ధర్మస్థలపై సీపీఐ నారాయణ షాకింగ్ వ్యాఖ్యలు! /
కర్ణాటకలోని ప్రసిద్ధ శైవక్షేత్రమైన ధర్మస్థల మిస్టరీ కేసులో ఇటీవల కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
By: Raja Ch | 9 Aug 2025 3:58 PM ISTకర్ణాటకలోని ప్రసిద్ధ శైవక్షేత్రమైన ధర్మస్థల మిస్టరీ కేసులో ఇటీవల కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ ధర్మస్థల పరిసరాల్లో పలువురు మహిళలను, బాలికలను కడతేర్చారన్న ఆరోపణలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్న వేళ.. రంగంలోకి దిగిన ‘సిట్’ పరిశోధనల్లో పుర్రెలు, ఎముకలు వెలుగు చూడటం సంచలనం సృష్టిస్తోంది. ఈ సమయంలో సీపీఐ నారాయణ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
అవును... కర్ణాటకలోని ప్రసిద్ధ శైవక్షేత్రమైన ధర్మస్థల మిస్టరీ కేసు తీవ్ర సంచలనంగా మారిన వేళ ఈ వ్యవహారంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... ఆ ట్రస్ట్ చైర్మన్, సభ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సుమారు 500 మంది అమ్మాయిలపై లైంగిక దాడి చేసి, హత్య చేసి పూడ్చి పెట్టారంటూ ఆరోపణలు చేశారు.
ఈ సందర్భంగా... కర్నాటకలోని ధర్మస్థల ట్రస్ట్ ఒక కుటుంబం చేతిలో ఉందని.. ఆ ట్రస్ట్ కు ఏడాదికి రూ.100 కోట్లు ఆదాయం వస్తుందని.. ఈ నేపథ్యంలో ఆ ట్రస్ట్ చైర్మన్, సభ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని.. ట్రస్ట్ ను ఎండోమెంట్ విభాగం స్వాధీనం చేసుకోవాలని నారాయణ తాజాగా తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలోనే... 500 మందిపై లైంగిక దాడి చేసి హత్య చేసి పూడ్చి పెట్టారని సంచలన ఆరోపణలు చేశారు. అక్కడ తవ్వే కొద్దీ పుర్రెలు, ఎముకలు బయటపడుతున్నాయని.. అసలు అది దేవస్థానమా లేక స్మశాన వాటికా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా... కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి సిట్ వేశారని.. అదే మరో ప్రభుత్వం అయితే ఇది బయటకు వచ్చేది కాదని అన్నారు.
సుప్రీం కీలక నిర్ణయం!:
మరోవైపు.. ధర్మస్థలలో సిట్ చేపట్టిన కార్యాచరణకు, తమకు సంబంధాన్ని అంటగడుతూ కొన్ని ప్రచార మాధ్యమాలు, యూట్యూబర్లు చేస్తున్న ప్రచారాన్ని అడ్డుకోవాలని కోరుతూ ఆలయ ప్రముఖుడు హర్షేంద్ర కుమార్ హెగ్డే వేసుకున్న పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రచార మాధ్యమాలను నియంత్రించాలని పదేపదే కోర్టులను ఆశ్రయించవలసిన అవసరం ఏముందని ప్రశ్నించింది.
