ఆర్ఎస్ఎస్ ఆదేశాలతోనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా! కేంద్రంపై సంఘ్ ఆగ్రహాం?
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీసిన పరిణామాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
By: Tupaki Political Desk | 26 July 2026 4:00 AM ISTకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీసిన పరిణామాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఢిల్లీలో విద్యార్థుల ఆందోళన, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కార్యకర్తల ఒత్తిడి వల్లే కేంద్ర మంత్రి రాజీనామా చేశారనే ప్రచారంలో కొంతవరకు వాస్తవం ఉన్నప్పటికీ బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ ఆగ్రహమే అసలు కారణమనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనలను సామరస్యంగా పరిష్కరించేలా కేంద్రం ప్రవర్తించలేదని, ఒక కేంద్ర మంత్రి కోసం అంత ప్రతిష్లకు వెళ్లాల్సిన అవసరం లేదని సంఘ్ పరివార్ ముఖ్యనేతలు అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. దీంతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సివచ్చిందని అంటున్నారు.
నీట్ పేపర్ లీక్ వెలుగు చూసిన నుంచి పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్న సంఘ్ పరివార్ నేతలు ఈ నెల 20న చోటుచేసుకున్న ఉద్రిక్తతల విషయంలో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా పార్లమెంటు మార్చ్ కు ముందుగానే విద్యార్థులతో చర్చలకు కేంద్రం సిద్ధమైతే ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు. విద్యార్థులపై బలప్రయోగం చేయడం తప్పుడు సంకేతాలిచ్చినట్లు ఆర్ఎస్ఎస్ నేతలు భావిస్తున్నారని అంటున్నారు. ఈ కారణంగానే విద్యా మంత్రితో రాజీనామా చేయించి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని సంఘ్ పరివార్ నేతలు కేంద్ర పెద్దలకు సూచించారని చెబుతున్నారు.
ఈ విషయంలో సంఘ్ పరివార్ ఆగ్రహాన్ని కేంద్ర మాజీ మంత్రి, ఆర్ఎస్ఎస్ ప్రముఖుడు మురళీమనోహర్ జోషి ప్రకటన ద్వారా కేంద్రం గుర్తించిందని చెబుతున్నారు. విద్యార్థుల ఆందోళనలకు తాను మద్దతుగా ఉంటానని, వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని సీనియర్ నేత మురళీమనోహర్ జోషి సూచించారు. అంతేకాకుండా విద్యార్థుల ఉద్యమంలో న్యాయం ఉందని ఆయన వ్యాఖ్యానించడం కేంద్ర ప్రభుత్వ పెద్దలను విస్మయానికి గురిచేసిందని చెబుతున్నారు. జోషి వ్యాఖ్యలు ఆర్ఎస్ఎస్ అభిప్రాయంగానే భావించిన ప్రభుత్వ పెద్దలు ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కేంద్ర మంత్రితో రాజీనామా చేయించారని చెబుతున్నారు.
ఈ పరిణామంతో బీజేపీ విధానపరమైన నిర్ణయాల వెనుక ఆర్ఎస్ఎస్ పాత్రపై మరోమారు చర్చ జరుగుతోంది. ప్రధాని మోదీ వంటి సమర్థులైన నేతలు కూడా ఆర్ఎస్ఎస్ అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందేనని ఈ ఘటన స్పష్టం చేసిందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో ఆర్ఎస్ఎస్ అనుబంధం ఉన్నప్పటికీ పదవులు సేఫ్ కాదన్న సంకేతాలు పంపినట్లైందని అంటున్నారు. రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ కు సంఘ్ తో దశాబ్దాల అనుబంధం ఉన్నప్పటికీ ప్రభుత్వ ప్రతిష్టే ముఖ్యమని ఆర్ఎస్ఎస్ ప్రముఖులు భావించారని అంటున్నారు. ఇదే విషయాన్ని ప్రధాని మోదీకి తెలియజేయడంతో ఆయన కూడా ఏకీభవించారని అంటున్నారు.
