Begin typing your search above and press return to search.

'అవును.. నేను దిమాగీ నక్సల్ నే!'.. ప్రధాని వ్యాఖ్యలపై రివర్స్ అటాక్!

దేశంలోని ప్రముఖులు చేస్తున్న విమర్శనాత్మక వ్యాఖ్యలపై ప్రజలు వ్యంగ్యంగా స్పందించడం ఒక ట్రెండ్ గా మారింది.

By:  Tupaki Political Desk   |   18 Aug 2026 12:49 PM IST
అవును.. నేను దిమాగీ నక్సల్ నే!.. ప్రధాని వ్యాఖ్యలపై రివర్స్ అటాక్!
X

దేశంలోని ప్రముఖులు చేస్తున్న విమర్శనాత్మక వ్యాఖ్యలపై ప్రజలు వ్యంగ్యంగా స్పందించడం ఒక ట్రెండ్ గా మారింది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల్లో ప్రధాని మోదీ ప్రసంగంలో విమర్శకులను అర్బన్ నక్సలైట్లుగా పేర్కొంటూ వారిని దిమాగీ నక్సల్స్ గా అభివర్ణించారు. దీంతో వెంటనే ఎక్స్, ఇన్ స్టాలో దిమాగీ నక్సల్స్ జనతా పార్టీ అంటూ వ్యంగ్య పేజీ మొదలైంది. సరిగ్గా మూడు నెలల క్రితం సుప్రీం సీజేఐ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. మూడు నెలల్లో కోట్లాది మంది జెన్ జీ యువత మద్దతు కూడగట్టుకున్న కాక్రోచ్ పార్టీ కార్యకర్తలు ఢిల్లీని షేక్ చేశారు. విద్యారంగంలో లోపాలను సరిదిద్దాలనే డిమాండ్ తో దేశ రాజధానిలోని ధర్నా చౌక్ అయిన జంతర్ మంతర్ వద్ద వేలమందితో ఆందోళన నిర్వహించి దేశం దృష్టిని ఆకర్షించారు.

సరిగ్గా మూడు నెలల వ్యవధిలో పుట్టికొచ్చిన దిమాగీ నక్సల్స్ జనతా పార్టీ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. కాక్రోచ్ ఉద్యమంతో స్ఫూర్తి పొందిన కొందరు ప్రధాని వ్యాఖ్యలకు నిరసనగా ‘దిమాగీ నక్సల్స్ జనతా పార్టీ’ అంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. ఈ పేజీ ప్రారంభించిన కొద్ది గంటల్లోనే లక్షల మంది ఫాలోవర్లుగా చేరుతున్నారు. ఈ పరిణామాలు గమనిస్తే దేశంలో రోజురోజుకు అసహనం పెరిగిపోతుందా? అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక దిమాగీ నక్సల్స్ జనతా పార్టీ పేజీని ప్రారంభించిన వ్యక్తి తనను తాను దిమాగీ ఇండియన్ గా పరిచయం చేసుకున్నాడు.

ప్రధాని వ్యాఖ్యలకు నిరసనగా పుట్టుకొచ్చిన ఈ దిమాగీ నక్సల్స్ పార్టీ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రస్తుతం ఇన్ స్టాలో ఈ పేజీని సుమారు 2 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఎక్స్ లో సైతం దాదాపు 10 వేల మంది ఫాలోవర్లు చేరారు. మూడు నెలల క్రితం పుట్టిన కాక్రోచ్ పార్టీ కూడా ఇదే మాదిరిగా కొద్దిరోజుల్లోనే కోట్ల మంది ఫాలోవర్లను సంపాదించి సంచలనం సృష్టించింది. ఈ పరిస్థితుల్లో దిమాగీ నక్సల్స్ జనతా పార్టీ ఇంకేం రికార్డులు నమోదు చేస్తుందోనని ఎదురుచూస్తున్నారు.

