Begin typing your search above and press return to search.

ధర్మేంద్ర ప్రధాన్...ఏం చేయబోతున్నారు ?

ఈ నేపధ్యంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో అత్యవసరంగా భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

By:  Satya P   |   21 July 2026 12:58 AM IST
ధర్మేంద్ర ప్రధాన్...ఏం చేయబోతున్నారు ?
X

కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాని ఏమి చేయబోతున్నారు అన్నది ఇపుడు అంతా నడుస్తున్న చర్చ. కాక్రోచ్ జనతా పార్టీ ఆయన రాజీనామా కోరుతూ పార్లమెంట్ దాకా మార్చ్ ని నిర్వహించింది. అలాగే సామాజిక కార్యకర్త సోనం వాంగ్ చుక్ కూడా ఇదే అంశం మీద ఏకంగా 20 రోజుల పాటు జంతర్ మంతర్ వద్ద అమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఇంకో వైపు చూస్తే కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కాక్రోచ్ పార్టీ ప్రతినిధులు చర్చలు జరిపి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఆయనకు అందించారు. ఈ నేపధ్యంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో అత్యవసరంగా భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

పార్లమెంట్ బయటా లోపలా :

ఇక పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు తొలిరోజే సభ ఏమీ జరగకుండా వాయిదాలతో గడచిపోయింది. సభలో విపక్షాలు అన్నీ కలసి నీట్ పరీక్షా పత్రం లీకేజ్ అంశాన్ని ప్రస్తావించారు. సభను జరగకుండా అడ్డుకున్నారు. దాంతో ఎటువంటి సభా కార్యక్రమాలు జరగకుండానే రెండు సభలూ వాయిదా పడ్డాయి. మరో వైపు చూస్తే పార్లమెంట్ బయట కాక్రోచ్ పార్టీ ఆందోళనలు ఘర్షణలతో ఢిల్లీ వీధులు వేడెక్కాయి. దీంతో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అలెర్ట్ అయినట్లుగా అంటున్నారు. హోం మంత్రి అమిత్ షా అత్యవసరంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ని పిలిపించుకొని చర్చించడం కూడా ఆసక్తిని రేపింది.

రాజీనామా చేస్తారా :

ఈ పరిణామాల క్రమంలో అమిత్ షా ధర్మేంద్ర భేటీలో ఏమి మాట్లాడి ఉంటారు అన్నది సర్వత్రా చర్చించుకుంటున్నారు. కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేస్తారా అన్న ఊహాగానాలు కూడా వ్యాపిస్తున్నాయి. ఆయన విద్యా శాఖను వదులుకుంటారా లేక ఆయన బదులు వేరొకరికి ఆ శాఖను అప్పగిస్తారా అన్నది కూడా వాడి వేడి చర్చగా సాగుతోంది. ఈ మొత్తం పరిణామాలను జాతీయ స్థాయిలో రాజకీయ పక్షాలు అన్నీ ఆసక్తిగా గమనిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తరువాత ఏ అడుగు వేస్తుంది అన్నది అంతా ఆలోచిస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా సాగాలీ అంటే ఏదో ఒకటి చేయడం అనివార్యంగా కేంద్ర పెద్దలకు కనిపిస్తోంది అని అంటున్నారు. అయితే ఏమి చేసినా ఎన్డీయే ప్రభుత్వం మెట్టి దిగి వచ్చినట్లుగా కాకుండా సహజ ప్రక్రియగా జరిగినట్లుగా ఉండాలన్నదే ఎన్డీయే పెద్దల ఆలోచనగా ఉంది అని అంటున్నారు.

కేబినెట్ విస్తరణ ఆలస్యంతో :

నిజానికి కేబినెట్ విస్తరణ జరిగితే ఈపాటికి ధర్మేంద్ర ప్రధాన్ ని తప్పించేవారు అని కూడా చర్చ నడిచింది. అలా చేయడం ద్వారా కాక్రోచ్ పార్టీ కానీ విపక్షాల డిమాండ్ కి కానీ తలొగ్గి తాము చేశామనిపించుకోకుండా మార్పులలో భాగంగానే చేశామని చెప్పుకోవచ్చు అని అనుకున్నారు. కానీ విస్తరణ ఆలస్యం అవుతోంది. దీంతో ఇపుడు ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్యత వచ్చింది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ధర్మేంద్ర ప్రధాని భవితవ్యం ఏమిటి ఏమి జరగనుంది అన్నదే హస్తినలో హాట్ టాపిక్ గా మారింది అని అంటున్నారు.