క్యాష్‌లెస్ పెళ్లి.. QR కోడ్ చదివింపులు.. ఇప్పుడిదే ట్రెండ్
వైరల్ వీడియోలో పెళ్లికొడుకు తండ్రి తన జేబుపై QR కోడ్ స్టిక్కర్‌ని ఏర్పాటు చేసుకున్నాడు.
By: A.N.Kumar | 29 Oct 2025 5:05 PM ISTడిజిటల్ యుగంలో ప్రతీ పనీ స్మార్ట్‌ఫోన్‌తో జరిగిపోతున్న ఈ రోజుల్లో, పెళ్లిళ్లు కూడా ఆ సాంకేతిక మార్పుల దిశగా పయనిస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ఇందుకు నిదర్శనం. ఆ వీడియోలో పెళ్లికొడుకు తండ్రి తన జేబుకు ఒక QR కోడ్ స్టిక్కర్ అతికించుకుని, వచ్చిన అతిథుల నుంచి డిజిటల్ రూపంలో ‘చదివింపులు’ సేకరిస్తున్నాడు!
* డిజిటల్ చదివింపులు – కొత్త ట్రెండ్!
హిందూ సంప్రదాయంలో పెళ్లి అనేది ఒక గొప్ప వేడుక. బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు కలిసి కొత్త దంపతులను ఆశీర్వదిస్తారు. సాంప్రదాయంగా వారు నగదు రూపంలో కానుకలు లేదా చదివింపులు ఇస్తూ ఉంటారు. గతంలో ఇవన్నీ ఒక పుస్తకంలో రాసుకునే రీతిలో ఉండేది. ఎవరెవరికి ఇచ్చామో గుర్తుంచుకోవడానికి అలా చేసేవారు.
అయితే ఇప్పుడు కాలం మారింది. ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి యాప్‌ల ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం రోజువారీ జీవితంలో భాగమైపోయింది. ఆ సౌలభ్యం ఇప్పుడు పెళ్లి మండపాలకు కూడా చేరింది.
* పెళ్లికొడుకు తండ్రి జేబులో QR కోడ్!
వైరల్ వీడియోలో పెళ్లికొడుకు తండ్రి తన జేబుపై QR కోడ్ స్టిక్కర్‌ని ఏర్పాటు చేసుకున్నాడు. పెళ్లికి వచ్చిన వారు అందులోని కోడ్‌ను స్కాన్ చేసి నేరుగా డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అంటే ఇక చేతికి నగదు ఇవ్వడం, పుస్తకంలో పేర్లు రాయడం వంటి వ్యవహారాలు అంతా గతం. “క్యాష్‌లెస్ గిఫ్టింగ్” కొత్త ఫ్యాషన్‌గా మారుతోంది.
* సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు “సాంకేతికతకు ఇది మంచి ఉదాహరణ” అంటుండగా, మరికొందరు “సాంప్రదాయం కూడా డిజిటల్ అవుతోంది” అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు.
ఒక యూజర్ ఇలా రాశాడు.. “ఇక పెళ్లికి క్యాష్ తీసుకెళ్లాల్సిన అవసరమే లేదు. స్కాన్ చేసి బైటే వెళ్లిపోవచ్చు!” ఇంకొకరు మాత్రం “ఇది సౌలభ్యమే కానీ మన సంప్రదాయ మజా మిస్ అవుతున్నాం” అని అభిప్రాయపడ్డారు.
డిజిటల్ ఇండియా ప్రతిభింబం
ఇటువంటి సన్నివేశాలు చూస్తే డిజిటల్ ఇండియా లక్ష్యాలు ఎంత వేగంగా సాధ్యమవుతున్నాయో అర్థమవుతుంది. గతంలో కొందరు స్వైప్ మిషన్లు ఉపయోగించేవారు, ఇప్పుడు QR కోడ్ చెల్లింపులు ఆ స్థానాన్ని దక్కించుకున్నాయి. భవిష్యత్తులో అన్ని పెళ్లిళ్లు, వేడుకల్లో ఇలాంటివే డిజిటల్ చెల్లింపులు ప్రధానంగా మారే అవకాశం ఉందని నెటిజన్లు చెబుతున్నారు.
మొత్తానికి “క్యాష్‌లెస్ పెళ్లి.. QR కోడ్ చదివింపులు” అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది!