ఇక ఆగస్టు 15 నాడు ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా విపక్షాలు సైతం తీవ్రస్థాయిలో ఎదురుదాడి చేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులను తొలుత అర్బన్ నక్సల్స్ అంటూ విమర్శలు గుప్పించిన ప్రధాని మోదీ ఇప్పుడు మరింత నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారని, అందుకు ఆయన దిమాగీ నక్సల్స్ అంటూ చేసిన వ్యాఖ్యలే నిదర్శనమంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఇక మరో కాంగ్రెస్ నేత, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం సైతం స్పందించారు. అవును, నేను దిమాగీ నక్సల్ నే అంటూ ఆయన పేర్కొన్నారు. ఇక ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం దిమాగీ నక్సల్ గా ఉండేందుకు గర్విస్తున్నానని ప్రకటించారు. దీంతో ప్రధాని చేసిన వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలో హాట్ డిబేట్ కొనసాగుతోందని అంటున్నారు.

అసలు ‘దిమాగీ నక్సల్స్’ అంటే అర్థం ఏమిటి?

గతంలో సాయుధ పోరాటాలకు పరిమితమైన నక్సలిజం అడవులను దాటి ఇప్పుడు మేధావి వర్గాల్లో, ప్రభుత్వ వ్యవస్థల్లో చేరిందని, వారిని మేధోపరమైన నక్సలైట్లుగా అభివర్ణించడమే ఈ పదసృష్టి ఉద్దేశంగా వ్యాఖ్యానిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలో ఈ పదాన్ని ఉపయోగించారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న వారు, ప్రజావ్యతిరేక విధానాలపై గళం ఎత్తే వారిని ఎత్తిచూపడానికి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని భావించిన నెటిజన్లు, వెంటనే దీన్ని తమ సోషల్ మీడియా పేజీల ద్వారా తిప్పికొట్టడం ప్రారంభించారని చెబుతున్నారు.

ఇదేం ప్రతిఘటన

కాగా, ప్రముఖులు చేస్తున్న వ్యాఖ్యలు ఆధారంగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రతిఘటనపై పెద్ద చర్చే జరుగుతోందని అంటున్నారు. ఇది కేవలం ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజీకో, ఎక్స్ (ట్విట్టర్) ఖాతాకో పరిమితమైన విషయం కాదని అంటున్నారు. దీన్ని "డిజిటల్ సెటైరికల్ రెసిస్టెన్స్" (డిజిటల్ వ్యంగ్య ప్రతిఘటన) అంటుండగా, మరికొందరు "జెన్-జీ పొలిటికల్ పేరడీ ట్రెండ్" గా అభివర్ణిస్తున్నారు. అధికారిక పదజాలాన్నే అస్త్రంగా చేసుకుని, అధికారంలో ఉన్నవారిపై వ్యంగ్యాస్త్రాలు సంధించే వినూత్న ప్రజా ఉద్యమంగా వ్యాఖ్యానిస్తున్నారు.

దేశంలో వందలాది రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ, వాటిలో 90 శాతానికి పైగా పార్టీలు సరైన జనాదరణ లేక, ప్రజల్లోకి వెళ్లలేక కనుమరుగవుతున్నాయి లేదా నామమాత్రపు ఉనికిని మాత్రమే కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో క్షణాల వ్యవధిలో వెల్లువెత్తుతున్న ఇటువంటి వ్యంగ్య ప్రతిస్పందనలపై విస్తృత చర్చ జరుగుతోంది. సంప్రదాయ రాజకీయ పార్టీలు ప్రజల నిజమైన సమస్యలను గాలికొదిలేస్తున్నాయనే భావనతో యువత ఈ వ్యంగ్య ఉద్యమాలను ఆశ్రయిస్తున్నట్లు భావిస్తున్నారు. ఈ పరిణామాలు సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న అసహనానికి, రాజకీయ వ్యవస్థపై పెరుగుతున్న నిరుత్సాహానికి అద్దం పడుతున్నాయని చెబుతున్నారు. సాంప్రదాయ పార్టీలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైతే, డిజిటల్ మాధ్యమాలు కొత్త తరహా రాజకీయ శక్తి కేంద్రాలుగా మారుతాయనే హెచ్చరికను ఈ ట్రెండ్ స్పష్టం చేస్తోంది.