఆలోచించుకున్నావా. నీకు సంబంధించిన విషయాల గురించి విశ్లేషించుకున్నావా. నీ ప్లస్ లు నీ మైనస్ లు మననం చేసుకున్నావా. ఒక్కసారి అలా ఆలోచించు. అపుడు నీలో ఎంతో మార్పు వస్తుంది. నీ జీవితంలోనే పురోగతి వస్తుంది. నీ గురించి ఎక్కువగా నీవు తెలుసుకుంటే నీ బలమే ఒక్కసారిగా పెరుగుతుంది. నీ విజయాల రేటు కూడా పెరుగుతుంది.

ఎంతో మార్పు :

తన గురించి తాను తెలుసుకున్న వాడే గొప్పవాడు. ఈ ప్రపంచంలో ఎంతో మందితో పరిచయం ఉందని వారంతా తనకు తెలుసు అని గొప్పలకు పోయే వారు అంతా తమ గురించి తెలుసుకోవడంలో మాత్రం బాగా వెనకబడుతూ ఉంటారు. నిజానికి అది ఎంత తప్పో వారికి ఎప్పటికీ అర్ధం కాదు. నీ గురించి నీవు కాకుండా ఎక్కువగా ఎవరు ఆలోచిస్తారు అన్నది కనుక బుర్రకు తడితే అపుడే గణనీయమైన మార్పు నీలో తప్పకుండా వస్తుంది. ఏ వైపున నడవాలో ఏమి చేయాలో భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దుకోవాలో కూడా స్పష్టంగా అర్ధం అవుతుంది.

ప్రతీ రోజూ సంతోషం : :

ఏకాంతం అన్నది ఒక మంచి ఉపశమనం. అలా ఏకాతంగా రోజులో కొంత సేపు కూర్చుని నీ గురిచి నీవు ఆలోచించుకుంటే వచ్చే సంతోషం వేరే దాంట్లో ఉండదు. అది మాటలలో చెబితే అర్థం కాదు, కానీ ఎవరికి వారుగా సాధన చేస్తేనే తెలుస్తుంది. ఇది కూడా ఒక తపస్సు. ఇది కూడా ఒక యోగమే. దానికి పొందాలీ అంటే డైలీ టైం టేబుల్ లో నీవు అనే నేస్తానికి కొంత సమయం తప్పకుండా ఇవ్వాల్సిందే. అలా అంతర్మధనం చేసుకుంటూ సాగితే నీలో నీవు మాట్లాడుకుంటూ ఉంటే నీకే తెలియని అపరిచితుడుతో కొత్త బంధం కుదురుతుంది. కొన్నాళ్ళకు అదే విడదీయని బంధం అవుతుంది. అపుడు ఆ నేస్తం నీవే వీడనంతగా పెనవేసుకుని పోతాడు. మనసుతో మాట్లాడే ప్రతీ మాట అలా అక్కడే పదిలంగా నిక్షిప్తం అవుతుంది. అది నీవంటే ఏమిటో ఎప్పటికపుడు చెబుతుంది. ఆత్మ న్యూనతలు, తక్కువ ఎక్కువలు లేని బ్యాలెన్స్ కుదురుతుంది. అపుడు నిజమైన నీవేంటే బయటకు వస్తావు. ఆ వాస్తవిక దృష్టి కోణంలో నీవు సమాజంలో ఏదైనా సాధించాలనుకుంటే తప్పకుండా సాధిస్తావు.