Begin typing your search above and press return to search.

ధర్మేంద్ర ప్రధాన్ పదవి పదిలమే.. ప్రధాని మోదీ ప్రశంసలతో సేఫ్ జోన్ లో కేంద్ర మంత్రి!

కేంద్ర కేబినెట్ విస్తరణతో తన పదవి ఊడిపోతుందని జరుగుతున్న ప్రచారాన్ని ఏ మాత్రం లేక చేయకుండా ఆయన తన పని తాను చేసుకుపోతున్నారని అంటున్నారు.

By:  Tupaki Political Desk   |   30 Jun 2026 5:27 PM IST
ధర్మేంద్ర ప్రధాన్ పదవి పదిలమే.. ప్రధాని మోదీ ప్రశంసలతో సేఫ్ జోన్ లో కేంద్ర మంత్రి!
X

కేంద్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణపై ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఎవరి పదవి ఊడుతుంది? ఎవరికి కొత్తగా అవకాశం దక్కుతుంది? అన్నదే ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా నీట్-యూజీ పేపర్ లీకేజీ వివాదం తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై వేటు తప్పదనే ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, బీజేపీ రాజకీయాలు, ప్రధాని మోదీ శైలిని గమనిస్తే ప్రస్తుతానికి ప్రధాన్ పదవికి ఎలాంటి ఢోకా లేదని అవగతమవుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా తన పదవిపై పూర్తి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర కేబినెట్ విస్తరణతో తన పదవి ఊడిపోతుందని జరుగుతున్న ప్రచారాన్ని ఏ మాత్రం లేక చేయకుండా ఆయన తన పని తాను చేసుకుపోతున్నారని అంటున్నారు.

ఆ ఆందోళనలు మేలు చేశాయా?

నీట్ పేపర్ లీక్ వివాదం గాలివానలా మారడంతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవికి గండమనే ప్రచారం విస్తృతంగా జరిగింది. నీట్ కు తోడు సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో గందరగోళం కూడా ఆయన పదవికి ముప్పు తెచ్చిందని టాక్ వినిపించింది. అయితే బీజేపీ రాజకీయాలపై అవగాహన ఉన్న వారు మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపడేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే నీట్, సీబీఎస్ఈ పరిణామాల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున కొనసాగిన ఆందోళనలే ఆయన పదవిని కాపాడాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు పలు ఉదంతాలను ఉదహరిస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో విపక్షాల నిరసనలకు తలొగ్గి మంత్రులను తొలగించిన సందర్భాలు అత్యంత అరుదు అంటున్నారు. గతంలో ఎం.జె. అక్బర్ వంటి వారు కొన్ని అనివార్య కారణాలతో తప్పుకున్నా, అది కూడా వ్యక్తిగత వివాదాల వల్ల మాత్రమేనన్న విషయాన్ని ఎత్తిచూపుతున్నారు. 12 ఏళ్ల మోదీ పాలనలో చాలామందిని మంత్రి పదవుల నుంచి తొలగించిన సందర్భాలు ఉన్నప్పటికీ అవి పూర్తిగా ప్రభుత్వ పాలన సౌలభ్యం కోసం తీసుకున్న నిర్ణయాలే అంటున్నారు. కానీ, విపక్షాల ఒత్తిళ్ల వల్ల మంత్రులను మార్చే సంప్రదాయం మోదీకి లేదని చెబుతున్నారు. లడఖ్ కోసం పోరాడే సోనమ్ వాంగ్చుక్ వంటి వారిని కూడా ఎదుర్కొన్న ఈ ప్రభుత్వం, కేవలం నిరసనలకే లొంగిపోతుందనుకోవడం పొరపాటేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రధాని మెప్పు పొందిన మంత్రి!

ధర్మేంద్ర ప్రధాన్ పదవి పదిలంగా ఉండటానికి ప్రధాన కారణం ఆయన పనితీరుపై ప్రధాని మోదీకి ఉన్న నమ్మకమే అన్న టాక్ కూడా ఉంది. ఇటీవల ప్రధాన్ 57వ పుట్టినరోజు సందర్భంగా, ‘జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడంలో ప్రధాన్ అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నారు’ అంటూ ప్రధాని మోదీ కొనియాడారు. పార్టీ అధిష్ఠానం అప్పగించిన బాధ్యతలను, వివాదాలకు తావు లేకుండా పూర్తి చేయడంలో ఆయన దిట్టగా ఖ్యాతి గడించారని మోదీ ప్రశంసతో తేలిపోయిందని చెబుతున్నారు. అందుకే, 2014 నుంచి ఆయన నిరంతరంగా కేంద్ర కేబినెట్‌లో కొనసాగుతున్నారని అంటున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు నమ్మినబంటుగా ఉన్న ప్రధాన్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించరనే గట్టి వాదన వినిపిస్తోంది.

ఇక పేపర్ లీక్ వంటి ఘటనలతో కేంద్ర మంత్రిని తప్పించడం అంటే ప్రభుత్వ ప్రతిష్టకు నష్టంగా బీజేపీ అధిష్టానం భావిస్తోందని చెబుతున్నారు. గత రెండు దశాబ్దాలుగా దేశంలో జరిగిన వివిధ పరీక్షల లీకేజీ ఉదంతాలను పరిశీలిస్తే, ఇది ఏ ఒక్క ప్రభుత్వానికి మాత్రమే పరిమితమైన సమస్య కాదని బీజేపీ నేతలు చెబుతున్నారు. 2002 నుంచి 2025 మధ్య దాదాపు 45 పెద్ద లీకేజీ కేసులు నమోదయ్యాయని, అందుకు బాధ్యత వహిస్తూ ఎవరూ రాజీనామా చేసిన ఉదంతాలు లేవని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ ను బలి పశువు చేస్తారని అనుకోవడం తప్పుడు అంచనానే అంటున్నారు.