Begin typing your search above and press return to search.

యాదృచ్ఛికం.. మలుపుతిప్పిన పేపర్ లీక్.. ధర్మేంద్ర ప్రధాన్ జీవితంలో ఆ రెండు ఘటనలు!

ఇప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో అదే పేపర్ లీక్ వివాదంలో కేంద్ర బిందువుగా మారడం యాదృచ్ఛికంగా వ్యాఖ్యానిస్తున్నారు.

By:  Tupaki Political Desk   |   22 July 2026 7:00 PM IST
యాదృచ్ఛికం.. మలుపుతిప్పిన పేపర్ లీక్.. ధర్మేంద్ర ప్రధాన్ జీవితంలో ఆ రెండు ఘటనలు!
X

నీట్ పేపర్ లీక్ వివాదంలో చిక్కుకుని, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు సంబంధించిన ఒక ఆసక్తికర అంశం జాతీయస్థాయిలో చర్చనీయాంశమవుతోంది. ఒడిశాకు చెందిన ధర్మేంద్ర ప్రధాన్ దాదాపు మూడు దశాబ్దాల క్రితం విద్యార్థి నాయకుడిగా అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో పోరాడారు. ఆ సమయంలో పోలీసుల లాఠీ దెబ్బలకు తీవ్రంగా గాయపడినప్పటికీ, తమ డిమాండ్లు నెరవేరే వరకు వెనకడుగు వేయకుండా పోరాటం నడిపారు. విధి విచిత్రం ఏమిటంటే.. నాడు పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా వీధుల్లో పోరాడి రాజకీయంగా ఎదిగిన ఆయనే, ఇప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో అదే పేపర్ లీక్ వివాదంలో కేంద్ర బిందువుగా మారడం యాదృచ్ఛికంగా వ్యాఖ్యానిస్తున్నారు.

విద్యార్థి నాయకుడిగా పోరాటం

మూడు దశాబ్దాల క్రితం ఒడిశాలో జరిగిన పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ సమయంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ధర్మేంద్ర ప్రధాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. ప్రశ్నాపత్రాల లీక్‌తో నిరుద్యోగ యువత, విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చారు.

సుమారు 1,500 మంది విద్యార్థులతో చేపట్టిన ఈ ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నిరసనను అణచివేసేందుకు పోలీసులు జరిపిన లాఠీచార్జిలో విద్యార్థి నాయకుడిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్‌ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల దెబ్బలకు ఆయన ఎముకలు కూడా విరిగినట్లు ఆనాటి సహచరులు గుర్తుచేసుకుంటుంటారు. అంత తీవ్ర గాయాలపాలైనా, రక్తం కారుతున్నా ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఉద్యమాన్ని ముందుండి నడిపించారు.

విద్యార్థి దశలో ప్రదర్శించిన ఆ తెగువ, రాజీలేని తత్వమే ధర్మేంద్ర ప్రధాన్‌ను ఒడిశా రాజకీయాల్లో ప్రముఖుడిగా నిలబెట్టింది. కేంద్ర మాజీ మంత్రి దేవేంద్ర ప్రధాన్ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. ఏబీవీపీ నుంచి క్రమంగా ఎదుగుతూ బీజేపీలో జాతీయ స్థాయిలో కీలక నేతగా మారారు. దాదాపు దశాబ్ద కాలానికి పైగా వివిధ శాఖల్లో కేంద్ర మంత్రిగా సమర్థవంతమైన పనితీరుతో గుర్తింపు తెచ్చుకున్నారు.

అయితే, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆయన గతంలో విద్యార్థి నాయకుడిగా చేసిన పోరాటం, నేడు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఎదుర్కొంటున్న నీట్ వివాదం ఒకదానికొకటి విరుద్ధంగా నిలవడం జాతీయ మీడియాలోనూ చర్చనీయాంశమైంది. ఒకనాడు పేపర్ లీకేజీలపై ఉక్కుపాదం మోపాలని ఉద్యమించిన నేత, నేడు అదే సమస్య కారణంగా విపక్షాల విమర్శలకూ, ఒత్తిడికీ గురికావడం గమనార్హం.